నెలలు నిండకుండా పుడితే?
ABN, Publish Date - Nov 12 , 2024 | 06:05 AM
తొమ్మిది నెలలు నిండినప్పుడే బిడ్డ పరిపూర్ణ ఆరోగ్యంతో ఉంటాడనే విషయం మనందరికీ తెలిసిందే! కానీ కొందరు పిల్లలు 37 నుంచి 40 వారాల కంటే ముందు పుట్టేస్తూ ఉంటారు.
నవంబరు 17వరల్డ్ ప్రిమెచ్యూర్ డే
నెలలు నిండకుండా పుట్టే పిల్లలు సాధారణ పిల్లల్లా ఆరోగ్యంగా ఎదగాలంటే పుట్టింది మొదలు అనుక్షణం పదిలంగా కాపాడుకోవాలి. అందుకు అవసరమైన అత్యాధునిక వైద్య సదుపాయాలు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండే ఆస్పత్రినే ఎంచుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా పిల్లలు నెలలు నిండకుండా పుట్టే పరిస్థితులను తొలగించుకోవాలి. అందుకు ఏం చేయాలో, ఎలా నడుచుకోవాలో వైద్యులు ఇలా వివరిస్తున్నారు.
తొమ్మిది నెలలు నిండినప్పుడే బిడ్డ పరిపూర్ణ ఆరోగ్యంతో ఉంటాడనే విషయం మనందరికీ తెలిసిందే! కానీ కొందరు పిల్లలు 37 నుంచి 40 వారాల కంటే ముందు పుట్టేస్తూ ఉంటారు. ఈ పిల్లలే ప్రిమెచ్యూర్ బేబీస్. అరుదుగా కొన్ని సందర్భాల్లో 24 నుంచి 26 వారాలకే ప్రసవం అయిపోతూ ఉంటుంది. ఈ కోవకు చెందిన పిల్లల పట్ల రెట్టింపు అప్రమత్తతతో వ్యవహరించవలసి ఉంటుంది. నెలలు నిండకుండా పుట్టే పిల్లల్లో ప్రధాన అంతర్గత అవయవాలు పూర్తిగా ఎదిగిన స్థితిలో ఉండవు. ఎంత ముందుగా ప్రసవమైపోతే, పిల్లల్లో సమస్యలు అంత తీవ్రంగా ఉంటాయి. కాబట్టి ఈ పిల్లలకు పుట్టిన వెంటనే తక్షణ వైద్య సహాయం అవసరమవుతుంది.
మొదటి గంటే ప్రధానం
నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు మిగతా పిల్లలతో సమానంగా ఎదగలేరన్నది అపోహ మాత్రమే! పుట్టిన మొదటి గంటలోగా అన్ని వసతులూ ఉన్న ఆస్పత్రిలో వైద్య సేవలను అందించగలిగితే, ఈ పిల్లలు అన్ని విధాలా సాధారణ పిల్లల్లాగే ఎదిగే సామర్థ్యాన్ని సమకూర్చుకోగలుగుతారు. అందుకోసం ఆస్పత్రిలో సరిపడా పరికరాలు, నియో నేటల్ కేర్ సదుపాయాలు, అనుభవజ్ఞులైన వైద్య సిబ్బంది ఉండాలి. పుట్టిన మొదట గంట మీదే బిడ్డ ఆరోగ్యం, భవిష్యత్తు ఆధారపడి ఉంటాయి.
నెలలు నిండకుండా పుట్టే పిల్లల్లో ఊపిరితిత్తులు, గుండె, మెదడు, నాడీ, జీర్ణ వ్యవస్థలు పూర్తిగా ఎదగని స్థితిలో ఉంటాయి. కాబట్టి పుట్టిన వెంటనే వెంటిలేటర్ సహాయంతో కృత్రిమ శ్వాసను అందిస్తూ, ఐవి ద్వారా పోషకాలను అందించాలి. అలాగే నాడీవ్యవస్థ మెరుగు పడడం కోసం ఇంక్యుబేటర్ సహాయంతో కృత్రిమ వెచ్చదనాన్ని అందించాలి. 24 వారాలకు పుట్టిన పిల్లలు, 28 వారాలకు పుట్టిన పిల్లల కంటే బలహీనంగా ఉంటారు. తల్లి గర్భంలో బిడ్డ గడిపే ప్రతి రోజూ కీలకమైనదే! కాబట్టి బిడ్డ ఎంత ముందుగా ప్రసవించినా, తల్లి గర్భాన్ని మరిపించే సదుపాయాలు కల్పిస్తూ, తగిన పోషణను కూడా అందించగలిగితే నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు కూడా నెలలు నిండిన తర్వాత పుట్టిన పిల్లలతో సమానంగా ఆరోగ్యంగా ఉంటారు. అయితే అందుకోసం పుట్టింది మొదలు నెలలు నిండేవరకూ ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలోనే ఉండవలసి ఉంటుంది.
నెలలు ఎందుకు నిండడం లేదు?
ఇందుకు కారణం బిడ్డలో ఉండవచ్చు, గర్భిణిలో ఉండవచ్చు. తల్లికి అధిక రక్తపోటు, మధుమేహం, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్, మూత్రపిండా ఇన్‌ఫెక్షన్ ఉన్నప్పుడు, ఉమ్మనీరును ప్రసవానికి ఎంతో ముందగానే కోల్పోయి, ప్రసవం కానప్పుడు నెలలు నిండకుండా పిల్లలు పుట్టే అవకాశాలుంటాయి. కృత్రిమ గర్భధారణలో కూడా ఈ సమస్య ఉంటుంది. అలాగే గర్భంలో బిడ్డ ఎదుగుదల క్షీణించినప్పుడు, బిడ్డలో జన్యుపరమైన సమస్యలు ఉన్నప్పుడు, కవలలు, ముగ్గురు పిల్లలతో గర్భం దాల్చినప్పుడు కూడా పిల్లలు నెలలు నిండకుండా పుట్టే అవకాశాలుంటాయి. అలాగే మొదటిసారి నెలలు నిండకుండా ప్రసవమైపోతే, రెండోసారి కూడా ఇదే పరిస్థితి తలెత్తవచ్చు. కాబట్టి ఈ పరిస్థితి పునరావృతం అవకుండా ఉండడం కోసం, కారణాన్ని కచ్చితంగా తెలుసుకుని దాన్ని అరికట్టడంతో పాటు, గర్భం దాల్చినప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలో మెలగాలి.
అన్ని సదుపాయాలు ఉండేలా...
నెలలు నిండకుండా ప్రసవానికి దారి తీసే ఆరోగ్య సమస్యలున్న గర్భిణులు, ఆరో వారం నుంచే అప్రమత్తంగా ఉండాలి. మొదటి ప్రసవం 24 వారాలకు జరిగిపోతే, రెండో ప్రసవం అంతకంటే రెండు వారాల ముందే జరిగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ కోవకు చెందిన తల్లులు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా తల్లీబిడ్డలు ఇద్దరికీ అవసరమైన వైద్యసేవలు అందుబాటులో ఉండే ఆస్పత్రులనే ఎంచుకోవాలి. అందుకోసం లెవల్ త్రీ ఎన్‌ఐసియు ఉన్న ఆస్పత్రులనే ఎంచుకోవాలి. ఇలాంటి ఆస్పత్రుల్లో ప్రసూతి వైద్యులతో పాటు, పసికందుల వైద్యులు కూడా అందుబాటులో ఉంటారు. ఇలా అన్ని జాగ్రత్తలు పాటించగలిగితే తల్లీ బిడ్డా ఆరోగ్యాలను పుంజుకుని, క్షేమంగా ఇంటికి చేరుకోగలుగుతారు.
తల్లి పాలు అమృత సమానం
బిడ్డ వయసుతో సంబంధం లేకుండా పుట్టిన వెంటనే తల్లి పాలు తాగించడం మొదలుపెట్టాలి. నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకు కూడా కచ్చితంగా తల్లి పాలు ఇవ్వవలసి ఉంటుంది. అయుతే నెలలు నిండకుండా పిల్లలు పుట్టిన సందర్భాల్లో తల్లికి పాలు ఎక్కువగా తయారు అవకపోవచ్చు. ఆ సందర్భాల్లో బ్రెస్ట్ పంప్ ద్వారా చుక్కల మోతాదులో పాలను సేకరించి, ట్యూబ్ ద్వారా ఎన్‌ఐసియులో ఉంచిన పసికందుకు అందించవలసి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక శిక్షణ పొందిన నర్సులు ఆస్పత్రుల్లో ఉంటారు. అరుదుగా కొన్ని సందర్భాల్లో తల్లి పాలిచ్చే పరిస్థితి లేనప్పుడు, తల్లి పాల బ్యాంక్ నుంచి పాలను తెప్పించి, పసికందుకు పట్టించవలసి ఉంటుంది. ఇలా బిడ్డ ఆస్పత్రిలో ఉన్నంత కాలం, పరిపూర్ణంగా కోలుకునే వరకూ పాల బ్యాంకు నుంచి పాలను ఉచితంగా పొందే సదుపాయం కూడా ఉంది.
ఇంటికి చేరుకున్న తర్వాత...
పూర్తిగా ఆరోగ్యాన్ని పుంజుకుని ఇంటికి చేరుకున్న పసికందులను, ఆ తర్వాత కూడా క్రమం తప్పకుండా పిల్లల వైద్యులకు చూపిస్తూ ఉండాలి. డిస్చార్జ్ అయిన 48 గంటలకు ఒకసారి, తర్వాత వారానికొకసారి, ఆ తర్వాత నెలకొకసారి... ఇలా ఏడాది పాటు వైద్యులకు చూపిస్తూ ఉండాలి. కంటి చూపు, ఘ్రాణ శక్తి, ఎదుగుదలలను ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి.
కంగారూ మదర్ కేర్ కీలకం
పుట్టినప్పుడు రెండున్నర కిలోల కంటే తక్కువ బరువుండే పిల్లలకు కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరమవుతుంది. మరీ ముఖ్యంగా కేవలం 700 గ్రాముల బరువుతో కూడా పిల్లలు పుడుతూ ఉంటారు. ఇలాంటి పిల్లలకు ‘కంగారూ మదర్ కేర్’ అవసరమవుతుంది. ఎలాంటి అచ్ఛాదన లేకుండా తల్లీ, బిడ్డా శరీరాలు ఒకదానికొకటి తగిలేలా, తల్లి స్పర్శనూ, వేడినీ బిడ్డ పొందే వెసులుబాటు ఉండే కంగారూ మదర్ కేర్‌తో, బిడ్డ ఎదుగుదల మెరుగ్గా ఉంటుంది. అలాగే తల్లులతోపాటు, తండ్రులూ, అమ్మమ్మ, తాతయ్యలు కూడా కంగారూ మదర్ కేర్‌కు అర్హులే! ఈ కేర్‌తో నాడీ, ఇంద్రియ వ్యవస్థలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. బిడ్డకు పరిపూర్ణ ప్రయోజనం దక్కడం కోసం రోజు మొత్తంలో 8 నుంచి 10 ఎనిమిది గంటల పాటు కంగారూ మదర్ కేర్‌ను కొనసాగించాలి. ఇలా బిడ్డ బరువు 3 నుంచి 4 కిలోలకు పెరిగేవరకూ కొనసాగించాలి.
గర్భానికి శరీరాన్ని సిద్ధం చేసి...
నెలలు నిండకుండానే ప్రసవమైపోవడానికి తీవ్ర ఆరోగ్య సమస్యలే కారణం కాదు. రక్తలేమితో కూడా ఇలా జరగవచ్చు. ఇతరత్రా ఆరోగ్య సమస్యలేవీ లేకపోయినా, రక్తలేమి కలిగి ఉంటే, నెలలు నిండకుండా ప్రసవమయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ పరిస్థితికి దారి తీయకుండా ఉండాలంటే గర్భం దాల్చడానికంటే ముందు నుంచే మహిళలు గర్భానికి శరీరాన్ని అన్ని విధాలా సంసిద్ధం చేయాలి. అధిక రక్తపోటు, వధుమేహాలను అదుపులో పెట్టుకోవాలి. ఇన్‌ఫెక్షన్లు దరి చేరకుండా చూసుకోవాలి. నెలసరి సమస్యలను సరిదిద్దుకోవాలి. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటూ, వైద్యులు సూచించే రక్తవృద్ధికి తోడ్పడే టానిక్కులు, మల్టీ విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవాలి.
- డాక్టర్ నిటాషా బగ్గా
పిడియాట్రీషియన్ అండ్ నియోనటాలజిస్ట్,
రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్,
హైదరాబాద్.
Updated Date - Nov 12 , 2024 | 06:05 AM