Instagram Reel: దారుణం.. బాలుడి ప్రాణం తీసిన రీల్.. అందరూ చూస్తుండగానే..
ABN, Publish Date - Jul 22 , 2024 | 03:32 PM
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ మోజు ఓ బాలుడి ప్రాణం తీసింది. సరదా కోసం చేసిన ప్రయత్నం బెడిసికొట్టడంతో.. అతను ప్రాణాలు కోల్పోయాడు. తన చుట్టూ ఉన్న పిల్లలు చూస్తుండగానే ఆ అబ్బాయి..
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ (Instagram Reels) మోజు ఓ బాలుడి ప్రాణం తీసింది. సరదా కోసం చేసిన ప్రయత్నం బెడిసికొట్టడంతో.. అతను ప్రాణాలు కోల్పోయాడు. తన చుట్టూ ఉన్న పిల్లలు చూస్తుండగానే ఆ అబ్బాయి తుదిశ్వాస విడిచాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh) చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. మొరినా జిల్లాలో కరణ్ పర్మార్ (Karan Parmar) అనే 11 ఏళ్ల బాలుడు ఏడో తరగతి చదువుతున్నాడు. ఎప్పట్లాగే.. శనివారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి ఇంటి సమీపంలోని ఖాళీ స్థలం వద్దకు వెళ్లాడు. వాళ్లతో కలిసి కాసేపు సరదాగా ఆడుకున్నాడు.
Read Also: ఆటో డ్రైవర్‌గా మారిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. కారణం తెలిస్తే..
ఈ క్రమంలోనే.. ఓ ప్రాంక్ వీడియో చేయాలని కరణ్ అనుకున్నాడు. ఈ వీడియోని ఇన్‌స్టాలో పోస్టు చేస్తే.. వైరల్ అవుతుందని భావించాడు. అనుకున్నదే తడువుగా.. ప్రాంక్ వీడియోని షూట్ చేయడం ప్రారంభించాడు. అక్కడే ఉన్న ఓ చెట్టుకు తాడు కట్టి.. దాన్ని తన మెడకు చుట్టుకున్నాడు. తొలుత గోడపై నిల్చొని.. చనిపోయినట్లు నటించాడు. అయితే.. ఆ వీడియో సహజంగా రావాలన్న ఉద్దేశంతో ఆ బాలుడు తన కాళ్లు కిందకు దించేశాడు. అప్పుడు ఆ తాడు మెడకు బిగుసుకుపోవడంతో.. ఊపిరాడక కరణ్ విలవిల్లాడాడు. పాపం.. చుట్టూ పక్కల ఉన్న స్నేహితులంతా అతడు నటిస్తున్నాడేమోనని భావించారు. కానీ.. ఇంతలోనే కరణ్ స్పృహ కోల్పోవడం చూసి ఆ పిల్లలు భయపడిపోయారు.
ఈ విషయాన్ని వాళ్లు వెంటనే కరణ్ కుటుంబ సభ్యులకు తెలియాజేశారు. వాళ్లు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని, బాలుడిని కిందకు దించి.. అక్కడి నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే.. అప్పటికే ఆ బాలుడు మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. దీంతో.. కరణ్ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్నేహితులతో ఆడుకోవడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లిన తమ కుమారుడు.. ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో తమ దృష్టికి వచ్చిందని.. ప్రాంక్ వీడియో చేస్తున్న క్రమంలో ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడని సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ రవి భడోరియా తెలిపారు.
Read Latest Viral News and Telugu News
Updated Date - Jul 22 , 2024 | 03:32 PM