Share News

Viral: ఈ నెల 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు! జనవరిలో ప్రమాణస్వీకారం! ఎందుకంటే..

ABN , Publish Date - Nov 02 , 2024 | 07:46 AM

అమెరికాలో నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండగా కొత్త అధ్యక్షుడు మాత్రం జనవరిలో ప్రమాణస్వీకారం చేస్తారు. దీనికి వెనక చారిత్రక కారణాలు అనేకం ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Viral: ఈ నెల 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు! జనవరిలో ప్రమాణస్వీకారం! ఎందుకంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఏ దేశంలో అయినా ఎన్నికలు పూర్తయ్యాక రోజుల వ్యవధిలో దేశాధినేతలు ప్రమాణ స్వీకారం చేస్తారు. కానీ అమెరికాలో మాత్రం పరిస్థితి భిన్నం. ఈసారి నవంబర్ 5న ఎన్నికలు జరుగుతుండగా కొత్త అధ్యక్షుడు మాత్రం జనవరిలో ప్రమాణస్వీకారం చేస్తారు. దీనికి వెనక చారిత్రక కారణాలు అనేకం ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం (USA Elections).

US Elections: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో ఈ 2 రాష్ట్రాలే కీలకం.. ఇవే డిసైడ్ చేస్తాయా..


అమెరికాలో అధ్యక్ష ఎన్నికలను నవంబర్‌లో తొలి మంగళవారం నాడు నిర్వహిస్తారు. మొదట్లో ఒక్కోరాష్ట్రం ఒక్కో రోజు అధ్యక్ష ఎన్నికలు నిర్వహించేది. కానీ దేశంలో ఎన్నికలు ఒకే రోజున నిర్వహించాలంటూ 1845లో అక్కడో చట్టం తెచ్చారు. అప్పట్లో అమెరికా వ్యవసాయాధారిత దేశంగా ఉండేది. కాబట్టి, నవంబర్‌లో ఎన్నికలు రైతులకు అనుకూలమని నాటి పాలకులు నిర్ణయించారు. అప్పటికి పంట చేతికి రావడంతో పాటు వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుందని నవంబర్‌ను ఎంచుకున్నారు. ఇక ఆదివారం అందరూ ప్రార్థనల్లో పాల్గొంటారు కాబట్టి ఆ రోజు ఎన్నికలు నిర్వహించలేరు. అప్పట్లో రైతులు బుధవారం తమ పంటతో మార్కెట్‌కు వెళ్లేవారట. ఫలితంగా, బుధవారం కూడా ఎన్నికల నిర్వహణకు అనుకూలం కాదు. ఇతర కారణాలతో సోమ, గురువారాలు కూడా ఎన్నికలకు అనర్హంగా మారడంతో చివరకు నవంబర్ తొలి మంగళవారం నాడు ఎన్నిక నిర్వహించాలని అప్పటి పాలకులు తీర్మానించుకున్నారు. నాటి సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.


ఆలస్యంగా ప్రమాణస్వీకారం! కారణం ఇదే..

ఇక ఎన్నికల తరువాత ప్రమాణస్వీకారానికి జాప్యం వెనక కూడా ఆసక్తికర కారణం ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. మొదట్లో కొత్త అధ్యక్షులు ఎన్నికలైన నాలుగు నెలలకు ప్రమాణస్వీకారం చేసేవారట. అధ్యక్ష బాధ్యతలకు సమాయత్తం అయ్యేందుకు, మంత్రివర్గం కూర్పు తదితర ఏర్పాట్లన్నీ చేసుకున్నాక తీరిగ్గా బాధ్యతలు తీసుకునేవారట. కానీ, అమెరికాలో భారీ ఆర్థిక మాంద్యం సంభవించాక పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ప్రమాణస్వీకారాన్ని వీలైనంత ముందుకు జరపాలనే ఉద్దేశంతో నాటి పాలకులు జనవరి 20న ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకు వీలుగా రాజ్యాంగానికి 20వ సవరణ చేశారు.

అమెరికాలో అమలయ్యే ఎలక్టోరల్ కాలేజీ విధానం కూడా ఈ జాప్యానికి ఒక ప్రధాన కారణం. ఇతర దేశాల్లో ఎంపీలు, లేదా ఎమ్మెల్యేలు ప్రధాని లేదా దేశాధినేతను ఎన్నుకుంటే అమెరికాలో ఎలక్టోరల్ కాలేజీ వ్యవస్థ అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది. ఇందుకు కూడా కొంత సమయం పడుతుందని కాబట్టి ప్రమాణస్వీకార కార్యక్రమం జనవరిలో జరుగుతుంది.


హిందూ అమెరికన్లకు రక్షణ కల్పిస్తాం: ట్రంప్‌

ఎన్నికల తరువాత ప్రమాణస్వీకారానికి కొన్ని వారాల గడువు ఉంటుంది. ఈ వ్యవధిలో ఎన్నికల విజేతలు పలు చర్యలు తీసుకుంటారు. తమ ప్రభుత్వ విధానాలకు తుది రూపు ఇవ్వడం, కేబినెట్ కూర్పు, అభివృద్ధి లక్ష్యాలు, తదితర అంశాలపై తమ విధానాలను పూర్తిస్థాయిలో సిద్ధం చేసుకుంటారు. అంతేకాకుండా, ఎన్నికల విజేతకు ప్రభుత్వ పరిస్థితులు, ఆదాయవ్యయాలు వంటి వాటిపై ఈ సమయంలోనేపాత ప్రభుత్వం అవగాహన కల్పిస్తుందట. దీనితోపాటు అత్యవసర నిధిని కూడా కేటాయిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే అధికార బదిలీ సాఫీగా సాగిపోయేందుకు వీలుగా ప్రమాణస్వీకారం కాస్త ఆలస్యంగా నిర్వహించేందుకు అమెరికా పాలకులు నిర్ణయించారు.

Read Latest and International News

Updated Date - Nov 02 , 2024 | 07:56 AM