ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Navya : కిడ్నీలు ఇలా క్షేమం

ABN, Publish Date - Jun 18 , 2024 | 01:12 AM

నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకుపోతూ ఉండే కిడ్నీలు జబ్బు పడే ప్రక్రియ కూడా నిశ్శబ్దంగానే జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి వాటి మీద ఓ కన్నేసి ఉంచి, ముందస్తు పరీక్షలతో అప్రమత్తంగా నడుచుకుంటూ ఉండాలంటున్నారు వైద్యులు.

కిడ్నీ కేర్‌

నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకుపోతూ ఉండే కిడ్నీలు జబ్బు పడే ప్రక్రియ కూడా నిశ్శబ్దంగానే జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి వాటి మీద ఓ కన్నేసి ఉంచి, ముందస్తు పరీక్షలతో అప్రమత్తంగా నడుచుకుంటూ ఉండాలంటున్నారు వైద్యులు.

మూత్రపిండాలు రక్తాన్ని వడగట్టే సామర్ధ్యాన్ని క్రమేపీ కోల్పోతూ ఉంటాయి. ఏడాదికి 5% చొప్పున సహజంగానే కిడ్నీల సామర్థ్యం తిరగిపోతూ ఉంటుంది. దీనికి తోడు అధిక రక్తపోట, మధుమేహం, గుండె జబ్బులు లాంటి రుగ్మతలు, ఊబకాయం, అస్తవ్యస్థ జీవనశైలి లాంటి సమస్యల వల్ల కిడ్నీలు మరింత వేగంగా దెబ్బతినడం మొదలుపెడతాయి. అయితే కిడ్నీ ఫెయిల్యూర్‌, అక్యూట్‌ కిడ్నీ ఫెయిల్యూర్‌ , క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌, ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్‌ రీనల్‌ ఫెయిల్యూర్‌ అనే మూడు దశల్లో సాగుతుంది.

అక్యూట్‌: అకస్మాత్తుగా వాంతులు, విరోచనాలతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోయినప్పుడు లేదా ఒంటికి సరిపడని మందులు తీసుకోవడం వల్ల, గుండెపోటుకు గురైన సందర్భాల్లో ఆ ప్రభావాలు కిడ్నీల మీద పడి, వాటి సామర్థ్యం కొంత మేరకు దెబ్బ తింటుంది. అలాగే మూత్రపిండాల్లో రాళ్ల వల్ల, తీవ్రమైన కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల కూడా ఇలా జరగవచ్చు. ఇలాంటి సందర్భాల్లో కిడ్నీల పనితీరు దెబ్బతినడానికి కారణమైన ప్రధాన సమస్యను చికిత్సతో సరిదిద్దితే, కిడ్నీలు కూడా పూర్వపు స్థితికి చేరుకుంటాయి. అయితే మూత్రపిండాలు నిమిషానికి 70 నుంచి 100 మి.లీ రక్తాన్ని వడగట్టడానికి బదులుగా, 15 మి.లీ రక్తాన్ని మాత్రమే వడగట్టే స్థితికి చేరుకుంటే, అప్పుడు ఆ వ్యక్తులకు డయాలసిస్‌ అవసరమవుతుంది. కిడ్నీలు పూర్తి సామర్థ్యాన్ని పుంజుకునే వరకూ ఇలా డయాలసిస్‌ అందించవలసి ఉంటుంది. ఇలా కాకుండా కిడ్నీల వడపోత సామర్థ్యం 15, 70 మి.లీ మధ్య ఉంటే, మందులతోనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావచ్చు.

క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌: ఇది నిశ్శబ్ద వ్యాధి. దీన్ని మొదట్లోనే కనిపెట్టగలిగితే, సమస్యను సరిదిద్దుకోగలిగే అవకాశం ఉంటుంది. కిడ్నీల సామర్ధ్యం 60 మి.లీటర్లకు పడిపోయినప్పుడు కనిపెట్టినా, తిరిగి చికిత్సతో కిడ్నీలను కాపాడుకోవచ్చు. అలా కాకుండా వ్యాధిని కనిపెట్టకుండా కిడ్నీల సామర్థ్యం 10 మి.లీకు పడిపోతే, తిరిగి చికిత్సతో కిడ్నీలను మెరుగు చేసుకునే పరిస్థితి ఉండదు. క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌లో కిడ్నీల సామర్థ్యం 90ుకి పడిపోయినా ఎటువంటి లక్షణాలు బయల్పడవు.


వంద మంది కిడ్నీ ఫెయిల్యూర్‌ రోగుల్లో, దీర్ఘకాలిక మధుమేహం, అధిక రక్తపోటులను అదుపులో పెట్టుకోకపోవడం వల్ల కిడ్నీలు ఫెయిల్‌ అయిన వాళ్లు 70 నుంచి 80 మంది ఉంటారు. వంశపారంపర్య కిడ్నీ జబ్బులు సంక్రమించిన వాళ్లు, పదే పదే కిడ్నీ స్టోన్స్‌, కిడ్నీ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే సమస్య బారిన పడేవాళ్లు, పుట్టుకతో సమస్యను వెంట తెచ్చుకున్నవాళ్లు, దీర్ఘకాలికంగా పెయిన్‌ కిల్లర్స్‌ తీసుకున్న వాళ్లు, అవసరం లేకపోయినా మూలికా మందులు వాడుకునేవాళ్లు, గుండెజబ్బులు ఉన్న మిగతా 20 నుంచి 30 మందిలో కిడ్నీలు ఫెయిల్‌ అవుతూ ఉంటాయి.

ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్‌ రీనల్‌ ఫెయిల్యూర్‌: అతి తక్కువ కాలంలో కొన్ని రోజుల వ్యవధిలో కిడ్నీలు ఫెయిల్‌ అయిపోయే పరిస్థితి ఇది. క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌కు దారి తీసే కారణాలే దీనికీ వర్తిస్తాయి. వీళ్లకు డయాలసిస్‌ లేదా కిడ్నీ మార్పిడి ఒక్కటే పరిష్కారం.

ఈ పరీక్షలు అత్యవసరం

మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవాళ్లు, కుటుంబ చరిత్రలో కిడ్నీ వ్యాధులు ఉన్నవాళ్లు, పదే పదే కిడ్నీ స్టోన్లు ఏర్పడుతున్న వాళ్లు, గుండె జబ్బులున్నవాళ్లు ఏడాదికోసారి ‘ఎస్టిమేటెడ్‌ జిఎఫ్‌ఆర్‌ టెస్ట్‌’ చేయించుకుంటూ ఉండాలి. అలాగే మూత్రపిండాల పనితీరు మెరుగ్గానే ఉన్నప్పటికీ, మూత్రంలో ప్రొటీన్‌ లేదా రక్తం పోతూ ఉంటే, భవిష్యత్తులో కిడ్నీల సామర్థ్యం తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి కంప్లీట్‌ యూరిన్‌ ఎగ్జామినేషన్‌ పరీక్ష కూడా చేయించుకోవాలి. ఈ పరీక్షల్లో కిడ్నీ సామర్థ్యం 80 శాతానికంటే తగ్గితే, కారణాలను గుర్తించి, తగిన చికిత్స తీసుకోవాలి.

మధుమేహులు ఇలా....

మధుమేహులు రక్తంలోని చక్కెరలతో పాటు, అధిక రక్తపోటును కూడా అదుపులో ఉంచుకోవాలి. ఒకసారి మధుమేహం వచ్చిన తర్వాత, రక్తపోటు 130/80 దగ్గర ఉండేలా చూసుకోవాలి. సాధారణంగా బిపిని తేలికగా తీసుకుంటూ ఉంటారు. మందులు వేసుకున్నా, వేసుకోకపోయినా బిపిలో ఎలాంటి తేడా తెలియడం లేదు కదా అని మందులు మానేస్తూ ఉంటారు. కానీ రక్తపోటు నిర్థారణ అయిన తర్వాత వైద్యుల సూచన మేరకు మందులు వాడుకుంటూనే ఉండాలి. అలాగే మధుమేహులు ప్రతి మూడు నెలలకోసారి గ్లోకోజినేటెడ్‌ హీమోగ్లోబిన్‌ 7ు తక్కువ కంటే తక్కువగా ఉండేలా చూసుకుంటూ ఉండాలి. కిడ్నీ డిసీజ్‌లో రక్తంలో హీమోగ్లోబిన్‌ తగ్గడం, శరీరంలో యాసిడ్‌, పొటాషియం శాతం పెరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి కిడ్నీ డిసీజ్‌ దశ ఆధారంగా సమస్యలను సరిదిద్దుకోగలిగితే వ్యాధి చివరి దశకు చేరుకోకుండా ఉంటుంది.

కిడ్నీ కాపాడుకోవాలంటే...

  • స్మోకర్ల మూత్రపిండాల సామర్ధ్యం వేగంగా తగ్గిపోతుంది. కాబట్టి నికోటిన్‌ కలిగి ఉండే ధూమపానం, గుట్కా, పాన్‌ మసాలాలను మానేయాలి.

  • కిడ్నీ జబ్బులు ఉన్న వాళ్లు పెయిన్‌ కిల్లర్స్‌కు దూరంగా ఉండాలి.

  • ఏ రుగ్మత కోసం వైద్యులను సంప్రతించినా, తమకున్న కిడ్నీ జబ్బు గురించి చెప్పాలి.

  • 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఏడాదికోసారి మూత్రపిండాల పనితీరును పరీక్షించుకుంటూ ఉండాలి.

  • కుటుంబ చరిత్రలో కిడ్నీ సమస్య ఉన్నవాళ్లు, హృద్రోగులు, మధుమేహులు, హై బిపి ఉన్న వాళ్లు కూడా ఏడాదికోసారి కిడ్నీలను పరీక్షించుకుంటూ ఉండాలి.

  • రోజు మొత్తంలో తీసుకునే ఉప్పును 3 నుంచి 4 గ్రాములకు తగ్గించాలి.

  • వారంలో ఐదు రోజుల పాటు, రోజుకు కనీసం 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి.

  • బరువును అదుపులో ఉంచుకోవాలి.

  • కొవిడ్‌తో కిడ్నీ జబ్బుకుకు గురైనవాళ్లు ప్రతి మూడు నెలలకోసారి మూత్రంలో ప్రొటీన్‌ నష్టాన్ని గమనించుకుంటూ ఉండాలి. కిడ్నీ పనితీరును పరీక్షించుకుంటూ, దాని సామర్ధ్యాన్ని కాపాడుకునే జాగ్రత్తలు పాటించాలి.

  • కిడ్నీ సమస్య తీవ్రంగా ఉన్న వాళ్లు ప్రొటీన్‌ పరిమితి పాటించాలి.

  • రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు తాగాలి.


ఈ లక్షణాల మీద ఓ కన్నేసి...

  • తరచూ మూత్రం రావడం లేదా మూత్రం తగ్గిపోవడం

  • కాళ్ల వాపు

  • రక్తపోటు పెరగడం

  • తొందరగా నీరసించిపోవడం

  • ఆయాసం రావడం ఫ ఫిట్స్‌

  • రక్తంలో హీమోగ్లోబిన్‌ తగ్గిపోవడం

ఒకే కిడ్నీ ఉంటే...

వీళ్లు రెండు కిడ్నీలు ఉన్న వాళ్లు పాటించే జాగ్రత్తలనే పాటించాలి. వీళ్లలో ఉన్న ఒక్క కిడ్నీ ఎక్కువగా పని చేయడం వల్ల మూత్రంలో ప్రొటీన్‌ నష్టం జరుగుతూ ఉంటుంది. ఈ పరిస్థితి అరుదుగా ఏర్పడుతుంది. కాబట్టి ఏడాదికోసారి కిడ్నీలను పరీక్షించుకుంటూ ఉండాలి. కంప్లీట్‌ యూరిన్‌ ఎగ్జామినేషన్‌ చేయించుకుంటూ ఉండాలి.

కిడ్నీ ఫ్యాక్ట్స్‌!

  • శరీరంలోని మొత్తం రక్తాన్ని కిడ్నీలు గంటకు 12 సార్లు వడపోస్తూ ఉంటాయి.

  • రోజు మొత్తంలో మూత్రపిండాలు 180 లీటర్ల రక్తాన్ని వడపోస్తాయి.

  • కాలేయానికి చోటివ్వడం కోసం కుడివైపు మూత్రపిండం ఎడమవైపు కిడ్నీ కంటే కొద్దిగా చిన్నదిగా, దిగువకు ఉంటుంది.

  • విపరీతంగా నీళ్లు తాగడం కిడ్నీలకు ప్రమాదకరం. ఎక్కువ పరిమాణంలోని నీళ్లను తాగడం వల్ల కిడ్నీలు అన్ని నీళ్లను త్వరితంగా వడగట్టలేకపోవడం మూలంగా రక్తంలోని సోడియం పలుచనవుతుంది. హైపోనట్రీమియా అనే ఈ స్థితిలో శరీరంలోని కణాలు వాపుకు గురవుతాయి.

  • నొప్పి నివారణ మందులైన ఇబ్యుప్రోఫెన్‌, యాస్పిరిన్‌లు కిడ్నీలను

    దెబ్బతీస్తాయి.

డాక్టర్‌ రాజశేఖర చక్రవర్తి

సీనియర్‌ నెఫ్రాలజిస్ట్‌ అండ్‌

కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ స్పెషలిస్ట్‌,

యశోద హాస్పిటల్స్‌,

హైటెక్‌ సిటీ, హైదరాబాద్‌.

Updated Date - Jun 18 , 2024 | 01:12 AM

Advertising
Advertising