ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Grand Master's : వాళ్లకు ఆమే గ్రాండ్‌మాస్టర్‌

ABN, Publish Date - Sep 28 , 2024 | 01:41 AM

ఇద్దరు పిల్లలు గ్రాండ్‌మాస్టర్లు. వారి ఆటోగ్రాఫ్‌ల కోసం అభిమానులు ఎగబడుతుంటే ఆ తల్లి కళ్ల వెంట ఆనందభాష్పాలు వస్తున్నాయి. న్యూస్‌ ఛానళ్లు పోటీ పడి ఇంటర్వ్యూలు తీసుకుంటుంటే ఆ తల్లి మనసు ఆనందంతో నిండిపోతోంది.

ఇద్దరు పిల్లలు గ్రాండ్‌మాస్టర్లు. వారి ఆటోగ్రాఫ్‌ల కోసం అభిమానులు ఎగబడుతుంటే ఆ తల్లి కళ్ల వెంట ఆనందభాష్పాలు వస్తున్నాయి. న్యూస్‌ ఛానళ్లు పోటీ పడి ఇంటర్వ్యూలు తీసుకుంటుంటే ఆ తల్లి మనసు ఆనందంతో నిండిపోతోంది. అక్కాతమ్ముడు ఇద్దరూ గ్రాండ్‌మాస్టర్‌ హోదాలు పొందడం చరిత్రలో ఇదే మొదటిసారి. చెన్నైకు చెందిన ప్రజ్ఞానంద,వైశాలిల విజయం వెనక వారి తల్లి నాగలక్ష్మి కృషి ఎంతో ఉంది.

పిల్లలు ఆటల్లో రాణించాలంటే మంచి శిక్షణ ఒక్కటే సరిపోదు. పిల్లల కెరీర్‌ను తీర్చిదిద్దడంలో పేరెంట్స్‌ పాత్ర కీలకం. నిత్యం వారి వెంటే ఉంటూ వాళ్లకు కావలసినవన్నీ సమకూర్చి పెట్టాలి. ఆ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చి పిల్లలిద్దరినీ ఉన్నత శిఖరాల్లోకి చేర్చింది నాగలక్ష్మి. బాల్యంలో ప్రజ్ఞానంద చేయిపట్టుకుని క్లాసులకు తీసుకువెళ్లేది. ఇప్పటికీ అంతర్జాతీయ మ్యాచుల కోసం విదేశాలకు వెళుతుంటే తోడుగా ఉంటోంది. ఒత్తిడి దరిచేరకుండా చూస్తూ విజయాలు సాధించేలా చేస్తోంది. ఎక్కడికి వెళ్లినా ఇంటి దగ్గర తయారుచేసిన ఆహారాన్ని మాత్రమే కుమారుడికి అందిస్తుంది.

ఇందుకోసం ఒక ఇండక్షన్‌ స్టవ్‌, రైస్‌కుక్కర్‌, కొన్ని మసాల పదార్థాలను తన వెంట తీసుకెళుతుంది. ఎక్కడ ఆడేందుకు వెళ్లినా ఇంటి భోజనం తప్పక అందేలా చూస్తుంది ఆ తల్లి. బయటి ఆహారం తింటే ఆరోగ్యం చెడిపోతుందనేది ఆమె భయం. ‘‘మంచి ఆహారం అందిస్తేనే మెదడు చురుకుగా పనిచేస్తుంది’’ అని అంటారామె. పిల్లలు సైతం అమ్మ చేతి వంటను మాత్రమే తినడానికి ఇష్టపడతారు. అందుకే కష్టం అనుకోకుండా సామగ్రిని తరలించి వంట చేసి పెడుతూ ఉంటుంది. ‘‘ప్రోటీన్‌ ఆహారం అందించడంపై ఎక్కువ దృష్టి పెడతాను. పిల్లలిద్దరూ వెజిటబుల్‌ సాంబార్‌ను బాగా ఇష్టపడతారు’’ అని చెబుతారు నాగలక్ష్మి.


  • బాధ్యతంతా తనపైనే...

నాగలక్ష్మి గృహిణి. ఆమె భర్త బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఉద్యోగ బాధ్యతలతో బిజీగా ఉండేవారు. దాంతో పిల్లల బాధ్యతలను ఆమె తీసుకున్నారు. ఎక్కడ టోర్నమెంట్‌ జరిగినా పిల్లలను తీసుకుని వెళ్లిపోతారు. ఆమె కష్టం వృథా పోలేదు. పిల్లలిద్దరూ చదరంగంలో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. వారిని చూసి దేశం మొత్తం గర్విస్తోంది. వైశాలి ముందుగా చదరంగం నేర్చుకునేందుకు ఆసక్తి చూపింది. ఆ తరువాత ప్రజ్ఞానంద సైతం చెస్‌పై ఆసక్తి పెంచుకున్నారు. ఇద్దరూ ఒకే ఆటను కెరీర్‌గా ఎంచుకోవడం పట్ల కుటుంబ సభ్యులు మొదట్లో అభ్యంతరం చెప్పారు. తరువాత వాళ్లే గొప్ప మద్దతును అందించి పిల్లల విజయంలో కీలక పాత్ర పోషించారు. ‘‘ప్రజ్ఞానందను శిక్షణ కోసం రోజూ తీసుకొచ్చే వారు. అతను ఆడుతున్నప్పుడు ఒక మూలన కూర్చుని ప్రార్థన చేస్తుండేవారు. కొడుకు ఆట పూర్తయ్యే వరకు ఆమె ప్రేయర్‌ చేసే వారు.

ప్రజ్ఞానంద ఆడటానికి కూర్చుంటే చాలు తను ప్రేయర్‌ చేసేది’’ అని చెన్నైకి చెందిన బ్లూమ్‌ చెస్‌ అకాడమీ కోచ్‌ త్యాగరాజన్‌ చెప్పుకొచ్చారు. త్యాగరాజన్‌ ప్రజ్ఞానందకు మొదటి కోచ్‌గా ఉన్నారు. ప్రజ్ఞానంద ప్రపంచ ప్రసిద్ధ చెస్‌ ఆటగాడు మాగ్నస్‌ కార్ల్‌సెన్‌తో ఫైనల్‌ మ్యాచ్‌ ఆడుతున్నప్పుడు ఆమె పక్కనే నిలుచుని ఉంది. ప్రతి పురుషుడి విజయం వెనక ఒక మహిళ ఉంటుంది అన్న నానుడిని నిజం చేస్తూ, ప్రజ్ఞానంద వెంట ఉండి ఎలాంటి ఒత్తిడి లేకుండా చేసి, విజయతీరాలకు చేరుకునేలా చేసింది. హంగేరీలో జరిగిన చెస్‌ ఒలింపియాడ్‌లో వైశాలి, ప్రజ్ఞానందలిద్దరూ బంగారు పతకాలు గెలుచుకున్న టీమ్‌లో భాగంగా ఉన్నారు. ఇది ఎంతో ఆనందాన్నిచ్చిందని అంటారు నాగలక్ష్మి. ‘‘పిల్లలిద్దరూ బంగారు పతకాలు గెల్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. నా ఆనందాన్ని పంచుకోవడానికి మాటలు రావడం లేదు’’ అని మ్యాచ్‌ అనంతరం తన సంతోషాన్ని పంచుకున్నారు నాగలక్ష్మి.


  • అమేజింగ్‌ చెస్‌ మామ్‌

పిల్లలతో హంగేరీ వెళ్లిన నాగలక్ష్మి అక్కడ లెజెండరీ చెస్‌ ప్లేయర్‌ సుసాన్‌ పొల్గర్‌ను కలుసుకున్నారు. ఈ విషయాన్ని పొల్గర్‌ సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు. ‘‘ఇద్దరు చెస్‌ సూపర్‌స్టార్‌ల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ‘అమేజింగ్‌ చెస్‌ మామ్‌’ని కలుసుకున్నాను’’ అని పొల్గర్‌ రాసుకొచ్చారు. పిల్లల కెరీర్‌ కోసం తన చిన్న చిన్న సంతోషాలను కూడా వదులుకున్నారు.

‘‘ఇంట్లో పిల్లలు చెస్‌ ఆడుకుంటే డిస్టర్బ్‌ కాకూడదని టీవీ కూడా పెట్టే దాన్ని కాదు. ఇంట్లో పిన్‌ డ్రాప్‌ సైలెంట్‌ ఉండేలా చూసే దాన్ని. ఇంటికి ఎవరైనా వస్తే పార్కింగ్‌ ప్రదేశానికి వెళ్లి మాట్లాడి పంపే దాన్ని. అలాంటి వాతావరణం వాళ్లకు కల్పించేదాన్ని. అప్పుడే ఏకాగ్రతతో ఆడేవారు’’ అని అంటారు నాగలక్ష్మి. ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోన్న నాగలక్ష్మిని మనమూ అభినందిద్దామా!

Updated Date - Sep 28 , 2024 | 01:41 AM