Navya : మిలియన్ల మాయ !
ABN, Publish Date - May 19 , 2024 | 03:10 AM
మనం అంకెలను నమ్మినట్లు దేనిని నమ్మం! ఒకటి.. రెండు.. మూడు.. వంద.. ఇలా గట్టిగా అరుస్తూ చెబితే మంచి కాలేజీలని నమ్మేస్తాం. పిల్లలకు ర్యాంకులు వస్తాయని వాటిలోనే చేరుస్తాం.
గాసిప్
మనం అంకెలను నమ్మినట్లు దేనిని నమ్మం! ఒకటి.. రెండు.. మూడు.. వంద.. ఇలా గట్టిగా అరుస్తూ చెబితే మంచి కాలేజీలని నమ్మేస్తాం. పిల్లలకు ర్యాంకులు వస్తాయని వాటిలోనే చేరుస్తాం. క్లాసుకు పది మంది పిల్లలు ఉన్న చోట- మన వాడికి మొదటి ర్యాంకు వస్తే ఆనందపడిపోతాం.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే - ఈ చిన్నవీక్‌నెక్‌ను మన సినిమా రంగం గమనించింది.. దానిని అందరూ వాడుకోవటం మొదలుపెట్టారు కాబట్టి. మీలో చాలా మందికి ఈ పాటికి విషయమంతా - మాయ వీక్షణాలకు (వ్యూస్) సంబంధించిందని అర్థమైపోయి ఉంటుంది.
ఒకప్పుడు సినిమాలకు వంద రోజుల ఫంక్షన్లు చేసేవారు. కలెక్షన్లను ప్రకటనల రూపంలో ప్రచురించేవారు. ఎన్ని రోజులు ఆడితే- అన్ని ఎక్కువ కలెక్షన్లు వస్తాయి. ఎన్ని ఎక్కువ కలెక్షన్లు వస్తే ఆ సినిమా అంత హిట్ అయినట్లు. కానీ సినిమాలు వందరోజులు ఆడే పరిస్థితులు పోయి- వీకెండ్ సక్సెస్ అయితే చాలు అనుకొనే పరిస్థితులు వచ్చేసాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైనా ఒక సినిమా రెండు వారాలు హౌస్‌ఫుల్ కలెక్షన్లతో ఆడితే - అది గొప్ప హిట్ అని చెప్పుకోవచ్చు. పెద్ద హీరోల సినిమాలైతే పది రోజులు ఆడితే చాలు. ఇలాంటి పరిస్థితుల్లో హీరోకు ఎంత పాపులారిటీ ఉందో ఎలా తెలుస్తుంది? దీనికి మార్కెటింగ్, పీఆర్ వ్యవస్థ కనిపెట్టిన గొప్ప సాధనం ‘వ్యూస్’. సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌కు ముఖ్యంగా- యూట్యూబ్, ఇన్‌స్టాలలో ఎంత మంది చూశారు అనే విషయంపైనే దానికి ఎంత ఆదరణ లభించిందనే విషయం తెలుస్తుంది.
ఉదాహరణకు మనం చిన్న షార్ట్ ఫిల్మ్ తీసి యూట్యూబ్‌లో పెట్టామనకుందాం. మనకు తెలుసున్న వాళ్లు మాత్రమే చూస్తారు. వారు ఎవరికైనా పంపితే - వాళ్లు చూస్తారు. ఇలా చైన్ రియాక్షన్ వెళ్తూ ఉంటుంది. అంటే దానిని ఎంత మంది చూస్తే అంత ఆదరణ లభించినట్లు లెక్క.
ఈ సూత్రాన్ని అనుసరించి- మన హీరోలు తమకు సంబంధించిన పోస్టులను, సినిమా టీజర్స్‌ను ఇన్‌స్టాలోను, యూట్యూబ్‌లోను పోస్ట్ చేస్తూ ఉంటారు. అవి విడుదలయిన వెంటనే అభిమానులు చూస్తారు. వాటికి వ్యూస్ వస్తాయి.
అయితే మీలో కొందరికి ఒక సినిమా టీజర్ విడుదలయిన వెంటనే మిలియన్ వ్యూస్ ఎలా వస్తాయనే అనుమానం వచ్చి ఉండచ్చు. ఆ హీరోకి అంత మంది అభిమానులు ఉన్నారేమోనని సరిపెట్టుకొని ఉండచ్చు.
కానీ ఈ వ్యూస్ వెనక లక్షల వ్యాపారం ఉందనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. దీనిని సదోహరణంగా చెప్పుకుందాం. ఈ మధ్య ఒక యువ హీరో పుట్టిన రోజు సందర్భంగా ఒక పాన్ ఇండియా సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఆ టీజర్ వ్యూస్‌లో రికార్డు బద్దలు కొట్టాలని. .100 మిలియన్ (10 కోటు)్ల వ్యూస్ రావాలని హీరోగారు హుకుం జారీ చేశారు. దాంతో సదరు నిర్మాణ సంస్థ ఆ వ్యూస్‌ను కొనే పనిలో పడింది.
ఈ వ్యూస్‌ను అమ్మటానికి కొన్ని సంస్థలు ఉంటాయి. అవి అత్యాధునిక టెక్నాలజీలను ఉపయోగించి.. నకిలీ అకౌంట్ల ద్వారా వ్యూస్‌ను అమ్ముతాయి. లక్ష వ్యూస్‌కు ఒక రేటు.. రెండు లక్షల వ్యూస్‌కు ఒక రేటు.. పది లక్షల వ్యూస్‌కు ఒక రేటు- ఇలా ఉంటాయి. సాధారణ పరిస్థితులు ఉన్న సమయంలో - డబ్బులుంటే - ఈ వ్యూస్‌ను కొనటం చిటెకలో పని.
కానీ ఎన్నికల వేళ- ఎన్నికల కమిషన్ సోషల్ మీడియాకు కొన్ని విధివిధానాలు జారీ చేసింది. దీంతో ఈ వ్యూస్ వ్యవహారం - ఆ చట్రంలో చిక్కుకుంది. నిర్మాణ సంస్థ డబ్బులు చెల్లించిన తర్వాత కూడా వెంటనే ‘వ్యూస్’ను జోడించటం కుదరలేదు. దీనితో హీరోగారి పుట్టిన రోజుకు వంద మిలియన్ల వ్యూస్ రాలేదు. రికార్డులు బద్దలు కొట్టలేదు.
ఇదంతా చదివిన తర్వాత వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి సినిమాలు తీసే నిర్మాతలు.. వాటిలో నటించే హీరోలు ఇంత అమాయకులా? ఈ మాయ వీక్షణాల కోసం లక్షలు ఖర్చుపెడతారా అనే అనుమానం రావచ్చు.
హీరోల ఇళ్లముందుకు వచ్చి ప్రేక్షకులు జయజయనినాదాలు చేసే రోజులు పోయాయి. ఇక మిగిలింది ఫోన్లే! వాటిలో జయజయ నినాదాలు వింటే తృప్తిగా ఉంటుంది కదా! అవి మాయా వీక్షణాలని తెలిసినా!
ఈ మొత్తం వ్యవహారంలో నష్టపోయేది ఎవరు.. నిర్మాతే.. లాభపడేది ఎవరు? ఎక్కడో ఆఫ్రికాలోనో.. యూక్రేన్‌లోనో.. యూరప్‌లోనో ఉండే కంపెనీలు.. వాటికి ఇక్కడి నుంచి బిజినెస్ ఇస్తున్న మార్కెటింగ్.. పీఆర్ కంపెనీలు.ఈ మాయా వీక్షణాల బుడగ కూడా ఎప్పుడో ఒకప్పుడు బద్ధలవుతుంది. అప్పుడిక జయజయ నినాదాలు వినిపించవు.
వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి సినిమాలు తీసే నిర్మాతలు.. వాటిలో నటించే హీరోలు ఇంత అమాయకులా? ఈ మాయ వీక్షణాల కోసం లక్షలు ఖర్చుపెడతారా అనే అనుమానం రావచ్చు.
Updated Date - May 19 , 2024 | 03:10 AM