ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chaitanya Yatra : పర్యావరణ గీతిక

ABN, Publish Date - Sep 22 , 2024 | 05:39 AM

‘ఇప్పుడు ఎక్కడ చూసినా కాలుష్యం. జలం, వాయువు, భూమి... తెలిసీ తెలియక మనం చేస్తున్న పనులవల్ల ప్రకృతి కళ తప్పింది. పర్యావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకొంటున్నాయి. ఇవి మనకు ప్రమాద సంకేతాలు.

చైతన్యం

కాలుష్యం లేని ప్రపంచం... ఇదే ఆ బాలిక నినాదం. పర్యావరణంలో సంభవిస్తున్న మార్పులతో... పొంచివున్న ప్రమాదంపై అవగాహన కల్పిస్తూ... ప్రపంచమంతా పర్యటిస్తోంది. ‘మన భూమిని మనమే కాపాడుకొందాం’ అంటూ పిలుపునిస్తోంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటకు చెందిన పదో తరగతి విద్యార్థిని గీతిక... తన చైతన్య యాత్ర గురించి ‘నవ్య’తో ఇలా చెప్పుకొచ్చింది.

‘‘ఇప్పుడు ఎక్కడ చూసినా కాలుష్యం. జలం, వాయువు, భూమి... తెలిసీ తెలియక మనం చేస్తున్న పనులవల్ల ప్రకృతి కళ తప్పింది. పర్యావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకొంటున్నాయి. ఇవి మనకు ప్రమాద సంకేతాలు. పొంచివున్న ఈ పెను ముప్పును గ్రహించకపోతే సమస్త జీవజాతి అంతరించిపోతుంది. మనిషి స్వార్థ్యం, అవగాహనా రాహిత్యమే ఇందుకు కారణం. ఇప్పటికైనా మేల్కొనకపోతే భవిష్యత్తు అంధకారం అవుతుంది. ముఖ్యంగా ఇబ్బడిముబ్బడిగా వ్యర్థాలు భూమికి భారమవుతున్నాయి. మన ముందున్న తక్షణ కర్తవ్యం... భూమాతను కాపాడుకోవడం. అదే నా నినాదం... ‘మన భూమిని మనమే కాపాడుకొందాం’. ఈ నినాదం ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు, పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు దేశదేశాలూ తిరుగుతున్నాను. నేపాల్‌, మలేషియా, శ్రీలంక తదితర దేశాల్లో పర్యటించాను. కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు భారత్‌ అంతా చుట్టివచ్చాను.

  • రీల్స్‌తో మొదలై...

ప్రస్తుతం నేను తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో పదో తరగతి చదువుతున్నా. మాది సాధారణ మధ్యతరగతి కుటుంబం. పర్యావరణం వైపు నన్ను నడిపించింది, నాకు ప్రేరణ కల్పించింది యూట్యూబ్‌ రీల్స్‌. అప్పుడు నేను ఆరో తరగతి చదువుతున్నా. యూట్యూబ్‌లో ఒక షార్ట్‌ వీడియో చూశాను. అందులో భూమికి పొంచివున్న ముప్పు గురించి వివరించారు. అది చూసి భయం వేసింది. మరింత సమాచారం కోసం అలాంటి వీడియోలు రోజూ చూడడం మొదలుపెట్టాను. వాటివల్ల నాకు చాలా విషయాలు తెలిశాయి. మనం ఎంత ప్రమాదంలో ఉన్నామో అర్థమైంది. నిజానికి సామాజిక మాధ్యమాలు, స్మార్ట్‌ఫోన్లను సరైన రీతిలో ఉపయోగించుకొంటే అరచేతిలోనే ఎంతో సమాచారం లభిస్తుంది. అలా సామాజిక మాధ్యమాలనే వేదికగా చేసుకొని, జాతీయ, అంతర్జాతీయ పర్యావరణ బృందాలను పరిచయం చేసుకున్నాను. వారితో చర్చల్లో పాల్గొని అవగాహన పెంచుకున్నాను.


  • ఊరూరా ప్రచారం...

క్రమంగా చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లి, అక్కడి పరిస్థితులు తెలుసుకున్నాను. కొన్నాళ్లకు నేను ఒక వాలంటీర్ల బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాను. వారితో కలిసి ఇతర పట్టణాలు, పల్లెల్లో పర్యటించడం మొదలుపెట్టాను. అక్కడి పరిసరాలను పరిశీలించి, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను వారికి వివరిస్తున్నాను. వెంటనే మేల్కొనకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ, చైతన్యం తెచ్చేందుకు కృషి చేస్తున్నాను. గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు సాగు భూములు తగ్గిపోవడం గమనించాను. అది ఎంతో బాధ కలిగించింది. ‘ఈ పరిణామంవల్ల భూమికి నష్టం వాటిల్లుతుంది. బీడు పెట్టవద్దు. వ్యవసాయం చేయండి. నేలతల్లి పచ్చగా ఉంటేనే ఊరికీ, ఇంటికీ మంచిది. అలాగే రసాయన ఎరువులు, పురుగు మందులూ వాడడమంటే నేల తల్లి కడుపులో విషయం పోయడమే. ఆ తల్లి ఆరోగ్యంగా ఉండాలంటే సహజ ఎరువులతో సేద్యం చేయాలి’ అని చెబుతున్నాను. వాళ్లు కూడా... ‘ఇంత చిన్నపిల్ల చెప్పేదేంట’ని అనుకోకుండా... శ్రద్ధగా వింటున్నారు.


  • నాలుగు వందలకు పైగా...

పర్యావరణంపై ఇప్పటి వరకు నేను నాలుగు వందలకు పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాను. జూమ్‌లో అనేక అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొన్నాను. శ్రీలంకలో భారత డిప్యూటీ హైకమిషనర్‌ను కలిశాను. అలాగే ఐక్యరాజ్య సమితి డిప్యూటీ సెక్రటరీ జనరల్‌ నా కృషికి ప్రశంసలు అందుకున్నాను. గ్లోబల్‌ ప్లాంటేషన్‌ ప్రచారానికి పెరూలో నిర్వహించిన ‘ది ట్రీయింగ్‌ ఆఫ్‌ ది ప్లానెట్‌-2021’కి ఆహ్వానం అందింది. కానీ కొవిడ్‌ కారణంగా వెళ్లలేకపోయాను. నా కార్యక్రమాలన్నిటికీ ఒక వేదిక ఉండాలన్న ఆలోచనతో తొమ్మిదేళ్ల వయసులో ‘యాధుమది ఇంటిగ్రేటెడ్‌ రూరల్‌ అండ్‌ అర్బన్‌ డెవల్‌పమెంట్‌ సొసైటీ’ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ నెలకొల్పాను. దాని ద్వారా లక్ష మొక్కలు నాటాను.


  • ప్రశంసలు... పురస్కారాలు...

పర్యావరణ పరిరక్షణ కోసం నేను చేస్తున్న ప్రయత్నానికి గుర్తింపుగా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి అవార్డులు అందుకున్నాను. అచీవర్స్‌ ఐకాన్‌ అవార్డు, బెస్ట్‌ చైల్డ్‌ ఎన్విరాన్మెంటలిస్ట్‌-2020 , యంగ్‌ క్లైమేట్‌ యాక్టివిస్ట్‌, గ్లోబల్‌ కిడ్స్‌ అచీవర్స్‌ అవార్డు-2021, ఇండియన్‌ ఐకాన్‌ అవార్డు, ఫేమ్‌ ఐకాన్‌ అవార్డు, గ్లోబల్‌ కిడ్స్‌ అచీవర్స్‌ అవార్డు, ఇంటర్నేషన్‌ సోషల్‌ సర్వీస్‌ అవార్డు, ఇంటర్నేషనల్‌ యంగ్‌ ఎకో-అవార్డులు వాటిలో ఉన్నాయి. ‘యూత్‌ సస్టైనబుల్‌ డెవల్‌పమెంట్‌ గోల్స్‌ (ఎస్డీజీ)’ ఆన్‌లైన్‌ సమ్మిట్‌లో భారత్‌ నుంచి ప్రాతినిథ్యం వహించే అవకాశం లభించింది. నేను ఇన్ని నగరాలు, దేశాలు తిరగగలుగుతున్నానంటే అందుకు మా నాన్న వెంకటేశన్‌ ప్రోత్సాహంవల్లే. ఏదిఏమైనా పర్యావరణ పరిరక్షణ అనేది ఒక ఉద్యమంలా నడిపించాలనేది నా లక్ష్యం.’’

పి.నరేంద్ర, తిరుపతి


  • ఇదీ పరిస్థితి...

పర్యావరణ కాలుష్యంవల్ల భవిష్యత్తులో సంభవించే పరిణామాల గురించి తెలుసుకొంటుంటే ఎంతో ఆందోళన కలుగుతుంది. ‘నాసా’ అంచనా ప్రకారం ఇప్పుడున్న పరిస్థితులు ఇలాగే కొనసాగితే... 2100 నాటికి అడవులన్నవే అంతరించిపోతాయి. 2050 నాటికి సముద్ర జలాల్లో చేపల కన్నా ప్లాస్టిక్‌ వ్యర్థాలే ఎక్కువగా కనిసిస్తాయి. 2070 నాటికి వరల్డ్‌ కోరల్‌ రీఫ్‌లు సైతం మాయమైపోతాయి. అభయారణ్యాల్లో ఏటా 50 వేల రకాల జీవులు అంతరించిపోతున్నాయి. ఇలాంటి వాస్తవాలు తెలుసుకున్నప్పుడు కంటి మీద కునుకు ఉండదు. ఈ పరిస్థితి మారితేనే జీవజాతికి మనుగడ.

  • పెళ్లికి దాచిన సొమ్ముతో...

నాకు ఇద్దరు ఆడ బిడ్డలు. వాళ్ల పెళ్లిళ్ల కోసం దాచిన డబ్బులు... నా పెద్దకూతురు గీతిక పర్యావరణ ప్రచారాలకూ, ప్రయాణాలకూ ఖర్చు పెడుతున్నాను. బంధుమిత్రులు హెచ్చరిస్తూనే ఉంటారు. అయినా ఇంత చిన్న వయసులో అంత పెద్ద ఆలోచనతో గీతిక అడుగు వేస్తూ ఉంటే... కాదనలేకపోతున్నాను. మన తీరులో మార్పు రాకుంటే... ఈ భూమి, మానవాళి ఏమవుతుందో గీతిక వివరిస్తూ ఉంటే ఒళ్లు జలదరిస్తుంది. మన కోసం కాకపోతే మన భవిష్యత్తు తరాల కోసమే కదా ఖర్చుపెట్టేదంతా అనుకుంటాను.

- వెంకటేశన్‌, గీతిక తండ్రి

Updated Date - Sep 22 , 2024 | 05:41 AM