Telangana: కాంగ్రెస్ తరఫున పోటీచేసే ఎంపీ అభ్యర్థులు వీళ్లేనా.. ఈ ఒక్క మార్పు జరిగితే..!?
ABN, Publish Date - Mar 03 , 2024 | 02:43 PM
TS Parliament Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) విజయ దుందుభి మోగించిన కాంగ్రెస్ (Congress).. పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament Elections) అదే ఊపు కొనసాగించాలని వ్యూహ రచన చేస్తోంది. 17 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 10 నుంచి 15 స్థానాల్లో పాగా వేయాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం గెలుపు గుర్రాలను వెతికే పనిలో హైకమాండ్ నిమగ్నమైంది...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన కాంగ్రెస్ (Congress).. పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament Elections) అదే ఊపు కొనసాగించాలని వ్యూహ రచన చేస్తోంది. 17 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 10 నుంచి 15 స్థానాల్లో పాగా వేయాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం గెలుపు గుర్రాలను వెతికే పనిలో హైకమాండ్ నిమగ్నమైంది. ఇప్పటికే దాదాపు అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ అభ్యర్థుల్లో దాదాపు అందరూ బిగ్ షాట్లే ఉన్నారు. ఇటీవల జరిగిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటిలో 9 మంది అభ్యర్థులు ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అభ్యర్థుల జాబితా ప్రస్తుతం ఏఐసీసీ సెంట్రల్ ఎన్నికల కమిటీ దగ్గర ఉందని.. ఏ క్షణమైనా అధికారిక ప్రకటన ఉండొచ్చని తెలియవచ్చింది.
ఆ 9 మంది గెలుపు గుర్రాలు వీరే..!
1. చేవెళ్ల : సునీత మహేందర్ రెడ్డి
2. కరీంనగర్ : ప్రవీణ్ రెడ్డి
3. పెద్దపల్లి : గడ్డం వంశీ (వివేక్ కుమారుడు)
4. మహబూబాబాద్: బలరాం నాయక్
5. నల్గొండ : రఘువీర్ రెడ్డి (జానారెడ్డి కుమారుడు)
6. వరంగల్ : దొమ్మాటి సాంబయ్య
7. మహబూబ్‌నగర్ : వంశీచంద్ రెడ్డి
8. నిజామాబాద్ : జీవన్ రెడ్డి
9. జహీరాబాద్ : సురేష్ షెట్కర్
లెక్కలు తేలనివి..?
10. మెదక్ నుంచి నీలం ముదిరాజ్ పేరు పరిశీలనలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో పఠాన్‌చెరు టికెట్ ఆశించి భంగపడిన ఈయన పార్టీకి రాజీనామా చేసి బీఎస్పీ తరఫున పోటీచేసి గట్టిగానే ఓట్లు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల సీఎం రేవంత్ సమక్షంలో మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. దీంతో ఈసారైనా హైకమాండ్ ఆశీస్సులు దక్కుతాయని ఎంతో ఆశతో ఉన్నారు. జగ్గారెడ్డిని ఎంపీగా పోటీ చేయించాలని మొదట పార్టీ పెద్దలు అనుకున్నప్పటికీ తాను ఆసక్తి చూపించట్లేదని బహిరంగంగానే ఆయన ప్రకటించడంతో నీలంకు లైన్ క్లియర్ అయినట్లేనని తెలుస్తోంది.
11. ఆదివాసీలకే ఆదిలాబాద్ టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. అయితే.. ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న సోయం బాపూరావుకు లోక్‌సభకు సీటు దక్కలేదు. ఈయన ఏక్షణమైనా కమలం కండువా తీసేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే సోయంకే టికెట్ దక్కే ఛాన్స్ ఉంది.
12. సికింద్రాబాద్ నుంచి చాలా మందే టికెట్ ఆశిస్తున్నప్పటికీ అధిష్టానం మాత్రం బొంతు రామ్మోహన్ వైపే మొగ్గు చూపుతోందని తెలియవచ్చింది. ఈ మధ్యనే బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పిన బొంతు.. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మొదట మల్కాజిగిరి టికెట్ ఆశించినప్పటికీ.. అది హాట్ సీట్ కావడంతో సికింద్రాబాద్ టికెట్ కన్ఫామ్ అయినట్లు తెలియవచ్చింది. అయితే.. బొంతు రామ్మోహనే పోటీ చేస్తారా లేకుంటే.. ఆయన సతీమణి బొంతు శ్రీదేవి పోటీచేస్తారా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు.. కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ కూడా టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అంజన్ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్‌ను రాజ్యసభకు పంపడంతో టికెట్ ఇచ్చే ఛాన్స్ లేదనే టాక్ కూడా నడుస్తోంది.
13. ఇక హాట్ సీటు.. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానమైన మల్కాజ్‌గిరి రేసులో చాలా మంది ప్రముఖలు ఉన్నారు. సీఎం రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి, నిర్మాత బండ్ల గణేష్.. మైనంపల్లి హన్మంతరావు, హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి.. ఇంకా చాలా మందే ఉన్నారు. అయితే.. మైనంపల్లి వైపే అధిష్టానం మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. ఒకవేళ హన్మంతురావు కాదంటే మాత్రం కంచర్లకే టికెట్ అని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
14. ఇక నల్గొండ స్థానానికి సైతం గట్టిగానే పోటీ ఉంది. ‘నా ఫ్యామిలీకే కావాలి’ అని మాజీ మంత్రి జానారెడ్డి.. ‘కాదు కాదు.. నా ఫ్యామిలీకే ఇవ్వండి’ అని మంత్రి కోమటిరెడ్డి గట్టిగానే కూర్చున్నారు. జానారెడ్డి కుమారుడు రఘవీర్ ఎంపీ సీటు దరఖాస్తు కూడా చేసుకోగా.. ఇటు కోమటిరెడ్డి కుమార్తె శ్రీనిధి రెడ్డి కూడా అప్లికేషన్ వేశారు. అయితే కుటుంబానికి ఒక్క సీటే అనే నిబంధన కాంగ్రెస్‌లో ఉంది. ఈ లెక్కన చూస్తే.. రెండు కుటుంబాలకు టికెట్ దక్కే అవకాశం మాత్రం లేదు. మరోవైపు.. సూర్యాపేట అసెంబ్లీ సీటు త్యాగం చేసిన పటేల్ రమేష్ రెడ్డి కూడా రేసులో ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ నల్గొండ పార్లమెంట్ నుంచే కోమటిరెడ్డి గెలుపొందారు.
15. భువనగిరి పార్లమెంట్ సీటు కోసం కూడా కోమటిరెడ్డి ఫ్యామిలీ కర్చీఫ్ వేసుకుని కూర్చుంది. కోమటిరెడ్డి బ్రదర్స్‌లో పెద్దవారైన కోమటిరెడ్డి మోహన్ రెడ్డి కుమారుడు కోమటిరెడ్డి పవన్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. అటు నల్గొండ.. ఇటు భువనగిరి రెండు సీట్లు దక్కించుకోవాలని హైకమాండ్ దగ్గర గట్టిగానే పట్టుబట్టినట్లుగా తెలుస్తోంది. ఈ రెండు సీట్లు మా కుటుంబానికి ఇస్తే గెలిపించుకుని వస్తానని కాంగ్రెస్ అగ్రనేతలకు బ్రదర్స్ ఇద్దరూ మాటిచ్చారట.
16. ఖమ్మం లోక్‌సభ విషయానికొస్తే.. ఈ సీటు కోసం సీనియర్లు మొదలుకుని జూనియర్ల వరకూ అందరూ రేసులో ఉన్నారు. టికెట్ ఆశించిన రేణుకా చౌదరికి రాజ్యసభ దక్కడంతో కాస్త చిక్కుముడి వీడినప్పటికీ.. పోటీ మాత్రం గట్టిగానే ఉంది. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు.. భట్టీ విక్రమార్క తమ కుటుంబ సభ్యులకే టికెట్ దక్కించుకోవాలని పెద్ద ఎత్తునే ప్రయత్నాలు చేస్తున్నారు. సోదరుడి కోసం పొంగులేటి.. కుమారుడి కోసం తుమ్మల.. భార్య కోసం భట్టీ కర్చీఫ్‌లు వేసుకుని కూర్చున్నారు. వీరందరితో పాటు సీనియర్ నేత వీహెచ్ కూడా రేసులో ఉన్నారు. కచ్చితంగా సీటు తనదేనని మీడియా ముఖంగానే చెబుతున్నారు కూడా.
17. ఇక మిగిలిందల్లా నాగర్ కర్నూల్ మాత్రమే.. ఇక్కడ కూడా గట్టి పోటీనే ఉంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సోదరుడు మల్లు రవి టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే భట్టికీ డిప్యూటీ సీఎం ఇవ్వడం.. మరోవైపు భట్టీ భార్య ఖమ్మం సీటు ఆశిస్తుండటం.. ఇప్పుడు రవి కూడా నాగర్ కర్నూల్ నుంచి టికెట్ కావాలని డిమాండ్ చేస్తుండటంతో.. అధిష్టానానికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఒక వేళ అటు ఖమ్మంలో కానీ.. ఇటు నాగర్ కర్నూల్‌లో కానీ మల్లు ఫ్యామిలీకే టికెట్ ఇస్తే కుటుంబ పాలన అనే ఆరోపణలు వస్తాయ్. దీంతో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌కే దక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఆలంపూర్ నుంచి పోటీచేసి సంపత్ ఓటమిపాలయ్యారు.
చూశారుగా.. ఒక్కో స్థానం నుంచి ఎంత మంది ఆశావహులు ఉన్నారో. వీటన్నింటికీ కుటుంబానికి ఒక్కటే టికెట్ అనే నిబంధన పాటిస్తే మాత్రం పరిస్థితి వేరేలా ఉంటుంది. ఒకవేళ ఈ నిబంధన సడలిస్తే మాత్రం పెండింగ్‌లోని సీట్లు అన్నీ సుమారు మంత్రుల కుటుంబ సభ్యులకే దక్కే అవకాశం కనిపిస్తోంది. ఫైనల్‌గా హైకమాండ్ ఏం చేస్తుందో.. ఎవరికి ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ వస్తుందో చూడాలి మరి.
మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి
AP Elections: ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు.. టీడీపీలో ఫుల్ జోష్!
YSRCP: విజయసాయిని నెల్లూరు నుంచి పోటీ చేయించడం వెనుక ఇంత జరిగిందా..!?
BJP First List: ఏపీ నుంచి ఒక్క ఎంపీ అభ్యర్థినీ ప్రకటించని బీజేపీ.. ఎందుకో..!?
Telangana: అసదుద్దీన్‌పై మాధవీలత పోటీ.. ఎవరీమె.. బీజేపీ టికెట్ ఎలా దక్కింది..!?
TS Politics: పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్..
Updated Date - Mar 03 , 2024 | 02:46 PM