AP Politics: అంతా బోగస్.. మళ్లీ గెలవాలని ఇన్ని కుట్రలా జగన్..?
ABN, Publish Date - Jan 13 , 2024 | 03:15 PM
AP Bogus Votes Issues : ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నాయ్. 2019 ఎన్నికల్లో అడ్డదిడ్డమైన హామీలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. ఈ నాలుగున్నరేళ్లలో ఏ మేరకు పరిపాలన సాగింది..? ప్రజలకు ఇచ్చిన హామీలు వైఎస్ జగన్ ఏ మేరకు అమలు చేశారు..? అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.. ఈ విషయాలన్నీ ఏపీ ప్రజలకు బాగా తెలుసు కూడా..
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నాయ్. 2019 ఎన్నికల్లో అడ్డదిడ్డమైన హామీలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. ఈ నాలుగున్నరేళ్లలో ఏ మేరకు పరిపాలన సాగింది..? ప్రజలకు ఇచ్చిన హామీలు వైఎస్ జగన్ ఏ మేరకు అమలు చేశారు..? అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.. ఈ విషయాలన్నీ ఏపీ ప్రజలకు బాగా తెలుసు కూడా.! పాదయాత్ర, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా వర్గాలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, అమరావతిని అడ్రస్ లేకుండా చేసి.. కనీసం మూడు రాజధానులనే ప్రస్తావనే లేకుండా పోవడంతో పరిస్థితులు అల్లకల్లోల్లంగా మారిపోయాయి. ఇలా ఒకటా రెండా అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన ప్రభుత్వం.. ఇప్పటి వరకూ కూల్చివేతలే టార్గెట్‌గా వెళ్తోందే తప్ప చేసిందేమీ లేదన్నది ప్రతిపక్షాల ఆరోపణ. ఇలా ప్రభుత్వ చర్యలతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీని ఇంటికి పంపిస్తారన్నది పలు సర్వేల్లో తేలిపోయింది. దీంతో ఏం చేసైనా సరే గెలిచి తీరాల్సిందేనని.. అవసరమైతే అక్రమాలకు పాల్పడి అయినా మళ్లీ సీఎం కావాలన్నది జగన్ టార్గెట్. ఇందుకోసం పకడ్బందీగా 2023 నుంచే ప్రణాళికలు మొదలుపెట్టారని ఇన్‌సైడ్ టాక్. ఏపీలో పర్యటించిన కేంద్ర ఎన్నిక కమిషన్ సభ్యులు.. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులో సమావేశంలో తిరుపతి మున్సిపల్ ఎన్నికల్లో బయటపెట్టిన బాగోతమే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. ఇలా ఒకటి రెండు కాదు.. తవ్వే కొద్దీ వైసీపీ సర్కార్ చేస్తున్న అరాచకాలు బయటికొస్తూనే ఉన్నాయ్.
ఇదీ అసలు కథ..
‘బోగస్ ఓట్లు’.. ఏపీలో ప్రస్తుతం నడుస్తున్న హాట్ టాపిక్. ఓటర్లు మార్పులు, చేర్పులు.. కొత్తగా ఓటుకోసం దరఖాస్తు చేసుకునే విషయాల్లో భారీగానే అవకతవకలు జరిగాయన్నది వైసీపీపై టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఇప్పటి వరకూ కొత్తగా ఓటు కోసం ఫామ్-6ను 17 లక్షలకు పైచిలుకు మంది దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు నియోజకవర్గాలు మారిన వారు, కొత్తగా యాడ్ అయిన వారు లెక్కలేనన్ని మంది ఉన్నారు. అయితే.. ఓటర్ల విషయంలో తమకు అనుకూలంగా ఉంటేనే సరే లేకుంటే ఓట్ల జాబితాలో పేరు కనిపించట్లేదని లక్షలాది మంది కుయ్యో మొర్రో అని మొత్తుకుంటున్నారు. ఇక తమకు అనుకూలంగా ఉంటే చాలు వేలాది ఓట్లను కొత్తగా చేర్చిన నియోజకవర్గాలు కోకొల్లలు ఉన్నాయన్నది ప్రధాన ఆరోపణ. అంతేకాదు.. కొన్ని నియోజకవర్గాల్లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకూ వందల సంఖ్యలో పోలింగ్ బూత్‌లను కూడా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే.. కొన్ని చోట్ల మాత్రం ఓటర్లు పెరిగినా బూత్‌ల సంఖ్య పెంచడానికి మాత్రం సాహసించలేదు.. ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకత, వైసీపీకి ప్రతికూలంగా వాతవరణం ఉండటమే కారణమే ఆరోపణలు వస్తున్నాయ్. ఇదే విషయాన్ని స్థానికంగా ఉన్న సామాన్య ప్రజలు, ప్రతిపక్ష పార్టీల నేతలు రాష్ట్ర, కేంద్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు.
ఇంతకీ దొంగెవరో..?
ఇలా ఏపీలో 15 లక్షల వరకూ నకిలీ ఓట్లు నమోదు కావడం.. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు దొంగ ఓట్ల చేరికపై ఎన్నికల సంఘానికి పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. దొంగ ఓట్ల వ్యవహారంపై ఫిర్యాదులు రోజురోజుకూ ఎక్కువ కావడంతో ఎన్నికల సంఘం స్పందించి.. ప్రాధమికంగా 5.64 లక్షల దొంగ ఓట్లను గుర్తించి తొలగించింది. రాజకీయ పార్టీలు ఆరోపించిన 15 లక్షల ఓట్లలో 5.64 లక్షల ఓట్లు తొలగించడం జరిగింది. మిగిలిన ఓట్లు సక్రమమైనవేనని ఎన్నికల సంఘం అభిప్రాయపడిందని ఇన్‌సైడ్ టాక్. మరోవైపు.. నిబంధనలకు విరుద్ధంగా నమోదైన ప్రత్యర్ధుల ఓట్లను తొలగించాలని కోరుతూ ఫామ్ 7లు భారీగానే దాఖలౌతున్నాయి. ముఖ్యంగా.. కాకినాడ, ఒంగోలు, గుంటూరు వెస్ట్, చంద్రగిరి, బనగానపల్లెలో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే.. ఉరవకొండలో ఇద్దరు ఈఆర్వోలు, ప్రొద్దుటూరులో ఒక ఈఆర్వో, పర్చూరులో ఒక ఈఆర్వో, , ఒక సీఐ, ముగ్గురు ఎస్సైలను ఈసీ సస్పెండ్ చేయడం జరిగింది. మరో 50 మంది బీఆర్వోలను కూడా ఈసీ సస్పెండ్ చేసింది. చూశారుగా.. దొంగెవరో తెలియదు గానీ అందరూ ఒకరి నొకరు దొంగా దొంగా అని ఆరోపించుకుంటున్నారు.
ఇంత దారుణమేంటయ్యా..?
వాస్తవానికి.. ఓటర్లు పెరిగి కొద్దీ ఆయా మండల్లాల్లో కచ్చితంగా బూత్‌ల సంఖ్య పెంచాలన్నది ప్రతిపాదన. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం భిన్నంగా వ్యవహరిస్తోంది. అనుకూలంగా ఉన్న చోట్ల మాత్రమే ఓటర్ల సంఖ్య.. అలాగే బూత్‌ల సంఖ్యను పెంచడం చేస్తూ వస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తూనే ఉన్నారు. ఇక అక్రమంగా ఓట్లను చేర్చారని బోగస్ ఓట్లు తొలగించాలని చంద్రగిరి మొదలుకుని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన నేతలు ధర్నాలు, నిరసనలు.. ర్యాలీలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయ్. ఆఖరికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆఖరికి ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. మరోవైపు.. రాష్ట్ర వ్యాప్తంగా 46,165 పోలింగ్ బూత్‌లు ఉండగా.. 4 కోట్లా 1 లక్షా 50వేల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అయితే ఒక్కో బూత్‌లో గంటకు కేవలం 80 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోగలరు. కానీ.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయన్నది టీడీపీ చేస్తున్న ఆరోపణ. వైసీపీ చేస్తున్న ఈ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోని పరిస్థితి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పట్టించుకోకపోవడం.. కేంద్రం కూడా రాష్ట్రానికే సహకరిస్తుందని ప్రతిపక్షాలు తిట్టిపోస్తున్నాయి. పైగా పైకి మాత్రం ఎలాంటి అవకతవకలు జరగకుండా.. తీవ్ర చర్యలు, కట్టడి చేస్తామని మాత్రం చెబుతుండటం గమనార్హం. అసలు ఫిర్యాదుల పట్ల అధికారులు ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారో.. ఈ పరిస్థితుల్లో మార్పులు ఎప్పుడు వస్తాయో చూడాలి మరి.
Updated Date - Jan 13 , 2024 | 05:08 PM