TANA: తానా ఆధ్వర్యంలో ఘనంగా 75వ అంతర్జాతీయ అంతర్జాల సదస్సు..
ABN, Publish Date - Dec 30 , 2024 | 11:53 AM
తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “సామాజిక చైతన్యం, సాహిత్యం, దశ, దిశ” అనే అంశంపై జరిగిన అంతర్జాల సాహిత్య చర్చా కార్యక్రమంలో తెలుగు సాహిత్యంలోని వివిధ సాహిత్య ఉద్యమాలపై సంపూర్ణ చర్చ జరిగింది. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అమెరికా: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) సాహిత్య విభాగం తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో డిసెంబర్ 29న 75వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యమాధ్యమ సమావేశం ఘనంగా నిర్వహించారు. “సామాజిక చైతన్య సాహిత్యం – దశ, దిశ” (అభ్యుదయ, దిగంబర, పైగంబర, విప్లవ సాహిత్యాలు) పేరిట సమావేశం జరిగింది. “నెలనెలా తెలుగు వెలుగు” పేరిట గత ఐదేళ్లుగా ప్రతి నెలా ఆఖరి ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “సామాజిక చైతన్యం, సాహిత్యం, దశ, దిశ” అనే అంశంపై జరిగిన అంతర్జాల సాహిత్య చర్చా కార్యక్రమంలో తెలుగు సాహిత్యంలోని వివిధ సాహిత్య ఉద్యమాలపై సంపూర్ణ చర్చ జరిగింది. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజంలో సామాజిక చైతన్య అవసరాన్ని ఆయన వివరించారు. సమాజంలో ఎక్కువమంది నిశ్శబ్దంగా ఉండడం వల్ల అరాచకాలు పెరిగిపోతున్నాయని ప్రసాద్ అన్నారు. జనం చైతన్యంతో ప్రతిఘటించినప్పుడే, అరాచకాలు అరికట్టబడతాయని ఆయన చెప్పారు. ప్రజలను చైతన్యవంతం చేసే బాధ్యత కవులు, రచయితలపై ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో అరసం, విరసం, దిగంబర, పైగంబర కవిత్వ ఉద్యమాలపై కూలంకష చర్చ జరిగింది.
అనంతరం అరసం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు డాక్టర్ రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, తెలంగాణ అరసం జాతీయ కార్యదర్శి వేల్పుల నారాయణ ప్రసంగించారు. అరసం ఆవిర్భావం, వికాసం గురించి వారు వివరించారు. అరసం అందరిదీ కాకున్నా, అత్యధికులకు సంబంధించిందని చెప్పారు. పేద, బడుగు వర్గాల అభ్యున్నతి కోసం అరసం ఆవిర్భవించిందని చెప్పుకొచ్చారు.
దిగంబర కవిత్వ ఆవిర్భావ వికాసాలు, సిద్ధాంతాల గురించి నిఖిలేశ్వర్ ప్రసంగించారు. దిగంబర కవిత్వం చారిత్రక అవసరంగా ఆవిర్భవించిందని, సాహిత్యంలో ఓ దశాబ్ది నిశ్శబ్దాన్ని పటాపంచలు చేసిందన్నారు. దిగంబరులు ఆరుగురు ఆరు రుతువుల్లా సమాజాన్ని ప్రభావితం చేశారన్నారు. దిగంబరుల కవిత్వంలో అభివ్యక్తి, భాష గురించి వచ్చిన విమర్శల్ని నిఖిలేశ్వర్ తిప్పి కొట్టారు. నాటి యువతలో జడత్వాన్ని వదిలించడానికి ఆ మాత్రం చికిత్స తప్పలేదన్నారు.
నిద్రపోతున్న తెలుగు సాహిత్యాన్ని మేల్కొలపటంలో దిగంబర కవిత్వం పాత్ర తక్కువేమీ కాదని నగ్నముని చెప్పారు. దిగంబర కవిగా అరెస్టయ్యి ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం కోల్పాయినట్లు ఆయన తెలిపారు. సిద్ధాంత ప్రాతిపదికనే జన చైతన్యం కోసం దిగంబర కవులు కవిత్వం రాశారని ఆయన వెల్లడించారు. అభివ్యక్తిలో, భాషలో విమర్శలకు గురైనా దిగంబర కవిత్వం నాటి సమాజంలో సంచలనం కలిగించిందని నగ్నముని చెప్పుకొచ్చారు.
నాటి సాహిత్యం, సామాజిక పరిస్థితులకు మేల్కొలిపేందుకే పైగంబర కవిత్వం ఆవిర్భవించిందని పైగంబర కవి ఓల్గా(డా.పోపూరి లలితకుమారి) చెప్పారు. పైగంబర కవులు మానవత్వానికి పెద్దపీట వేశారని ఆమె అన్నారు. పైగంబర కవిత్వ ఆవిర్భావ వికాసాలను మరో పైగంబర కవి కిరణ్ బాబు వివరించారు. 1970 నాటి సామాజిక పరిస్థితులు చూసి తట్టుకోలేకే ఐదుగురు కవులు పైగంబరులుగా పేరుపెట్టుకొని కవిత్వం రాశారని కిరణ్ తెలిపారు. దేవిప్రియ, సుగమ్ బాబు, కమలాకర్, ఓల్గా తాను పంచపాండవుల్లా కవిత్వాయుధాలు పట్టి మానవత్వాన్ని తట్టి లేపేందుకు కలం పట్టామని చెప్పారు.
విరసం ఆవిర్భావ, వికాసాలను అరసవిల్లి కృష్ణ సవివరంగా వివరించారు. విరసం చారిత్రక అవసరంగా ఏర్పడిందని ఆయన తెలిపారు. సాహితీ విమర్శకులు ఎ.రజాహుస్సేన్ మాట్లాడుతూ.. పైగంబర కవిత్వంపై సాధికార విమర్శ పుస్తకం తేవడం తన అదృష్టమని ఆయన అన్నారు. పైగంబర కవులతో, తన సాన్నిహిత్యాన్ని వివరించారు. దేవిప్రియ ఆత్మ కథ రాస్తానని ప్రకటించినా, చివరకు రాయకుండానే దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అమెరికా కామ్రేడ్స్‌గా పిలువబడే లెనిన్ వేముల, కిరణ్మయి గుంట, అనంత్ మల్లవరపు బృందం సందర్భోచితంగా పాటలు పాడి, కవితా పఠనం చేశారు. సదస్సులో తెలుగు సాహిత్యంలోని వివిధ ఉద్యమాల ఆవిర్భావం, వికాసం, వాటి ఆనుపానుల గురించి చక్కటి చర్చ జరిగింది.
ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా అరసం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు డాక్టర్ రాచపాళెం చంద్రశేఖర రెడ్డి.. సుప్రసిద్ధ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, తెలంగాణ అరసం జాతీయ కార్యదర్శి వేల్పుల నారాయణ.. అరసం దిగంబర సాహిత్యం కవులు నిఖిలేశ్వర్ (శ్రీ కుంభం యాదవరెడ్డి).. దిగంబర కవి, ప్రముఖ కథారచయిత, అనువాద రచయిత, విమర్శకుడు నగ్నముని శ్రీ మానేపల్లి హృషీ కేశవరావు.. దిగంబర కవి, ప్రముఖ కవి, నాటక రచయిత, నాస్తికుడు, పైగంబర కవి కిరణ్ బాబు (శ్రీ రావినూతల సుబ్బారావు).. పైగంబర కవి, రచయిత, సంపాదకురాలు ఓల్గా (డా.పోపూరి లలితకుమారి).. పైగంబర కవి, ప్రముఖ రచయిత్రి, స్త్రీవాద ఉద్యమ ప్రతీక, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత రజాహుస్సేన్.. కవి, రచయిత, పాత్త్రికేయుడు, సాహిత్య విమర్శకుడు అరసవిల్లి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 30 , 2024 | 12:00 PM