ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Navya : పేగులు జారితే.. ప్రమాదమే

ABN, Publish Date - Jul 16 , 2024 | 01:16 AM

ఏదైనా అంతర్గత అవయవం తన స్థానం నుంచి బయటకు చొచ్చుకురావటాన్నే ‘హెర్నియా’ అంటారు. దీన్లో ఎన్నో రకాలున్నా అత్యంత సాధారణంగా కనిపించే సమస్య...‘ఇంగ్వైనల్‌ హెర్నియా’.

ఏదైనా అంతర్గత అవయవం తన స్థానం నుంచి బయటకు చొచ్చుకురావటాన్నే ‘హెర్నియా’ అంటారు. దీన్లో ఎన్నో రకాలున్నా అత్యంత సాధారణంగా కనిపించే సమస్య...‘ఇంగ్వైనల్‌ హెర్నియా’. దీన్లో పొత్తికడుపులోని పేగులు పొట్ట దగ్గరున్న కణజాలాన్ని నెట్టుకుంటూ చర్మం అడుగున ఓ మూటలాగా బయటకు చొచ్చుకొని కనిపిస్తాయి.ఈ రకం హెర్నియా పొత్తికడుపు, గజ్జల దగ్గర స్పష్టంగా కనిపిస్తుంది.

  • ఎవరిలోనైనా హెర్నియా లక్షణాలు ఒకేలా ఉంటాయి. అవేంటంటే...

  1. దగ్గినప్పుడు, వంగినప్పుడు, వ్యాయామం చేస్తున్నప్పుడు నొప్పి ఎక్కువవుతుంది.

  2. నొప్పి సూదిదో గుచ్చినట్టు ఉంటుంది.

  3. గజ్జల్లో బరువుగా ఉంటుంది.

  4. పురుషుల్లో బీజాల వాపు కనిపిస్తుంది.

ఎందుకొస్తుంది?

హెర్నియాకు ఎన్నో కారణాలున్నాయి. పుట్టుకతోనే మన పొత్తికడుపులో ‘ఇంగ్వైనల్‌ కెనాల్‌’ అనే సహజసిద్ధమైన ఓపెనింగ్‌ ఉంటుంది. ఏడవ నెల గర్భంలో మగపిల్లల్లోనైతే ఈ కెనాల్‌లో బీజాలు చోటు చేసుకుని ఉండి ప్రసవానికి ముందు కిందకి జారతాయి.

ఆడపిల్లల్లోనైతే ఈ కెనాల్‌లో మూత్రాశయ లిగ్మెంట్లు ఉండి ప్రసవానికి కొద్ది రోజుల ముందు కిందకి జారతాయి. ఈ రకమైన శారీరక లక్షణం కారణంగా స్వతస్సిద్ధంగానే స్త్రీపురుషుల పొత్తికడుపుల్లో ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఈ కెనాల్స్‌ ఉన్న చోట కణజాలం కూడా కాస్త బలహీనంగా ఉంటుంది.


స్త్రీలల్లో...

స్త్రీలల్లో కనిపించే వెంట్రల్‌ హెర్నియాకు ప్రధాన కారణం ‘సిజేరియన్‌ ఆపరేషన్‌’. ఈ సర్జరీకి ఎక్కువ సమయం పట్టినా, సర్జరీ కోత నిలువుగా ఉన్నా, చర్మపు పొరలకు కుట్లు సరిగా వేయకపోయినా, కుట్లు ఇన్‌ఫెక్షన్‌కు గురయినా హెర్నియా వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

అలాగే ఎక్కువ ప్రసవాల ఫలితంగా పొత్తికడుపు కండరాలు పటుత్వం తగ్గినా ఈ సమస్య తలెత్తవచ్చు. కాబట్టి సిజేరియన్‌ చేయించుకున్న స్త్రీలు హెర్నియా రాకుండా ఉండటం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సర్జరీ నుంచి కోలుకున్న రెండు నెలల నుంచే పొత్తికడుపును బలపరిచే వ్యాయామాలు చేయాలి. సాధారణ ప్రసవమైన స్త్రీలు ప్రసవమైన రెండు వారాలనుంచే వ్యాయామాలు మొదలుపెట్టాలి.


వృద్ధుల్లో...

వయసు పెరిగేకొద్దీ కండరాల పటుత్వం తగ్గుతుంది. అలాగే చర్మం అడుగునుండే కణజాలం పటుత్వం కూడా! దాంతో ఆ ప్రదేశం ఒత్తిడికి లోనైనప్పుడు హెర్నియా వచ్చే అవకాశాలు పెరుగుతాయి. పిల్లలు దగ్గినంత బలంగా వృద్ధులు దగ్గలేరు.

బలంగా దగ్గి కళ్లెను బయటకు తీసుకురాలేక తక్కువ శక్తితో దగ్గుతూ ఉంటారు. దాంతో పొత్తికడుపు ఒత్తిడికి గురై హెర్నియా వస్తుంది. కొందరిలో ప్రాస్టేట్‌ గ్రంథి వ్యాధులకు గురై పరిమాణం పెరుగుతుంది. దీని వల్ల కూడా హెర్నియా తలెత్తుతుంది. వృద్ధుల్లో మధుమేహం అదుపు తప్పినా హెర్నియా వచ్చే అవకాశాలు పెరుగుతాయి. వృద్ధుల్లో మలబద్ధకం సమస్య ఉంటుంది. దాంతో మల విసర్జన కోసం గట్టిగా ముక్కటం వల్ల కూడా హెర్నియా వస్తుంది.


నిర్లక్ష్యం చేస్తే?

చర్మపు తిత్తిలోకి పేగులు దిగిపోయి పొత్తికడుపు లేదా గజ్జల్లో హెర్నియా కనిపిస్తే వీలైనంత తొందరగా వైద్యుల్ని సంప్రతించి చికిత్స మొదలుపెట్టాలి. లేదంటే పొట్టలో చర్మం అడుగున ఏర్పడిన రంథ్రం పెద్దదైపోతూ సమస్య మరింత జటిలమవుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ తిత్తిలోకి చేరుకున్న పేగులకు రక్త ప్రసరణ అందక కుళ్లిపోవచ్చు కూడా!

ఇలాంటప్పుడు ఆ పేగులు సెప్టిక్‌ అవుతాయి. ఇన్‌ఫెక్షన్‌ పెరిగి ప్రాణాలకే ప్రమాదం సంభవించవచ్చు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేసే కొంతమందిలోనైతే పేగుల పనితీరు తలకిందులై మలం, ఆహారం కలిసిపోయి అవి వెళ్లే మార్గాలు తారుమారవ్వచ్చు. ఇది ఎంతో ప్రమాదకరమైన పరిస్థితి. ఇలా జరగకుండా ఉండాలంటే హెర్నియా లక్షణాలు కనిపించగానే ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి.


పసికందుల్లో

తల్లి గర్భంలో ఏడునెలల వయసు మగపిండంలో బీజాలు పొత్తికడుపులో ఉండి ప్రసవానికి ముందు కిందకి జారతాయి. ఒకవేళ బిడ్డ ముందుగానే ఏడు నెలలకే పుడితే బీజాలు కిందకి రాక లేదా పేగులు, కొవ్వు, ద్రవం పొత్తికడుపులోని బలహీన ప్రదేశంలోకి చొచ్చుకొచ్చి హెర్నియా తయారవుతుంది.

దాంతో ఈ పిల్లలు బొడ్డు లేదా గజ్జల్లో వాపుతో పుడతారు. బొడ్డు వాచినట్టు కనిపిస్తుంది కాబట్టే ఈ రకం హెర్నియాను ‘అంబెలికల్‌ హెర్నియా’ అంటారు. ఈ సమస్య బిడ్డ పుట్టిన కొన్ని నెలల్లో కూడా కనిపించవచ్చు. ఇలాంటప్పుడు లాప్రోస్కోపీ టెక్నిక్‌తో ఆ ప్రదేశాన్ని చేరుకుని చర్మపు తిత్తికి దారంతో ముడి వేసి వదిలేస్తారు. ఇలా ముడివేయటం వల్ల పేగులు మళ్లీ తిత్తిలోకి చేరుకోకుండా ఉంటాయి.

Updated Date - Jul 16 , 2024 | 01:16 AM

Advertising
Advertising
<