Navya : పతకాలకు తుపాకీ గురిపెట్టి
ABN, Publish Date - Jul 22 , 2024 | 12:59 AM
టోక్యో, 2020 ఒలింపిక్స్ గాయం మానిపోయినా, ఆ ఆనవాళ్లు అలాగే మిగిలి ఉన్నాయి. ఒకప్పటి టీనేజర్‌లో మునుపటి దుందుడుకుతనం స్థానాన్ని హూందాతనం ఆక్రమించింది.
న్యూస్ మేకర్
ఇండియన్ షూటర్, హర్యాణా అమ్మాయి,
మను భాకర్ రెండోసారి ఒలింపిక్స్ బరిలోకి
దిగబోతోంది. టోక్యో ఒలింపిక్స్‌లో సాంకేతిక సవాళ్ల
ఫలితంగా తాను పాల్గొన్న మూడు పోటీల ఫైనల్స్‌లో అర్హత
సాధించలేకపోయిన మను, ప్యారిస్ ఒలింపిక్స్ కోసం ఎలా
సిద్ధపడుతుందో తెలుసుకుందాం!
టోక్యో, 2020 ఒలింపిక్స్ గాయం మానిపోయినా, ఆ ఆనవాళ్లు అలాగే మిగిలి ఉన్నాయి. ఒకప్పటి టీనేజర్‌లో మునుపటి దుందుడుకుతనం స్థానాన్ని హూందాతనం ఆక్రమించింది. ఈసారి మరింత మెరుగైన ప్రతిభ కనబరిచి, పతకాలను గెలుచుకోవాలనే కృతనిశ్చయం మనులో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ప్యారి్‌సకు రెండు గంటల ప్రయాణ దూరంలోని చతోహూ షూటింగ్ రేంజ్‌లో ఉన్న మను, కోచ్, మాజీ ఏషియన్ గేమ్స్ ఛాంపియన్, జస్పాల్ రాణా ఆధ్వర్యంలో షూటింగ్ సాధన చేస్తోంది.
తొలి ఓటమితో కుంగుబాటుకు గురైన మను, ఒక సందర్భంలో ఓటమికి కోచ్‌నే బాధ్యుడిని చేస్తూ, అతని కోచింగ్ నుంచి పక్కకు తప్పుకుంది. కానీ తప్పును తెలుసుకున్న తర్వాత, తిరిగి జస్పాల్‌నే కోచ్‌గా ఎంచుకుంది. ‘‘ఒక సందర్భంలో ఆటకు గుడ్‌బై చెప్పేద్దామనకున్నాను. కానీ అంత త్వరగా ఓటమికి తల వంచడం నాకిష్టం లేదు. అందుకే జస్పాల్ సారధ్యంలో, ఆయన మార్గనిర్దేశంలో రెండోసారి ఒలింపిక్స్‌కు సిద్ధపడ్డాను. కష్టపడతాను, ఫలితాన్ని ఆ భగవంతుడికే వదిలేస్తాను.
నా మీద ఒత్తిడి కచ్చితంగా ఉంది. కానీ ఇప్పుడా ఒత్తిడిని అధిగమించి ప్రతిభ కనబరిచే స్థాయికి చేరుకున్నాను. కొన్నిసార్లు ఆందోళనకు కూడా లోనవుతూ ఉంటాను. అలాంటి సందర్భాల్లో ఏదో ఒక సినిమా గురించి లేదంటే ఏదో ఒక సందర్భం గురించి ఆలోచించడం మొదలుపెట్టడం నేర్చుకున్నాను. ఇంతకుముందు ఓటమి నుంచి కోలుకోడానికి నాకు కొన్ని రోజుల సమయం పడుతూ ఉండేది. కానీ ఇన్నేళ్ల సాధనతో ఓటమి గురించి మూడు, నాలుగు రోజుల బాధ పడితే ఫరవాలేదు.
అంతకంటే ఎక్కువ రోజులు బాధపడుతూ కూర్చోవడం వల్ల ఉపయోగం ఉండదనే విషయాన్ని గ్రహించాను. కాలంతో పాటు ప్రజలు మర్చిపోయినట్టే, మనమూ మర్చిపోవాలి. నేనెన్నో పోటీల్లో నెగ్గాను. కానీ టోక్యో ఒలింపిక్స్‌లో ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయినప్పుడు, విపరీతంగా కుంగిపోయాను’’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంటూ తన అనుభవాన్ని మీడియాతో పంచుకుంది మను.
ముచ్చటగా మూడు పోటీల్లో...
ఈ 22 ఏళ్ల షూటర్ ఒక్క ఒలింపిక్ పతకం తప్ప మిగతా పతకాలెన్నిటినో గెలుచుకుంది. ఈసారి ప్యారి్‌సలో జరగబోతున్న ఒలింపిక్స్‌లో పది మీటర్ల ఎయిర్ పిస్టల్, 25 మీటర్ల పిస్టల్, పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్, ఈ మూడు పోటీల్లో పతకాలను గెలుచుకోవాలని కలలు కంటోంది. ‘‘గత ఒలింపిక్స్‌లో పాల్గొన్న సమయంలో నాలో అంత ధైర్యం లేదు.
కానీ ఈసారి ధైర్యంగా బరిలోకి దిగాలనుకుంటున్నాను. రొటీన్‌కు కట్టుబడి పూర్తి సామర్థ్యాన్ని, ప్రతిభనూ కనబరచాలనుకుంటున్నాను. ఇక ఫిట్‌నెస్ విషయానికొస్తే, ప్రతి నెలా కంటి పరీక్షలు చేయించుకుంటూ ఉంటాను. నాది 6/6 విజన్. కళ్లు అలసటకు గురి కాకుండా ఉండడం కోసం స్ర్కీన్ టైమ్‌ను పరిమితం చేసుకుంటూ ఉంటాను.
రోజు మొత్తంలో కేవలం రెండు గంటల స్ర్కీన్ టైమ్‌కే పరిమితమవుతూ ఉంటాను. షూటింగ్ కోసం ఉపయోగించే టైమర్ నా ఫోన్లో ఉంటుంది కాబట్టి దాని కోసమే ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తాను. యూట్యూబ్‌లో మ్యూజిక్ వింటూ ఉంటాను. అలాగే వాట్సాప్ కాల్స్, మెసేజెస్, ఆన్‌లైన్ వయొలిన్ క్లాసెస్ కోసం కొంత సమయాన్ని వెచ్చిస్తాను’’ అంటూ చెప్పుకొచ్చింది మను.
కోచ్‌తో విభేదాలు
మనుతో దెబ్బతిన్న అనుబంధం గురించి కూడా మను మీడియాకు ఇలా వివరించింది. ‘‘మా ఇద్దర్లో ఎన్నో విబేధాలున్నాయి. వాటిని పరిష్కరించుకుని దృఢపడడం కీలకమైన విషయమని నా అభిప్రాయం. ఏది జరిగినా మన మంచి కోసమే అని అందరూ అంటూ ఉంటారు. కానీ మన జీవితంలో అంతా తప్పే జరుగుతున్నప్పుడు, అది కూడా మన మంచికే అని ఎందుకు భావించాలి? నేనిలాంటివి నమ్మను. నాకు భగవంతుడి మీద, గురువు మీద విశ్వాసం ఉంది. జస్పాల్‌తో నాకు మనస్పర్థలు వచ్చాయి.
మమ్మల్ని విడదీయాలని ఎంతోమంది విశ్వ ప్రయత్నం చేశారు. అదే జరిగింది. కానీ తప్పు తెలిసొచ్చిన తర్వాత, నా అంతట నేనే ఆయన్ను సంప్రతించాను. 2024 తర్వాత షూటింగ్ నుంచి దూరమవడం లేదా ఆయనతో కలిసి షూటింగ్ కొనసాగించడం.. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుందని ఆయనతో చెప్పాను. 2024 ఒలింపిక్స్‌లో గెలిచినా, ఓడినా ఆ తర్వాత నుంచి షూటింగ్‌ను వదిలేస్తానని లేదంటే ఆయనతోనే కలిసి షూటింగ్‌ను కొనసాగిస్తాననీ అన్నప్పుడు, ఆయన నాతోనే షూటింగ్‌ను కొనసాగించు అన్నారు.
తిరిగి జస్పాల్ సారధ్యంలో సాధన చేయడం సంతోషంగా ఉంది. ప్యారిస్ ఒలింపిక్స్‌లో కచ్చితంగా పతకాలు గెలుస్తాననే నమ్మకం కలుగుతోంది’’ అంటూ చెప్పుకొచ్చింది మను. ఆ అమ్మాయి మీద భారతదేశం పెట్టుకున్న నమ్మకాలు ఎంతవరకూ నిజమవుతాయో తెలియాలంటే, ప్యారిస్ ఒలింపిక్స్ వరకూ ఆగక తప్పదు.
Updated Date - Jul 22 , 2024 | 01:01 AM