AP Elections: ఓరి బాబోయ్.. వైఎస్ జగన్ రెడ్డి కడపకు వెళ్లొచ్చాక సీన్ మొత్తం మారిపోయిందే..!
ABN, Publish Date - Mar 29 , 2024 | 10:12 AM
YSRCP Situation In Kadapa: మేమంతా సిద్ధం అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పైకి చెబుతున్నారే కానీ.. సొంత ఇలాకా కడప జిల్లాలో మాత్రం అస్సలు బాగోలేదు. జగన్ కడప జిల్లాకు వెళ్లొచ్చిన తర్వాత ఒక్కసారిగా సీన్ మొత్తం మారిపోయింది..
కడప అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని వైసీపీలో (YSR Congress) అంతర్మధనం మొదలైంది. పలువురు కార్పొరేటర్లు, కీలకనేతలు పార్టీకి దూరదూరంగా ఉంటున్నారు. కొందరు అలక పాన్పు ఎక్కారు. సీఎం జగన్ (CM YS Jagan Reddy), ఎంపీ అవినాశ్‌రెడ్డితో (YS Avinash Reddy) ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా కొందరు పార్టీ మారేందుకు బయటికి రాలేని పరిస్థితి. అయితే కడప వైసీపీ నేతల్లో ఉన్న గూడుకట్టిన అసమ్మతి గుర్తించిన డిప్యూటీ సీఎం అంజద్‌బాషా అండ్ కో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థంకాక అయోమయంలో పడ్డారని.. అభద్రతాభావంతో కొట్టుమిట్టాడుతున్నారని ఆ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
సీన్ మొత్తం మారిపోయింది..!
సార్వత్రిక ఎన్నికల్లో కడప అసెంబ్లీ పోరు వన్‌సైడే ఉంటుంది. ‘నన్ను ఎవరూ అడ్డుకోలేరు, నాకు ఎవరూ అడ్డురారు.. నేనే హ్యాట్రిక్ విజయం సాధిస్తా’నంటూ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా రెండు నెలల క్రితం కూడా ఆత్మస్థైర్యంతో ఉన్నారు. కడప అంటే డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, సురేశ్‌బాబు మాత్రమే అన్నట్టుగా.. మేం చెప్పిందే వేదం, మాదే రాజ్యమనే భ్రమలో బతికారు. అయితే టీడీపీ అభ్యర్ధిగా మాధవీరెడ్డి ఎంట్రీ అయిన తరువాత మెల్లమెల్లగా అంజద్‌బాషా వర్గంలో బాగా మార్పు వచ్చినట్లు చెప్పుకొస్తున్నారు. నిన్నటిదాకా వార్ వన్‌సైడ్ అన్నట్లుగా గెలుపు మాదే అంటూ విర్రవీగారు. ఇప్పుడు సొంతింటిలోనే అసంతృప్తులు ఉండడం వైసీపీ కార్పొరేటర్లలోనే మనస్పర్ధలు, అనుమాన పొరపొచ్చాలు రావడంతో.. ఆ పార్టీలో ఒకరంటే ఒకరికి అపనమ్మకం ఏర్పడే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం వచ్చి 57 నెలలు అయింది. లక్షలు ఖర్చు పెట్టి కార్పొరేటర్లుగా గెలిచాం.. జగన్‌పై పిచ్చితో పార్టీ కోసం శ్రమించాం. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత ఎలాంటి గౌరవం లేదు. పేరుకే కార్పొరేటర్లు.. పర్సంటేజీలు ఇస్తే తప్ప పనులు ఇవ్వలేదనే కొందరు కార్పొరేటర్లు ఆగ్రహంతో ఉన్నారు.
ఎంపీ అవినాశ్‌రెడ్డితో నేరుగా..
కడప అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పలువురు వైసీపీ కీలక నేతలు, కార్పొరేటర్లు అసంతృప్తితో రగిలిపోతున్నట్లు చెబుతారు. ఎవరు పార్టీ మారుతారో, ఎవరు వచ్చే ఎన్నికల్లో పనిచేయరో అన్న భయం అంజద్‌బాషా అనుచరుల్లో కొనసాగుతోందని ప్రచారం ఉంది. కడప అసెంబ్లీ టికెట్‌ను మాజీమంత్రి దివంగత ఖలీల్‌బాషా తనయుడు సొహైల్‌తో పాటు అప్జల్‌ఖాన్ ఆశిస్తూ వచ్చారంటారు. అయితే ఈసారి డిప్యూటీ సీఎంనే తిరిగి కొనసాగించాలని సీఎం జగన్ డిసైడ్ అయ్యారు. సొహైల్ పార్టీ మారతారనే వదంతులు రావడంతో హుటాహుటిన ఎంపీ అవినాశ్‌రెడ్డిని రంగంలోకి దింపి ఆయన బుజ్జగించే ప్రయత్నం చేశారు. అలాగే మరికొందరు కార్పొరేటర్లు, ముఖ్య నేతలను నేరుగా ఎంపీ అవినాశ్‌తోనే మాట్లాడిస్తూ మేమున్నామని భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
మాధవీరెడ్డి ప్రశ్నలకు బదులేదీ..?
2004కు ముందు కడపలో టీడీపీ అధిక్యత సాధించేది. అయితే 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో ఓడిపోతూ వచ్చింది. ఈసారి ఎలాగైనా గెలవాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి సతీమణి మాధవీరెడ్డిని ఐదు నెలల క్రితం ఇన్‌చార్జిగా ప్రకటించారు. ఇటీవలే అభ్యర్థిగా ప్రకటించారు. అయితే వచ్చినప్పటి నుంచి ఆమె కడప అసెంబ్లీలో బాగా చుట్టేస్తున్నారు. ఇంటింటికీ వెళుతున్నారు. అంజద్‌బాషా, వైసీపీ వైఫల్యాలపై చాలా సూటిగా విమర్శిస్తూ జనాల్లోకి బాగా దూసుకెళుతున్నారు. ఇంటింటికీ వెళ్లినప్పుడు జగన్ మాకు సంక్షేమ పథకాలు ఇచ్చారని జనాలు చెబితే.. ‘‘అలాగా.. ఓకే 2019లో కరెంటు బిల్లు ఎంత.. అప్పుడు మీ ఇంట్లో ఎన్ని ఫ్యాన్లు, ఏసీలు ఉన్నాయి. ఇప్పుడు మీకు వస్తున్న కరెంటు బిల్లు ఎంత.. అప్పుడు మీఇంటి ఆస్తి పన్ను ఎంత, చెత్త పన్ను ఉండిందా అంటూ’’ ఇలా ఇంటింటికీ బాగా వివరిస్తూ పోతున్నారు. పది మనకు ఇచ్చి వంద లాగేస్తున్నాడనే విషయాన్ని ఆమె జనం బుర్రల్లోకి బాగా తీసుకెళ్లారు. ఆమె ప్రశ్నలకు వైసీపీలో సమాధానం లేదు.. .కేవలం వ్యక్తిగతంగా మీది ఇక్కడ కాదు, నాన్‌లోకల్ అంటూ సమాధానం ఇస్తున్నారు. అంతేతప్ప అడిగిన ప్రశ్నలకు సమాధానాలు లేవు. దీంతో వైసీపీ కార్పొరేటర్లు పక్క చూపు చూస్తారనే భయం ఆ పార్టీ పెద్దల్లో ఉంది.
బస్సు యాత్ర అంతంతే..
ప్రొద్దుటూరులో జరిగిన మేమంతా సిద్ధం బహిరంగసభను వైసీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. లక్ష 50వేల మంది జనాలను తీసుకురావాలనుకున్నారు. కడప కార్పొరేటర్లకు జనం తరలించే బాధ్యతను పెట్టారు. అయితే చాలా మంది ‘‘ఎన్నికల్లో లక్షలు ఖర్చు పెట్టాం.. అధికారంలోకి వచ్చినా మాకు ఉపయోగంలేదు. ఎవరూ పలకలేదు. ఎవరెవ రిరో పదవులు ఇచ్చారు. మీకు కావాల్సిన వారికి పదవులు ఇచ్చారు. మీకు జనం కావాలంటే ఇతరత్రా వాటికోసం మమ్మల్ను అడుగుతారా’’ అంటూ కొందరు కార్పొరేటర్లు అసహనం వ్యక్తం చేశారని అంటున్నారు. అందుకే ప్రతి డివిజన్‌కు బస్సును పంపినా జనం మాత్రం పెద్దగా వెళ్లలేని సమాచారం. ప్రొద్దుటూరు సభకు హాజరైన జనాన్ని చూసినా ఈ విషయం స్పష్టమై పోతుంది.
Updated Date - Mar 29 , 2024 | 10:16 AM