విశాఖపట్నం: టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పన్నుల బాదుడు లేని పారదర్శక పాలన అందిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. జనం భవిష్యత్‌కు కూటమిదే బాధ్యతని భరోసా ఇచ్చారు. జగన్ భారీగా అప్పులు తెచ్చి బటన్ నొక్కుడు చేసి మిగిలిన మొత్తాన్ని జేబులోకి బుక్కుకుంటున్నారని ఆరోపించారు. అలాంటి పని తాను చేయనని.. సంపదను సృష్టించి ఆ సొమ్ముతో ఇప్పుడున్న సంక్షేమ పథకాలతో పాటు మిగిలినవీ అమలు చేస్తానన్నారు. సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇచ్చి అన్ని విధాలా మంచి పాలన అందిస్తానని తెలిపారు. గురువారం ఆయన పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం, విజయనగరం జిల్లా చీపురుపల్లి, విశాఖ నగరంలో నిర్వహించిన భారీ బహిరంగ సభల్లో ప్రసంగించారు. జగన్ బటన్ నొక్కినా ఖాతాల్లోకి డబ్బులు రావడం లేదన్నారు. మరోవైపు ధరలు, పన్నులు పెంచేశారని... వచ్చిన డబ్బులు వచ్చినట్లే పోయి తిరిగి అప్పులు మిగులుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.