AP Elections 2024: బాలశౌరిని తట్టుకుని సింహాద్రి నిలబడతారా..?
ABN, Publish Date - Apr 20 , 2024 | 06:57 PM
ఏపీలో (Andhra Pradesh) మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి ప్రత్యేక ఉంది. మచిలీపట్నం కేంద్రంగా నాయకులు స్వాతంత్య్ర ఉద్యమాన్ని నడిపారు. డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు, కోపల్లె హనుమంతరావు ఆంధ్రపత్రికను స్థాపించి అప్పట్లో ప్రజలను స్వాతంత్య్ర ఉద్యమంవైపు మళ్లేలా చేశారు...
ఏపీలో (Andhra Pradesh) మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి ప్రత్యేక ఉంది. మచిలీపట్నం కేంద్రంగా నాయకులు స్వాతంత్య్ర ఉద్యమాన్ని నడిపారు. డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు, కోపల్లె హనుమంతరావు ఆంధ్రపత్రికను స్థాపించి అప్పట్లో ప్రజలను స్వాతంత్య్ర ఉద్యమంవైపు మళ్లేలా చేశారు. జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య, పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయిన కీర్తిశేషులు నందమూరి తారకరామారావు, కమ్యూనిస్టు ఉద్దండుడు చండ్ర రాజేశ్వరరావు, నక్సల్‌బరీ ఉద్యమానికి ఊపిరిపోసిన కొండపల్లి సీతారామయ్య లాంటి ఎందరో మహామహులు నడయాడిన నేల మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, వైసీపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. ఈ పోరులో బందరు బాద్‌షాగా ఎవరిని ప్రజలు గెలిపిస్తారో చూద్దాం..
అటు నుంచి ఇటు..!
జిల్లాల పునర్విభజన జరిగిన అనంతరం మచిలీపట్నం (Machilipatnam) పార్లమెంటు నియోజకవర్గం పరిధి మొత్తం కృష్ణాజిల్లాగా పరిగణిస్తున్నారు. ఇక్కడ ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. ప్రస్తుతం వైసీపీ ఎంపీగా కొనసాగుతున్న వల్లభనేని బాలశౌరి ఆ పార్టీకి చెందిన అధిష్టానం, స్థానిక నాయకుల వైఖరితో విసిగిపోయి జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ తరపున ఆయన ఎంపీగా పోటీలో ఉన్నారు. రెండు రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ కూటమి అభ్యర్థుల గెలుపుకోసం పెడన, మచిలీపట్నంలలో ప్రచారం చేశారు. దీంతో కూటమి నేతల్లో జోష్ కనిపిస్తోంది. సింహాద్రి సత్యనారాయణ కుమారుడు సింహాద్రి చంద్రశేఖర్ వైసీపీ తరపున ఎంపీగా అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. హైదారాబాద్‌లో కేన్సర్ వైద్యుడిగా పేరొందిన అయన తొలిసారిగా ఎన్నికల గోదాలోకి దిగారు.
ప్రజా బలంతో బాలశౌరి
జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీలో ఉన్న వల్లభనేని బాలశౌరి ప్రస్తుతం మచిలీపట్నం ఎంపీగా ఉన్నారు. ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయనే ధీమాతో ఆయన ఉన్నారు.
మచిలీపట్నం పోర్టుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.4వేల కోట్ల రుణాన్ని ఇప్పించారు. ప్రస్తుతం పోర్టు పనులు జరుగుతున్నాయి.
మచిలీపట్నం మెడికల్ కళాశాలను రూ.550 కోట్లతో నిర్మిస్తున్నారు. ఎంపీ హోదాలో కేంద్ర ప్రభుత్వం నుంచి మెడికల్ కళాశాలకు అనుమతులు తీసుకురావడం, నిధులు మంజూరు చేయించడంలో వల్లభనేని కృషి చేశారు. ప్రస్తుతం మెడికల్ కళాశాల మొదటి సంవత్సరం తరగతులు జరుగుతున్నాయి.
గుడివాడలో రెండు రైల్వే ఫ్లై ఓవర్‌ల నిర్మాణం కోసం రూ.326 కోట్ల నిధులను మంజూరు చేయించారు. వీటి పనులు పూర్తయ్యే దశలో ఉన్నాయి.
అవనిగడ్డ నియోజకవర్గం ఎదురుమొండి దీవికి చేరుకునేందుకు రూ.150 కోట్లతో కృష్ణానదిపై వారధి నిర్మాణం చేసేందుకు నిధులు మంజూరు చేయించారు.
గిలకలదిండి హార్బర్ పనులు రూ.330 కోట్లతో జరుగుతుండగా ఇందుకు కేంద్ర ప్రభుత్వం వాటా నిధులను మంజూరు చేయించడంలో ఎంపీ బాలశౌరి విశేష కృషి చేశారు.
సింహాద్రి తట్టుకునేనా?
హైదారాబాద్‌లో అంకాలజిస్ట్ (కేన్సర్ వైద్యుడు)గా పనిచేస్తున్న మచిలీపట్నం పార్లమెంటు నియోజవర్గ వైసీపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ జిల్లా వాసులకు చిరపరితులు. తొలుత అవనిగడ్డ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఆయన పేరును ప్రకటించారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎంపీ అభ్యర్థిగా పేరును ప్రకటించి ఎన్నికల గోదాలోకి దింపారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న ఎంపీ బాలశౌరినే రాజకీయంగా వైసీపీకి చెందిన శాసనసభ్యులు ఇబ్బందులపాలు చేశారు. రాజకీయ అనుభవంలేని సింహాద్రి చంద్రశేఖర్ వైసీపీ నాయకుల కుట్రలు, కుతంత్రాలకు ఎంతమేర తట్టుకుని నిలబడతారోననే చర్చ నడుస్తోంది.
నియోజకవర్గ చరిత్ర ఇదీ..
మచిలీపట్నం పార్లమెంటు స్థానం 1952లో ఏర్పడింది. 1952లో సీపీఎం తరపున సనకా బుచ్చికోటయ్య మచిలీపట్నం ఎంపీగా ఎన్నికయ్యారు. 1957లో మండలి వెంకటకృష్ణారావు కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. 1962లో మండల స్వామినాయుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎంపీగా ఎన్నికయ్యారు. 1967లో యార్లగడ్డ అంకినీడుప్రసాద్ (చల్లపల్లి రాజా), 1971లో మేడూరి నాగేశ్వరరావు, 1977, 1980లలో మాగంటి అంకినీడు, 1984, 1989లో కావూరి సాంబశివరావు, కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీలుగా గెలుపొందారు. 1991లో కొలుసు పెదరెడ్డయ్య టీడీపీ తరపున ఎంపీగా గెలుపొందారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో బలనిరూపణ సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి ఓటువేశారు. 1996లో కైకాల సత్యనారాయణ టీడీపీ తరపున ఎంపీగా గెలుపొందారు. 1998లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున కావూరి సాంబశివరావు ఎన్నికయ్యారు. 1999లో అంబటి బ్రాహ్మణయ్య టీడీపీ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. 2004లో బాడిగ రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. 2009, 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీ పీ తరపున కొనకళ్ల నారాయణరావు ఎంపీగా ఎన్నికయ్యారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరపున వల్లభనేని బాలశౌరి ఎంపికయ్యారు. టీడీపీ ఆవిర్భవించిన 1983 తరువాత పదిసార్లు పార్లమెంటు స్థానానికి ఎన్నికలు జరగ్గా నాలుగుసార్లు టీడీపీ అభ్యర్థులు ఐదుసార్లు కాంగ్రెస్ అభ్యర్థులు, ఒకసారి వైసీపీ అభ్యర్థి ఇక్కడి నుంచి గెలుపొంది పార్లమెంటుకు వెళ్లారు.
మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి
Updated Date - Apr 21 , 2024 | 09:17 AM