Drugs : ఆ మందులు మనకు ప్రమాదకరం
ABN, Publish Date - Jun 03 , 2024 | 11:38 PM
మనందరికీ ఇల్లే పదిలమైన ప్రదేశం. కానీ మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు, నిర్లక్ష్యాల వల్ల సురక్షితమైన ఇల్లే ప్రమాదకరమైన ప్రదేశంగా మారిపోతుంది. మరీ ముఖ్యంగా క్రిమికీటకాలు, ఎలుక మందులు, ఇంటిని
మనందరికీ ఇల్లే పదిలమైన ప్రదేశం. కానీ మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు, నిర్లక్ష్యాల వల్ల సురక్షితమైన ఇల్లే ప్రమాదకరమైన ప్రదేశంగా మారిపోతుంది. మరీ ముఖ్యంగా క్రిమికీటకాలు, ఎలుక మందులు, ఇంటిని శుభ్రపరిచే ఉత్పత్తులు లాంటివి పొరపాటున పొట్టలోకి చేరుకుంటే, ఆరోగ్యపరంగా తిరిగి సరిదిద్దలేని నష్టం జరగవచ్చు. కాబట్టి వీటితో తలెత్తే ప్రమాదాలు, ప్రత్యామ్నాయ పద్ధతుల గురించి తెలుసుకుందాం!
చిట్టెలుకలు, ఎలుకలు, పందికొక్కులు లాంటివి గ్రామాలకే పరిమితం కాదు. నగరాల్లో కూడా అవి స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. వాటితో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది కాబట్టి ఎన్నో రకాల ఎలుక మందులు తయారవుతున్నాయి. పొడి, పేస్ట్, పెల్లెట్స్, సిరీల్ బెయిట్స్ లేదా బ్లాక్స్ రూపంలో ఇవి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. వీటిని ఇళ్లలో ఉపయోగించినప్పుడు, పొరపాటున లేదా ప్రమాదవశాత్తూ తినేయడం జరుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా పిల్లలున్న ఇళ్లలో ఇలాంటి ప్రమాదాలు ఎక్కువ. కొన్ని సందర్భాల్లో వీటి నుంచి వెలువడే విషపూరిత వాయువులు పీల్చుకోవడం వల్ల కూడా ప్రమాదాలు తలెత్తవచ్చు. ఎరువులు, బాణాసంచా, మందుగుళ్లు, ఎలుక మందుల తయారీల్లో పసుపు లేదా తెల్లగా ఉండే ఫాస్ఫరస్‌ను ఉపయోగిస్తూ ఉంటారు. వెల్లుల్లి వాసన వెదజల్లుతూ ఉండే ఈ పదార్థం అన్ని చోట్లా దొరుకుతూ ఉంటుంది.
ఫాస్ఫరస్ ప్రమాదం
ఎలుక మందుల తయారీలో ఉపయోగించే ఈ విషపూరిత పదార్థం పొట్టలోకి చేరుకున్న వెంటనే వేగంగా శోషణ చెంది, కాలేయం, మూత్రపిండాలు, జీర్ణకోశం, హృదయనాళ వ్యవస్థ పనితీరును దెబ్బతీస్తుంది. కేవలం 8 గ్రాముల ఎలుక మందు, ప్రాణాంతక పరిస్థితికి దారి తీసేటంత ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఈ విషం బారిన పడిన 24 గంటల్లోగా వాంతులు, తలతిరుగుడు, డయేరియా, పొట్టలో నొప్పి మొదలైన లక్షణాలు తలెత్తుతాయి. రెండవ దశలో ఒకటి నుంచి నాలుగు రోజుల పాటు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. మూడవ దశలో, బహుళ అవయవాలు విఫలమవుతూ పరిస్థితి ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. ఈ దశలో మానసిక స్థితి కూడా దెబ్బతింటుంది. అయోమయం, సైకోసిస్, చిత్రభ్రమలు మొదలై, కోమాలోకి జారిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే ఈ ఎల్లో ఫాస్ఫరస్ విషానికి ఎలాంటి విరుగుడూ లేకపోయినప్పటికీ, డీకంటామినేషన్, సపోర్టివ్ థెరపీలతో చికిత్స చేయవచ్చు. దాన్లో భాగంగా విషం మరింతగా శోషణ చెందకుండా ఉండడం కోసం పొట్టలోని విషాలను బయటకు రప్పించే గ్యాస్ట్రిక్ లావేజ్ పద్ధతిని అనుసరిస్తారు. అందుకోసం పొటాషియం పర్మాంగనేట్ ద్రావణం లేదా సెలైన్‌ను పొట్టలోకి పంపిస్తారు. ఈ చికిత్సతో కోలుకున్న తర్వాత, రోగిని ఐసియులో ఉంచి, ప్రతిరోజూ కాలేయం, మూత్రపిండాల పనితీరులను పర్యవేక్షించవలసి ఉంటుంది.
పారాసిటమాల్‌తో...
ఈ మాత్రలను ఎక్కువ పరిమాణాల్లో తీసుకోవడం వల్ల కాలేయం తీవ్రంగా విషపూరితం అయ్యే ప్రమాదం ఉంటుంది. పెద్దలకు 7.5 నుంచి 10 గ్రాములు, ఒకటి నుంచి ఆరేళ్లలోపు పిల్లలైతే ఒక కిలో శరీర బరువుకు 150 మి.గ్రా నుంచి 200 మి.గ్రా పారాసిటమాల్ ప్రమాదకరం. ఈ మోతాదుల్లో పారాసిటమాల్ తీసుకున్న 24 గంటల్లోగా ఆకలి తగ్గిపోవడం, వాంతులు, తల తిరుగుడు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. 48 గంటల్లోగా పొట్టలో నొప్పి, ఆకలి లేకపోవడం, వాంతులు, 48 నుంచి 96 గంటల్లోగా కామెర్లు, హైపోగ్లైసీమియా, కాలేయం, మూత్రపిండాలు దెబ్బతింటాయి. ఇలాంటి సందర్భాల్లో కూడా పొట్టలోని మాత్రలను బయటకు రప్పించే చికిత్సనే వైద్యులు అనుసరిస్తారు.
నెయిల్ పాలిష్, హార్పిక్‌లతో...
వీటిలోని విషపూరిత రసాయనాలైన టోలీన్, ఫార్మాల్‌డిహైడ్, డైబ్యుటైల్ ప్థాలేట్‌లు, పారాసిటమాల్ పాయిజనింగ్ మాదిరిగానే కాలేయం, మూత్రపిండాలను దెబ్బ తీస్తాయి. పిల్లలు ప్రమాదవశాత్తూ బాత్రూమ్ శుభ్రం చేసే హార్పిక్ తాగేస్తూ ఉంటారు. హార్పిక్ పొట్టలోకి చేరుకుంటే జీర్ణ వ్యవస్థ దెబ్బతిని, వాంతులు, డయేరియా వేధిస్తాయి. కాలేయం ఇస్ఖిమిక్ షాక్‌కు గురవుతుంది. వీటితో పాటు, బాత్రూమ్ శుభ్రం చేసే యాసిడ్లు, ఫినాయిల్, పొడి, చాక్‌పీస్ రూపంలో ఉండే చీమల మందులు కూడా ప్రమాదకరమే!
నివారణ ఇలా...
అగ్గిపుల్లలు: వీటిని పిల్లలకు దూరంగా ఉంచాలి. వాడకాన్ని తగ్గించాలి. స్టవ్ వెలిగించడం కోసం వీటికి బదులుగా ఎలకా్ట్రనిక్ లైటర్లను ఉపయోగించాలి.
బాణాసంచా: వీటి నుంచి వెలువడే పొగను పీల్చే అవకాశం లేకుండా చూసుకోవాలి. ఎక్కువ పొగను వెలువరించే మతాబులు, చిచ్చుబుడ్లు లాంటి బాణాసంచాలకు దూరంగా ఉండాలి. బాణాసంచా కాల్చేటప్పుడు రెండు పొరల మాస్క్ ధరించాలి.
ఎరువులు: ప్రమాదవశాత్తూ పిల్లలకూ, మానసిక కుంగుబాటుతో ఆత్మహత్య చేసుకొనే పెద్దలకు ఎరువులు ప్రాణాంతకంగా మారుతూ ఉంటాయి. కాబట్టి వీటిని తాళం వేసిన గదుల్లో భద్రపరచాలి.
ఎలుక మందులు: వీటిని కూడా పిల్లలు, పెద్దలు ఇద్దరికీ దూరంగా ఉంచాలి. వీటిని ఉంచిన గదికి తాళం వేసి ఉంచాలి. వీటిని నిల్వ చేసుకోకూడదు. తక్కువ మోతాదుల్లో కొని, కొన్న వెంటనే పూర్తిగా ఉపయోగించాలి. ఖాళీ అయిన డబ్బా లేదా ట్యూబ్‌లను వెంటనే పారేయాలి. మిగిలిపోయిన మందులను నేల మీద పారేయకూడదు.
ఎలుక మందులకు బదులుగా బోన్లు, జిగురుతో కూడిన ర్యాట్ ట్రాప్స్ వాడుకోవాలి.
ఎల్లో ఫాస్ఫరస్ విషానికి ఎలాంటి విరుగుడూ లేకపోయినప్పటికీ, డీకంటామినేషన్, సపోర్టివ్ థెరపీలతో చికిత్స చేయవచ్చు. దాన్లో భాగంగా విషం మరింతగా శోషణ చెందకుండా ఉండడం కోసం పొట్టలోని విషాలను బయటకు రప్పించే గ్యాస్ట్రిక్ లావేజ్ పద్ధతిని అనుసరిస్తారు. అందుకోసం పొటాషియం పర్మాంగనేట్ ద్రావణం లేదా సెలైన్‌ను పొట్టలోకి పంపిస్తారు.
డాక్టర్ గొలమారి శ్రీనివాస్ రెడ్డి
కన్సల్టెంట్ హెపటాలజీ అండ్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్,
స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్.
Updated Date - Jun 03 , 2024 | 11:38 PM