Innovative : ఆటిజం పిల్లలు ఎంతో ప్రత్యేకం
ABN, Publish Date - Nov 04 , 2024 | 05:26 AM
‘‘నాకు ఇద్దరు పిల్లలు. వరుణ్, ప్రణవ్. పెద్ద బాబు వరుణ్‌కు ఇప్పుడు 26 ఏళ్లు. రెండేళ్ల వయసొచ్చేవరకూ వరుణ్‌కు మాటలు రాలేదు. ఆలోగా రెండో బాబు ప్రణవ్ పుట్టాడు. ఎదుగుదలలో ఆ ఇద్దరు పిల్లల మధ్య వ్యత్యాసాలున్నట్టు గమనించాను.
వినూత్నం
బుద్ధిమాంద్యం పట్ల అవగాహన లేని రోజుల్లో బిడ్డలోని లోపాన్ని తొలినాళ్లలోనే పసిగట్టలేకపోయింది ఆ తల్లి. ఆలస్యంగా కనిపెట్టిన తర్వాత ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు బాసటగా మారాలనే లక్ష్యంతో, అనన్య చైల్డ్ డెవల్‌పమెంట్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షనల్ క్లినిక్‌ను స్థాపించింది. ఈ క్లినిక్ ద్వారా తనలాంటి తల్లులకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు, పిల్లలకు థెరపీలను కూడా అందిస్తోన్న ఆటిజం నిపుణురాలు, మాధవి ఆదిమూలం నవ్యతో పంచుకున్న విశేషాలు.
‘‘నాకు ఇద్దరు పిల్లలు. వరుణ్, ప్రణవ్. పెద్ద బాబు వరుణ్‌కు ఇప్పుడు 26 ఏళ్లు. రెండేళ్ల వయసొచ్చేవరకూ వరుణ్‌కు మాటలు రాలేదు. ఆలోగా రెండో బాబు ప్రణవ్ పుట్టాడు. ఎదుగుదలలో ఆ ఇద్దరు పిల్లల మధ్య వ్యత్యాసాలున్నట్టు గమనించాను. వెంటనే పిల్లల వైద్యులను సంప్రతించి పెద్ద బాబు పరిస్థితిని వివరించాను. కానీ వైద్యులు నా అనుమానాలను తేలికగా కొట్టిపారేశారే తప్ప, నా ప్రశ్నకు సూటి సమాధానాలు ఇవ్వలేకపోయారు. అయితే ఐటి రంగంలో పని చేస్తున్న నాకు ఇంటర్నెట్ సౌలభ్యం ఉండడంతో, సమాధానాల కోసం ఇంటర్నెట్‌ను ఆశ్రయించాను. ఆన్‌లైన్‌లో ఆటిజం సొసైటీ ఆఫ్ అమెరికా వెబ్‌సైట్ కనిపించింది. దాన్లో, పిల్లల్లోని ఆటిజంను అనుమానిస్తున్న తల్లితండ్రుల కోసం కేటాయించిన ప్రశ్నాపత్రం పూరించాను. ఫలితం మా అబ్బాయి లక్షణాలతో సరిపోలడంతో, ఆ కాగితం ప్రింట్ తీసుకుని మళ్లీ పిల్లల వైద్యుల దగ్గరకు పరుగులు తీశాను.
‘ఆటిజం ఉన్నంత మాత్రాన ఏం చేయగలుగుతావు?’ అని ప్రశ్నించిందా వైద్యురాలు. ఆవిడ ఉన్నంత రిలాక్స్‌డ్‌గా నేను ఉండలేను. వరుణ్ నా బిడ్డ.
వాడి సమస్యను పూర్తిగా అర్థం చేసుకుని, పరిష్కారం వెతకవలసిన బాధ్యత తల్లిగా నాదే! ఆ క్రమంలో క్లినికల్ సైకాలిజ్‌స్టను కలవడం, బాబుకు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అని తేలిపోవడం చకచకా జరిగిపోయాయి. బాబు హైపర్ యాక్టివిటీతో బడిలో కూడా సమస్యలు ఎదుర్కొంటున్నాడు. వైద్యులే ఆ సమస్యను గుర్తించలేనప్పుడు, టీచర్లకు దాని పట్ల అవగాహన లేకపోవడంలో ఆశ్చర్యం లేదు. కాబట్టి బాబు సమస్యకు పరిష్కారాన్ని వెతికే పూర్తి బాధ్యత నేనే తీసుకున్నాను. భారతదేశంలో ఆటిజం చికిత్సావకాశాలు కూడా లేవని నా పరిశోధనలో తేలిపోయింది. దాంతో నేనొక కీలకమైన నిర్ణయం తీసుకున్నాను.
ఆటిజం పట్ల అవగాహన పెంచుకుని...
ఆ రోజుల్లో నేను ఐటి కంపెనీ తరఫున యూరప్ రీజియన్ కోసం పని చేస్తున్నాను. విదేశాల్లో ఆటిజం పట్ల అవగాహన, చికిత్సలు విస్రృతంగా అందుబాటులో ఉన్నాయి కాబట్టి భాష సమస్యలు లేని యుకెకు ట్రాన్స్‌ఫర్ చేయమని మా బాస్‌ను అడిగాను. కారణం తెలుసుకున్న ఆయన వెంటనే నన్ను ట్రాన్స్‌ఫర్ చేసేశారు. అలా 2001లో బాబును తీసుకుని యుకె వెళ్లిపోయాను. అక్కడి బడుల్లో ఈ కోవకు చెందిన పిల్లలకు ప్రత్యేక సదుపాయాలున్నాయి. బాబుకు అర్థం కాని పాఠాలను విడిగా వివరించడం కోసం సపోర్ట్ టీచర్ కూడా ఉండేది. అలా కొన్నేళ్లు అక్కడే ఉండిపోయాను. ఆటిజం పట్ల పూర్తి అవగాహన పెంచుకున్నాను. పేరెంట్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. దాంతో బాబుతో ఎలా నడుచుకోవాలో అర్థమైపోయింది. కాబట్టి ఇండియా వచ్చేసి స్వయంగా నేనే వాడికి విద్యాబుద్ధులు నేర్పించాలని నిర్ణయించుకుని, 2007లో ఇండియా తిరిగొచ్చేశాను. కానీ అప్పటికీ హైదరాబాద్‌లో ఆటిజం పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. బడిలో చేర్చినా మా బాబును ఎలా స్టిమ్యులేట్ చేయాలో టీచర్లకు తెలియడం లేదు. ఊరికే తరగదిలో కూర్చోబెడితే, ప్రయోజనం ఏముంటుంది? అందుకే నేను కూడా అదే బడిలో టీచర్‌గా చేరిపోయాను. కానీ ప్రతిరోజూ బడికెళ్లి, మా బాబుకు నేనే టీచర్‌గా మారే బదులు, ఆ పనేదో ఇంట్లోనే చేయొచ్చు కదా? అనిపించింది. అలా ఐటి ఉద్యోగానికి రాజీనామా చేసి, 2008, ఏప్రిల్ రెండున, అనన్య చైల్డ్ డెవల్‌పమెంట్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షనల్ క్లినిక్‌ను మొదలుపెట్టాను.
సమస్యను ప్రారంభంలోనే కనిపెడితే...
ఇప్పుడు వరుణ్‌కి 26 ఏళ్లు. బాబుకు సంగీతం పట్ల ఆసక్తి ఎక్కువ. ఈ విషయాన్ని గ్రహించిన నేను క్లాసికల్ మ్యూజిక్ నేర్పించాను. బాబుకు భాషల పట్ల కూడా ఆసక్తి ఎక్కువే! 18 ఏళ్ల నుంచీ హిందుస్తానీ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాడు. టీచర్లతో కలిసి ప్రదర్శనలు కూడా ఇస్తున్నాడు. వీకీపీడియా ద్వారా 80 నుంచి 90 భాషలు నేర్చుకున్నాడు. బుద్ధిమాంద్యం పిల్లల పట్ల సాధారణంగా జాలి, దయ వ్యక్తపరుస్తాం! ఆ పిల్లలెందుకూ పనికిరారనీ, వాళ్లకెలాంటి తెలివితేటలూ ఉండవని అనుకుంటాం! కానీ ఈ పిల్లలెంతో ప్రత్యేకం. వాళ్లకూ నైపుణ్యాలుంటాయి. వాటిని వెతికి మెరుగుదిద్దడం తల్లితండ్రుల బాధ్యత. అన్నిటికంటే ముఖ్యంగా ఈ పిల్లలను ప్రారంభంలోనే గుర్తించి, థెరపీ ఇప్పించగలిగితే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. ఈ విషయం చాలా మంది తల్లితండ్రులకు తెలియదు. సాధారణంగా తల్లితండ్రులందరూ ఆటిజం విషయంలో ఒక పెద్ద పొరపాటు చేస్తూ ఉంటారు. మా పిల్లలు ‘నార్మల్’గానే ఉన్నారనే నిశ్చితాభిప్రాయంలో ఉంటూ ఉంటారు. త్వరగా బాగైపోయి, పెద్ద చదువులు చదివేసి ఏ డాక్టరో, ఇంజనీరో అయిపోవాలనే ఆరాటపడతారు తప్ప, బిడ్డకు ఉన్న సమస్యను అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు. నిజానికి ఈ పిల్లల సమస్యను ప్రారంభంలో తేలికగానే కనిపెట్టవచ్చు. పేరుతో పిలిస్తే పలకకపోవడం, వేరే పిల్లలతో కలవకుండా విడిగా ఆడుకోవడం, సామాజిక నియమనిబంధనలు, ప్రవర్తనల పట్ల అవగాహన లేకపోవడం లాంటి లక్షణాలను పసిగట్టాలి.
టైలర్డ్ థెరపీతో...
డెవల్‌పమెంటల్ డిలేస్ వేరు ఆటిజం వేరు. అయితే సమస్య మాటలు రాకపోవడానికి డెవల్‌పమెంటల్ డిలే కారణమైతే, ఆరు నెలల థెరపీతో పిల్లలు మాట్లాడడం మొదలుపెట్టేస్తారు. కానీ ఆటిజంలో ఇది సాధ్యపడదు. ఈ తేడాలను తల్లితండ్రులు తెలుసుకోవాలి. ఆటిజం తీవ్రతలో కూడా తేడాలుంటాయి. అలాగని థెరపీతో ఉపయోగం ఉండదని అనుకోకూడదు. ఇప్పుడు అనన్యలో పని చేస్తున్న కౌన్సెలర్లు అందరూ అత్యున్నత అర్హత ఉన్నవాళ్లే! వీళ్లందరూ థెరపీలో భాగంగా ఆక్యుపేషనల్ థెరపీ, సోషల్ ఇంటరాక్షన్, పీర్ ప్లే సేవలందిస్తూ ఉంటారు. తల్లితండ్రులకు వర్క్‌షా్‌పలు ఏర్పాటు చేస్తూ ఉంటాం. వాళ్లకూ శిక్షణనిస్తాం! ఇంట్లో పిల్లలతో నడుచుకోవలసిన విధానాలను నేర్పిస్తాం. క్లినికల్ అబ్జర్వేషన్, పేరెంట్ ఇంటర్వ్యూ, డెవల్‌పమెంటల్ అసె్‌సమెంట్ ఆధారంగా పిల్లల్లో ఆటిజం తీవ్రతను అంచనా వేసి, టైలర్డ్ థెరపీని తయారు చే సుకుంటాం. ప్రతి బిడ్డకూ తగినంత సమయాన్ని కేటాయిస్తూ, మాట్లాడడం, నడవడిక, ప్రవర్తనలను గాడిలో పెడుతూ, తల్లితండ్రులకు గైడెన్స్ ఇస్తూ బిడ్డకు మెరుగైన జీవితాన్ని అందించడం కోసం కృషి చేస్తూ ఉంటాం. మా సేవలను ఆన్‌లైన్‌లో కూడా పొందవచ్చు. పిల్లల్లో ఆటిజంను పూర్తిగా నయం చేయడం నా లక్ష్యం కాదు. అది సాధ్యపడదు కూడా! ఈ సమస్య ఉన్న పిల్లలతో తల్లితండ్రులు ఎలా నడుచుకోవాలో నేర్పించడం, వాళ్లకు శిక్షణ ఇవ్వడంతో పాటు పిల్లలకు వ్యక్తిగత, సామాజిక ప్రవర్తనలు, నియమనిబంధనలు నేర్పించడం నా పని.
వర్చువల్ ఆటిజంకు అడ్డుకట్ట
వర్చువల్ ఆటిజం అనే పదం కొవిడ్‌లో పుట్టుకొచ్చింది. నిజానికి ఇది ఆటిజం కాదు. ఇదొక డెవల్‌పమెంటల్ డిజార్డర్. దీన్ని సరిదిద్దడం కూడా చాలా తేలిక. కొవిడ్ కాలంలో పిల్లలను వేరే పనిలో ఎంగేజ్ చేసేసి, సొంత పనులు చేసుకోవచ్చనే ఆలోచనతో తల్లితండ్రులే పిల్లలకు గ్యాడ్జెట్స్ అందించడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి అదే పరిస్థితి కొనసాగుతోంది. ఇలా చిన్న వయసులోనే ఫోన్లు, ఐప్యాడ్‌లకు పిల్లలు అతుక్కుపోవడం వల్ల డెవల్‌పమెంటల్ డిలేస్ తలెత్తుతాయి. వయసుకు తగిన ఎదుగుదల మందగించి, మాటలు రాకపోవడం, సాఽధారణ నైపుణ్యాలు కొరవడడం లాంటి సమస్యలు మొదలవతాయి. ఈ సమస్యను సరిదిద్దడం కంటే, సమస్య తలెత్తకుండా ముందుగానే జాగ్రత్త పడడం తల్లితండ్రుల బాధ్యత. పిల్లలతో సఖ్యంగా మెలుగుతూ, వాళ్లతో మాట్లాడుతూ, ఆడుతూ పాడుతూ, నాణ్యమైన సమయాన్ని గడపాలే తప్ప, వాళ్లకు గ్యాడ్జెట్స్ అలవాటు చేయకూడదు.
Updated Date - Nov 04 , 2024 | 05:29 AM