NRI News: పెనమలూరులో ‘తానా’ వైద్య శిబిరం విజయవంతం
ABN, Publish Date - Aug 13 , 2024 | 09:44 PM
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) తోడ్పాటుతో ఆగస్టు 13వ తేదీన అర్జున్ పరుచూరి పెనమలూరులోని జడ్పీ హైస్కూల్లో సీపీఆర్, మానసిక ఆరోగ్యం, పోషకాహారం వంటి ముఖ్యమైన విషయాలపై శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ...
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) తోడ్పాటుతో ఆగస్టు 13వ తేదీన అర్జున్ పరుచూరి పెనమలూరులోని జడ్పీ హైస్కూల్లో సీపీఆర్, మానసిక ఆరోగ్యం, పోషకాహారం వంటి ముఖ్యమైన విషయాలపై శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సీపీఆర్‌పై డెమో ఇచ్చి అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో ఉపయోగపడే సీపీఆర్‌పై శిక్షణ ఇవ్వడంతో పాటూ వారితో ప్రాక్టికల్‌గా కూడా చేయించి చూపించారు. అలాగే గంజాయి వంటి మత్తు పదార్ధాల వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా అమెరికాలోని వర్జీనియాలో 10వ తరగతి చదువుతున్న అర్జున్ పరుచూరి మాట్లాడుతూ.. చిన్ననాటి నుంచే తనకు ప్రజా సేవ చేయాలనే తపన ఉండేదన్నారు. ఈ నేపథ్యంలో జన్మనిచ్చిన భూమిపై మమకారంతో తన నానమ్మ స్వస్థలమైన పెనమలూరులో తనవంతుగా సేవలందించాలని భావించినట్లు చెప్పారు. ప్రధానంగా వైద్య విషయాలపై విద్యార్థులకు సరైన అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఆరోగ్యంపై సరైన అవగాహన ఉంటే ఎన్నో రోగాలకు దూరంగా ఉండవచ్చని అర్జున్ పరుచూరి పేర్కొన్నారు.
ఈ శిక్షణ శిబిరంలో అర్జున్‌తో పాటూ ఆమె తల్లి డా. నాగమల్లిక జాస్తి పాల్గొని సీపీఆర్ విధానాల గురించి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. తానా ఫౌండేషన్ ట్రస్టీ శ్రీనివాస్ ఎండూరి, తానా ఇంటర్నేషనల్ కో-ఆర్డినేటర్ ఠాగూర్ మల్లినేని, డాక్టర్ ఓ.కె. మూర్తి తదితరులు కార్యక్రమ నిర్వహణకు సహకరించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు కిలారు శివకుమార్, పెనమలూరు జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు దుర్గా భవాని, డీఈవో పద్మరాణి, ఎంఈఓ కనకమహాలక్ష్మి, పెనమలూరు ఎన్నారై స్థానిక ప్రతినిధి సుధీర్ పాలడుగు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Aug 13 , 2024 | 09:47 PM