ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మూత్ర సమస్యలు : రంగును బట్టి రుగ్మత

ABN, Publish Date - Sep 10 , 2024 | 04:49 AM

మూత్రం రంగు, వాసనలు శరీరంలో దాగిన సమస్యలకు సంకేతాలు. కాబట్టి మూత్రం మీద ఓ కన్నేసి ఉంచి, మార్పులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి.

Urinary problems

మూత్రం రంగు, వాసనలు శరీరంలో దాగిన సమస్యలకు సంకేతాలు. కాబట్టి మూత్రం మీద ఓ కన్నేసి ఉంచి, మార్పులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి.

ఒంట్లో నీళ్లు తగ్గడం: మూత్రం దుర్వాసనకు ప్రధాన కారణం శరీరంలో నీళ్లు తగ్గడం. శరీరంలో నీటి శాతం తగ్గితే, మూత్రం పరిమాణం కూడా తగ్గుతుంది. దాంతో విసర్జకాల గాఢత పెరిగి, మూత్రం పచ్చగా మారి, దుర్వాసన వెలువడుతుంది. ఈ సమస్య తొలగాలంటే నీరు ఎక్కువగా తాగాలి. సాధారణంగా ఉదయం మూత్రం కొంత పచ్చగానే ఉంటుంది. ఇందుకు కారణం రాత్రంతా నీళ్లు తాగకుండా ఉండడమే! అయితే రోజంతా ఇలాగే ఉంటే మాత్రం డీహైడ్రేషన్‌ బారిన పడతాం! కాబట్టి మూత్రం రంగును బట్టి ఎప్పటికప్పుడు తాగే నీటి మెతాదు పెంచాలి.

కెఫీన్‌ పెరగడం: తరచుగా కాఫీ తాగే అలవాటు ఉంటే ఒంట్లో చేరుకునే కెఫీన్‌ కారణంగా మూత్రం రంగు మారుతుంది, దుర్వాసన వెదజల్లుతుంది. ఇది అనారోగ్యకరం కాకపోయినా జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేయాలంటే కెఫీన్‌ వాడకం తగ్గించాలి. మద్యపానం వల్ల కూడా మూత్రం రంగు మారుతుంది. సాధారణం కంటే ఎక్కువగా మూత్ర విసర్జన చేయవలసి వస్తూ ఉంటుంది. మద్యం కూడా హానికారకమే కాబట్టి మానేయడమే మేలు.

బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌: బ్యాక్టీరియా వల్ల లేదా మూత్రపిండాల ఇన్‌ఫెక్షన్‌ వల్ల కూడా మూత్రం దుర్వాసన వస్తుంది. ఇవే కారణాలైతే సాధ్యమైనంత త్వరగా వైద్యులను సంప్రతించి వ్యాధినిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. ఫలితాలనుబట్టి వైద్యులు తగిన చికిత్స సూచిస్తారు. ఒకవేళ పరీక్షా ఫలితాల్లో ఎలాంటి అనారోగ్య సమస్య కనిపించకపోతే సమతులాహారం, సరిపడా నీరు తీసుకుంటూ సమస్యను తొలగించుకోవచ్చు.

సమతులాహార లోపం: నైట్రేట్స్‌, ఫాస్ఫేట్స్‌ మూత్రానికి ముదురు రంగును ఇస్తాయి. ఆహారంలో కొన్ని పోషకాలు లోపించడం మూలంగా ఈ మూలకాలు మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతూ ఉంటాయి. ఇలా జరగకుండా ఉండాలంటే పోషకభరిత ఆహారం తీసుకోవాలి. ఫలితంగా జీర్ణప్రక్రియ మెరుగుపడి పోషక నష్టం జరగకుండా ఉంటుంది.

మధుమేహం: మధుమేహుల మూత్రం గాఢమైన వాసన కలిగి ఉంటుంది. ఇలాంటి దుర్వాసన ఉంటే, చక్కెర స్థాయులు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నాయని అర్ధం. ఇప్పటికే మధుమేహులు కాకపోయి ఉంటే, ఈ సూచననుబట్టి త్వరలో మధుమేహం బారిన పడుతున్నారని గ్రహించాలి. వెంనే వైద్యులను కలిసి రక్తపరీక్ష చేయించుకుని మధుమేహం పరిస్థితిని తెలుసుకోవాలి.


  • రంగులు చెప్పే సంగతులు!

మూత్రం లేత పసుపు రంగులో, వాసన లేకుండా ఉండడం నిండైన ఆరోగ్యానికి సూచన. అయితే అంతర్గత సమస్యల కారణంగా మూత్రం ముదురు పసుపు మొదలు, వేర్వేరు రంగులను సంతరించుకుంటూ ఉంటుంది. ఈ రంగులనుబట్టి కారణాన్ని అంచనా వేయవచ్చు.

లేత పసుపు: తగినంత నీరు తాగుతున్నారని అర్ధం.

ముదురు పసుపు: మూత్రం ఎంత పచ్చగా ఉంటే అంత ఎక్కువగా డీహైడ్రేషన్‌కు గురయ్యారని అర్ధం.

గోధుమ రంగు: మూత్రంలో పాత రక్తం కలిసిందని అర్ధం. కాలేయం ఇన్‌ఫెక్షన్‌కు సూచనగా కూడా భావించవచ్చు.

ఎరుపు లేదా గులాబీ రంగు: కొత్తగా రక్తం మూత్రంలో కలుస్తోందనడానికి సూచన. ఇన్‌ఫెక్షన్‌, మూత్రపిండాల సమస్య లేదా కేన్సర్‌ రుగ్మతల్లో ఈ లక్షణం కనిపిస్తుంది.

నీలం, ఆకుపచ్చ మొదలైన రంగులు: కొన్ని రకాల మందులు, ఆహారంలో కలిపే రంగుల వల్ల మూత్రం ఈ రంగులు సంతరించుకుంటుంది.


  • మూత్రంలో...

  • మూత్రంలో 95% నీరు, 5% ఘన రూపాలు ఉంటాయి.

  • బిలియన్లకొద్దీ కణాలు శక్తిని ఖర్చు చేసే ప్రక్రియలో భాగంగా ఉత్పత్తయ్యే అంతిమ ఫలితం మూత్రం. రోజుకు కనీసం ఒకటి నుంచి ఒకటిన్నర లీటరు మూత్రం ఇలా ఉత్పత్తి అవుతూ విసర్జనకు గురవుతూ ఉంటుంది.

  • మూత్రంలో మూలకాలు, కణాలు, స్ఫటికాలు, కఫం, బ్యాక్టీరియా కూడా ఉంటాయి.

  • రక్తంలో, మూత్రంలో వేర్వేరు పరిమాణాల్లో ఒకే రకమైన మూలకాలు ఉంటాయి.

  • అమ్మోనియా, సల్ఫేట్‌, ఫాస్ఫేట్‌, క్లోరైడ్‌, మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం, సోడియం, క్రియాటినిన్‌, యూరిక్‌ యాసిడ్‌, యూరియాలు మూత్రంలో ఉంటాయి.

  • మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌!

ఈ వ్యాధికి ‘ఇ కొలై’ అనే బ్యాక్టీరియా కారణమే అయినా, తీవ్రత పెరగడానికి దోహదపడేది డీహైడ్రేషన్‌. తగినంత నీరు తాగకపోవడం వల్ల మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు మరింత తీవ్రమై మూత్రపిండాలను పాడు చేస్తాయి. కాబట్టి ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను కలిసి మందులు వాడుతూ, వీలైనంత ఎక్కువ నీరు తాగుతూ ఉండాలి. నీరు తాగడం వల్ల వెలువడే మూత్రం ద్వారా ఇన్‌ఫెక్షన్‌ తాలూకు సూక్ష్మక్రిములు బయటకు వెళ్తిపోయి, ఇన్‌ఫెక్షన్‌ అదుపులోకి వస్తుంది. ఈ రుగ్మతను వదిలించాలంటే....

  • రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగాలి.

  • ఎక్కువ సమయంపాటు మూత్రాన్ని ఆపుకోకూడదు.

  • వదులైన, గాలి చొరబడే లోదుస్తులు ధరించాలి.


  • లక్షణాలు ఇవే!

  1. మూత్రవిసర్జన సమయంలో మంట, నొప్పి.

  2. తరచుగా మూత్రవిసర్జన చేయవలసి రావడం

  3. అతి స్వల్ప పరిణామంలో మూత్రం రావడం

  4. మూత్రం దుర్వాసన, రక్తం కనిపించడం

  5. మూత్రం ముదురు చాక్లెట్‌ రంగులో ఉండడం

  6. పురుషుల్లో పురీషనాళం భాగంలో,

  7. మహిళల్లో కటి భాగంలో నొప్పి

  8. నడుము నొప్పి

  9. వాంతులు

  10. తల తిరుగుడు.


  • రంగును బట్టి నీరు!

మూత్రం రంగును బట్టి మనం తీసుకుంటున్న నీరు సరిపోతుందో లేదో తెలుసుకోవచ్చు. వేసవిలో డీహైడ్రేషన్‌కు గురవకుండా ఉండాలంటే మూత్రం రంగును పరిశీలించుకుంటూ ఉండాలి. ఈ పట్టిక అందుకోసమే....

  • మీ మూత్రం ఈ రంగులో ఉంటే మీరు సరిపడా నీరు తాగుతున్నారని అర్ధం. ఇకముందు కూడా ఇదే అలవాటును కొనసాగించండి.

  • ఫర్వాలేదు. అయినా తీసుకుంటున్న నీటికి మరొక గ్లాసు నీళ్లు జత చేస్తే డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశమే ఉండదు.

  • నీళ్లు తాగే సమయం ఆసన్నమైందని అర్ధం. మూత్రం ఈ రంగులో ఉంటే మరో గంటలోపు కనీసం అర లీటరు నీరు తాగాలి. ఎండలో ఉన్నట్లయితే, ఒక లీటరు తప్పనిసరిగా తాగాలి.

  • మీరు మీ శరీరాన్ని వెంటనే హైడ్రేట్‌ చేయాలి. నీడ పట్టున ఉంటే కనీసం అర లీటరు, ఎండలో ఉంటే ఒక లీటరు నీరు వెంటనే తాగాలి.

  • మీ శరీరంలో నీటి శాతం పడిపోయిందని మూత్రం చెబుతోంది. వెంటనే కనీసం రెండు లీటర్ల నీరు తాగాలి. మీ మూత్రం ఎరుపు లేదా గోధుమ రంగుకు మారితే వెంటనే వైద్యులను సంప్రతించండి.

Updated Date - Sep 10 , 2024 | 04:49 AM

Advertising
Advertising