Navya : వానల్లో హాయ్.. హాయ్
ABN, Publish Date - Jul 16 , 2024 | 01:30 AM
సూర్యభగవానుని కదలికల ఆధారంగా, ఉత్తరాయణం, దక్షిణాయణాలు రెండింట్లోనూ చెరో ఆరు నెలలు చొప్పున ఏడాది కాలం సాగుతుంది.
ఆయుర్వేదం
వర్షాకాలం చల్లని వాతావరణం
ఆహ్లాదాన్ని కలిగించడంతో పాటు,
కొన్ని రుతుపరమైన ఇబ్బందులనూ
తెచ్చి పెడుతూ ఉంటుంది.
కాబట్టి వాటి మీద ఓ కన్నేసి ఉంచి,
మెలకువగా వ్యవహరించాలి.
సూర్యభగవానుని కదలికల ఆధారంగా, ఉత్తరాయణం, దక్షిణాయణాలు రెండింట్లోనూ చెరో ఆరు నెలలు చొప్పున ఏడాది కాలం సాగుతుంది. ఈ ఏడాది కాలంలో శిశిరం, వసంత, గ్రీష్మ, వర్ష, శరద్, హేమంతం... ఆరు రుతువులు సాగుతూ ఉంటాయి. ఉత్తరాయణంలో సూర్యుడు భూమి, దాని మీద ఉన్న జీవరాశిలో ఆవరించి ఉన్న చల్లదనాన్ని, శక్తినీ సంగ్రహించేస్తాడు.
దక్షిణాయణంలో ఇందుకు విరుద్ధంగా, భూమి మేఘాల చేత ఆక్రమించేలా చేసి, చల్లని గాలులు, వానలతో చల్లబరుస్తాడు. ఫలితంగా శిశిరం, వసంతం, గ్రీష్మ రుతువుల్లో కోల్పోయిన శక్తి తిరిగి వర్ష రుతువులో పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కాలంలో వాత, పిత్త దోషాలు కలిగిన వారికి వివిధ రకాల రుగ్మతలు తిరగబెడుతూ ఉంటాయి.
వాత: వేసవి ఫలితంగా భూమిలో బిగదీసుకుపోయిన వాయువులు, ఆమ్లసహిత వాతావరణం మూలంగా, వాతం పెరిగి, వానాకాలంలో జీర్ణశక్తి సన్నగిల్లుతుంది.
పిత్త: వానాకాలంలో క్షీణించిన జీర్ణశక్తి మూలంగా వేసవిలో వేడి పెరగడంతో పాటు, పిత్తం కూడా పెరుగుతుంది. వానాకాలం చల్లని వాతావరణం చెలరేగిన వెంటనే లక్షణాలు ఇబ్బంది పెట్టడం మొదలుపెడతాయి. కాబట్టి వర్ష రుతువులో వాతం పెరగడం, పిత్తం పేరుకుపోవడం మూలంగా ఈ కాలంలో కొన్ని రకాల సమస్యలు విపరీతంగా వేధిస్తాయి.
కాబట్టి వాతం, పిత్తాలను సమతుల్యం చేసే ఆహారపుటలవాట్లు, జీవనశైలి మార్పులను స్వాగతించాలి. లేదంటే వర్ష రుతువులో వేధించే టైఫాయిడ్, కలరా, కామెర్లు, జలుబు, దగ్గు మొదలైన ఇబ్బందులు తప్పవు. ఈ రుగ్మతలు దరి చేరకుండా ఉండాలంటే అభ్యంగనం లేదా నూనెతో మర్దన, స్వేదనం, బస్తి చికిత్సలను క్రమంతప్పక అనుసరించాలి.
అభ్యంగనం
వర్షాకాలంలో పెరిగే కీళ్ల నొప్పులు, ఎముకల నొప్పుల నుంచి విముక్తి పొందడానికి అభ్యంగనం ఆచరించాలి. వర్షాకాలంలో వన్నె తగ్గి, నిర్జీవంగా తయారయ్యే చర్మానికి కూడా ఈ చికిత్స ఎంతో మేలు చేస్తుంది. చర్మానికి తేమ, మెరుపులను ఇవ్వడంతో పాటు ఎముకలు బలపడేలా చేస్తుంది అభ్యంగనం. నూనెతో మర్దన తర్వాత తీసుకునే ఆవిరి స్నానం వల్ల చర్మ రంథ్రాలు తెరుచుకుని విషతుల్య వ్యర్థాలు శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి. ఫలితంగా వాపులు, నొప్పులు తగ్గడంతోపాటు బిగుసుకుపోయిన కీళ్లు వదులవుతాయి.
స్వేదనం
దీన్లో రెండు రకాల చికిత్సలు ఉంటాయి. ఔషధ మొక్కల ఆకులను ఉడికించి ఉపయోగించే ‘పత్ర స్వేదనం’ చికిత్స వల్ల ఆర్థ్రయిటిస్ నొప్పులతో పాటు, ఎముకలు, కీళ్లకు సంబంధించిన వెన్ను సంబంధ స్పాండిలోసిస్ సమస్యలు కూడా అదుపులోకి వస్తాయి. రుక్ష స్వేదనం అనే ఉష్ణ చికిత్స వల్ల రుమటాయిడ్ ఆర్థ్రయిటిస్ నొప్పులు తగ్గుముఖం పడతాయి.
బస్తి (ఎనీమా)
ఈ చికిత్సలో వాడే నూనెలు, ఇతర కషాయాలు వాత దోషాన్ని హరిస్తాయి. వాత దోషం మూలంగా శరీరంలో చేరుకున్న మలినాలు నూనె లేదా కషాయ ఎనీమాల వల్ల బయటకు వెళ్లిపోతాయి.
జలువు, దగ్గులకు ఆయుర్వేద చికిత్స!
వర్షాకాలం జలుబు, దగ్గు అత్యంత సహజం. ఈ రుగ్మతలను తేలికగా వదిలించుకోవాలంటే....
కొన్ని చుక్కల నిమ్మరసం, చిటికెడు దాల్చినచెక్క పొడి, అర చెంచా తేనెలను కలిపి రోజూ రెండు పూటలా తీసుకోవాలి.
రోజంతా గోరువెచ్చని నీళ్లు తాగుతూ ఉండాలి. వేడినీళ్లు జలుబు, దగ్గు, గొంతునొప్పులకు కారణమయ్యే వైర్‌సలతో పోరాడే శక్తినిస్తాయి. అలాగే శరీరంలోని ఇన్‌ఫెక్షన్లను బయటకు తోలి, శరీరానికి సరిపడా హైడ్రేషన్‌ను అందిస్తాయి.
రోజుకొక ఉసిరి కాయ తింటూ ఉన్నా కాలేయం ఆరోగ్యం భేషుగ్గా ఉండి, రక్త ప్రసరణ మెరుగై వ్యాధికారక క్రిముల నుంచి రక్షణ పొందగలుగుతాం!
అవిసె గింజలను నీళ్లలో చిక్కబడేవరకూ ఉడికించి, వడకట్టాలి. ఈ కషాయంలో నిమ్మరసం, తేనెలను కలిపి తీసుకున్నా జలుబు, దగ్గులు తగ్గుతాయి.
నల్లమిరియాలు, బెల్లం, జీలకర్ర నీళ్లలో మరిగించి, తీసుకున్నా జలుబు, దగ్గు వల్ల పట్టేసిన ఛాతీ వదులై ఊపిరి అందుతుంది.
క్యారట్ రసం తాగడం వల్ల జలుబు దరి చేరకపోగా, వచ్చిన జలుబు కూడా త్వరగా తగ్గిపోతుంది.
ఆయుర్వేద చికిత్సలతో జ్వరాలు బలాదూర్!
ఆయుర్వేదం జ్వరాలను రెండు రూపాల్లో అంచనా వేస్తుంది. జ్వరాన్ని జ్వరంగానూ లేదా ఇతర రుగ్మతల లక్షణంగానూ పరిగణించి, తదనుగుణ చికిత్స అందిస్తే రుగ్మత అదుపులోకి వస్తుంది. రుతువును బట్టి ఆ కాలంలో వచ్చే జ్వరాలకు ఆయుర్వేదంలో వేర్వేరు పేర్లు ఉన్నాయి. వర్ష రుతువులో వచ్చే జ్వరాలకు ఆయుర్వేదంలో ‘వతజ జ్వరం’ అని పేరు. ఈ జ్వరాలకు ఆయుర్వేదంలో చక్కని చిట్కాలు ఉన్నాయి.
గ్లాసుడు నీళ్లలో చిటికెడు దాల్చినచెక్క పొడి, చిటికెడు మిరియాలపొడి కలిపి వేడి చేసి, నిమ్మరసం కలుపుకుని తాగితే జ్వరంతోపాటు, గొంతు నొప్పి కూడా తగ్గుతుంది.
జీలకర్ర అద్భుతమైన యాంటీసెప్టిక్! జీలకర పొడి కలిపి మరిగించిన నీటిలో తేనె కలుపుకుని తాగితే వర్షాకాల సంబంధ జ్వరాలు తగ్గుముఖం పడతాయి.
జ్వరంతోపాటు విపరీతమైన జలుబు, దగ్గు కూడా ఉంటే గోరువెచ్చని తేనెలో పావు చెంచా దాల్చిన చెక్క పొడి కలిపి రోజుకు మూడు సార్లు తీసుకోవాలి.
డెంగ్యు జ్వర చికిత్స
ఆయుర్వేదంలో ఈ జ్వరాన్ని ‘దండక జ్వరం’ అంటారు. ఈ జ్వరం వేధిస్తున్నప్పుడు తేలికగా అరిగే గంజి ఆహారంగా ఇవ్వాలి. తులసి, యాలకులు వేసి కాచిన కషాయాన్ని ఇవ్వాలి. కారాలు, నూనెలు తగ్గించి వండిన ఆహారం ఇవ్వాలి. పునర్వవ మూలికతో తయారైన కషాయంతో డెంగ్యు జ్వరం అదుపులోకి వస్తుంది.
అలాగే వ్యాధినిరోధకశక్తిని పెంచడం ద్వారా పరోక్షంగా ఈ జ్వరం తగ్గేలా చేయవచ్చు. కాబట్టి రోగనిరోధశక్తిని పెంచే తులసి నీళ్లను రోజంతా తాగించాలి. అలాగే రోజు మొత్తంలో 10 నుంచి 15 తులసి ఆకులు నమిలించాలి.
డెంగ్యు జ్వరాన్ని తగ్గించే ‘ధతుర’ మూలికను ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో వాడాలి. మెంతి ఆకులతో తయారుచేసిన తేనీరు తాగుతూ, ద్రాక్ష, దానిమ్మ రసాలు తీసుకున్నా డెంగ్యు జ్వరం తగ్గుముఖం పడుతుంది.
మూలికలు, పత్రాలు, సుగంధద్రవ్యాలతో తయారయ్యే కషాయాలు వర్ష రుతువు వేధించే పలు రుగ్మతలకు దివ్యౌషధంలా పని చేస్తాయి. అవేంటంటే...
రోగనిరోధకశక్తి: ఈ రుతువులో సన్నగిల్లే వ్యాధినిరోధకశక్తిని మెరుగు పరుచుకోవడం కోసం యాలకులు, దాల్చినచెక్క, తెల్ల మిరియాలు వేసిన నీటిని మరిగించి తాగాలి. రుచి సహించకపోతే కొద్దిగా తేనె కలుపుకోవచ్చు. ఈ కషాయం ప్రతి రోజూ తీసుకుంటే వ్యాధినిరోధకశక్తి మెరుగ్గా ఉండి, వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి.
అజీర్తి: వానాకాలం తగ్గే అజీర్తిని సరిచేయడం కోసం నీటిలో వాము, సోంపు వేసి మరిగించి, తేనె కలిపి తీసుకోవాలి. భోజనం చేసిన ప్రతిసారీ ఈ కషాయం తాగుతూ ఉంటే, అజీర్తి సమస్య తలెత్తదు.
సాధారణ జ్వరం: ఏడు తులసి ఆకులు, ఐదు లవంగాలు తీసుకుని దంచాలి. వీటిని మరిగించిన నీటిలో కలిపి, కొద్దిగా సముద్రపు ఉప్పు చేర్చి, రెండు రోజులపాటు రోజుకు రెండుసార్లు తాగాలి. ఇలా చేస్తే వర్ష రుతు సంబంధ సాధారణ జ్వరాలు తగ్గుతాయి.
Updated Date - Jul 16 , 2024 | 01:35 AM