ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

World Chess Champion: 64 గళ్ల రాజ్యాన్ని జయించాడు!

ABN, Publish Date - Dec 13 , 2024 | 03:49 AM

భారత టీనేజ్‌ గ్రాండ్‌ మాస్టర్‌ గుకేష్‌ దొమ్మరాజు ప్రపంచ చెస్‌ చాంపియన్‌గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. 18 ఏళ్ల పిన్నవయసులోనే చెస్‌ రారాజుగా అత్యంత అరుదైన ఘనతను అందుకొన్నాడు. 18వ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో భాగంగా..

World Chess Champion Gukesh D

ప్రపంచ చెస్‌ చాంపియన్‌ గుకేష్‌

పిన్నవయస్కుడిగా సరికొత్త చరిత్ర

ఆఖరి రౌండ్‌లో డింగ్‌కు చెక్‌

అరవైనాలుగు గళ్ల సమరంలో గుకేష్‌ చరిత్ర సృష్టించాడు. 18 ఏళ్ల ప్రాయంలోనే చెస్‌ ప్రపంచానికి రారాజుగా అవతరించాడు. ‘క్యాండిడేట్స్‌’ విజేతగా వరల్డ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌నకు అర్హత సాధించిన భారత జీఎం.. గత విజేత డింగ్‌ లిరెన్‌ను ఓడించి అగ్రపీఠాన్ని అధిష్టించాడు. హోరాహోరీగా సాగిన 14 రౌండ్ల పోరులో.. ఆఖరి గేమ్‌లో ప్రత్యర్థి ఎత్తును చిత్తు చేసిన గుకేష్‌.. చదరంగ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకొన్నాడు.


సింగపూర్‌: భారత టీనేజ్‌ గ్రాండ్‌ మాస్టర్‌ గుకేష్‌ దొమ్మరాజు ప్రపంచ చెస్‌ చాంపియన్‌గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. 18 ఏళ్ల పిన్నవయసులోనే చెస్‌ రారాజుగా అత్యంత అరుదైన ఘనతను అందుకొన్నాడు. 18వ వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలో భాగంగా.. 14 రౌండ్లపాటు హోరాహోరీగా సాగిన పోరులో డిఫెండింగ్‌ చాంపియన్‌, చైనాకు చెందిన డింగ్‌ లిరెన్‌ (32)ను గుకేష్‌ 7.5-6.5 పాయింట్ల తేడాతో ఓడించాడు. టోర్నీ నిబంధనల ప్రకారం తొలుత 7.5 పాయింట్లు సాధించిన ఆటగాడిని విజేతగా ప్రకటిస్తారు. గురువారం నాలుగు గంటలపాటు జరిగిన 14వ, ఆఖరి క్లాసిక్‌ రౌండ్‌లో 58 ఎత్తుల్లో లిరెన్‌ ఆటకట్టించిన దొమ్మరాజు విశ్వకిరీటాన్ని అందుకొన్నాడు. టోర్నీ ఆరంభానికి ముందు భారత జీఎంను ఫేవరెట్‌గా పరిగణించినా.. తొలి రౌండ్‌లోనే షాకిచ్చిన లిరెన్‌ తనను ఏమాత్రం తక్కువగా అంచనా వేయొద్దన్న హెచ్చరికలు పంపాడు. కానీ, కీలక గేమ్‌ డ్రా దిశగా సాగుతున్న క్రమంలో.. లిరెన్‌ చేసిన ఒక్క తప్పిదాన్ని గుకేష్‌ తన విజయానికి మెట్టుగా మార్చుకొన్నాడు. 1985లో రష్యన్‌ చెస్‌ లెజెండ్‌ గ్యారీ కాస్పరోవ్‌ (22 ఏళ్ల 6 నెలల 27 రోజులు) పిన్నవయసులో చాంపియన్‌గా నిలవగా.. ఆ రికార్డును గుకేష్‌ (18 ఏళ్ల 8 నెలల 14 రోజులు) బద్దలుకొట్టాడు. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ఈ ఘనతను సాధించిన రెండో భారతీయుడిగా దేశ ప్రజలను ముగ్ధులను చేశాడు. 2013లో విషీ విజేతగా నిలవగా.. దశాబ్దం తర్వాత గుకేష్‌ అద్భుతం చేశాడు.


ఒక్క ఎత్తుతో చిత్తు..

13వ రౌండ్‌ ముగిసేసరికి చెరో 6.5 పాయింట్లతో నిలిచిన గుకే్‌ష-లిరెన్‌కు 14వ రౌండ్‌ అత్యంత కీలకం. క్లాసిక్‌ గేమ్‌లో ఎంతో పట్టున్న దొమ్మరాజుకు టోర్నీ టైబ్రేక్‌ దారితీస్తే మాత్రం ఎంతో సంక్లిష్టమయ్యేది. ఈ నేపథ్యంలో తీవ్ర ఒత్తిడి మధ్య నల్లపావులతో ఆడిన గుకేష్‌ ఆది నుంచే దీటుగా ఎత్తులు వేస్తూ ప్రత్యర్థిని ఇరుకునబెట్టే ప్రయత్నం చేశాడు. తెల్లపావులతో ఆడిన డింగ్‌.. జుకర్‌టార్ట్‌ ఓపెనింగ్‌తో ఆరంభించాడు. దీనికి గుకేష్‌ కింగ్స్‌ రివర్స్‌డ్‌ గ్రెన్‌ఫెల్ట్‌ ఓపెనింగ్‌ ప్యాట్రన్‌తో దీటుగా బదులిచ్చాడు. గత రౌండ్లలో ఆరంభంలో ఎత్తులు వేయడానికి ఎంతో సమయం తీసుకొన్న లిరెన్‌ ఈ రౌండ్‌లో చకచకా పావులు కదిపాడు. బదులుగా గుకేష్‌ కూడా కౌంటర్‌ మూవ్స్‌తో టైమ్‌ కంట్రోల్‌ గేమ్‌ ఆడాడు. ఇద్దరూ మధ్య బోర్డులో ఆధిక్యం కోసం తీవ్రంగా ప్రయత్నించారు. 32 ఎత్తులు ముగిసే సరికి ఇద్దరి వద్ద చెరో బిషప్‌, రుక్‌ మాత్రమే మిగిలున్నాయి. అయితే, గుకేష్‌ వద్ద ఒక్క పాన్‌ అదనంగా ఉంది. ఈ క్రమంలో 40 ఎత్తులు పూర్తయ్యే సరికి.. చాలా మంది విశ్లేషకులు ఫలితం టైబ్రేక్‌కు మళ్లుతుందన్న ఊహాగానాలు చేశారు.


మరోవైపు డింగ్‌ కూడా తదనుగుణంగా ఎత్తులు వేశాడు. కచ్చితంగా డ్రా అనుకొంటున్న సమయంలో 55వ ఎత్తులో లిరెన్‌ ఘోర తప్పిదం చేశాడు. తన రుక్‌ను గుకేష్‌ రుక్‌కు ఎదురుగా నిలిపాడు. దీన్ని గమనించిన గుకేష్‌ ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. అనంతరం మరో మూడు ఎత్తుల్లోనే చైనా గ్రాండ్‌ మాస్టర్‌ ఓటమిని అంగీకరించాడు. దీంతో గుకేష్‌ ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యాడు. అతడి కంటి నుంచి ఆనందభాష్పాలు జలజలా రాలాయి. చేతులతో ముఖాన్ని దాచుకొన్న భారత జీఎం.. ఆ తర్వాత తేరుకొని సంబరాలు చేసుకొన్నాడు.

నిశితంగా పరిశీలించే వాడు: ఆప్టన్‌

టోర్నీ ఆసాంతం ఒడిదొడుకులు ఎదురైనా.. గుకేష్‌ ఎంతో కూల్‌గా వ్యవహరించాడు. తొలి గేమ్‌లోనే కంగుతున్నా అద్భుతంగా పుంజుకొన్నాడు. మానసికంగా గుకేష్‌ ఎంతో బలంగా ఉండడం వెనుక ప్రముఖ మెంటల్‌ కండీషనింగ్‌ కోచ్‌ ప్యాడీ ఆప్టన్‌ పాత్ర చాలా ఉంది. గత ఆరునెలలుగా గుకే్‌షకు ఆప్టన్‌ వర్చువల్‌గా శిక్షణనిచ్చాడు. గంటలకొద్దీ సెషన్‌లు కొనసాగేవని చెప్పాడు. చిన్నవయసులోనే అతడి ఆలోచనల్లో ఎంతో పరిపక్వత కనిపించిందని ప్యాడీ చెప్పాడు. ప్రతి చిన్న విషయాన్ని నిశితంగా గమనించి.. శోధించి తెలుసుకోవడం వల్లే అతడు ఎంతో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాడని చెప్పాడు. 2011లో టీమిండియా వరల్డ్‌కప్‌ నెగ్గిప్పుడు కూడా ఆప్టన్‌ సేవలు అందించాడు.


విజేతకు రూ.11.45 కోట్లు

వరల్డ్‌ చెస్‌ చాంపియన్‌గా నిలిచిన గుకేశ్‌ ఖాతాలో ప్రైజ్‌మనీ కూడా భారీగా చేరనుంది. 14 రౌండ్లపాటు సాగిన ఈ చాంపియన్‌షిప్‌ మొత్తం ప్రైజ్‌మనీ 2.5 మిలియన్‌ డాలర్లు (రూ.21.22 కోట్లు). అలాగే ఫిడే నిబంధనల ప్రకారం ఇందులో ఒక్కో రౌండ్‌ గెలిచిన విజేతకు రూ.1.69 కోట్లు లభిస్తాయి. కాబట్టి ఈ చాంపియన్‌షిప్‌లో మూడు గేమ్‌లు గెలిచిన గుకేశ్‌ రూ.5.07 కోట్లు సాధించాడు. లిరెన్‌ రెండు గేమ్‌లు గెలవడంతో అతడికి రూ.3.38 కోట్లు దక్కాయి. ఇక మిగిలిన 1.5 మిలియన్‌ డాలర్ల ప్రైజ్‌మనీని ఇరువురికి సమానంగా పంచారు. దీంతో గుకేశ్‌కు మొత్తంగా రూ.11.45 కోట్లు లభించగా.. రన్నరప్‌గా నిలిచిన లిరెన్‌కు రూ.9.75 కోట్లు అందాయి.


ఇదీ టీమ్‌..

గ్రజ్‌గోర్జ్‌ గజూస్కి

రడోస్లావ్‌ వోజ్‌టస్జక్‌

పెంట్యాల హరికృష్ణ

విన్సెంట్‌ కీమర్‌

జాన్‌ క్లిమ్‌కోస్కి

జాన్‌ క్రజిస్టోఫ్‌ డుడా

విశ్వనాథన్‌ ఆనంద్‌

ప్యాడీ ఆప్టన్‌

సంబరాలు.. వినూత్నంగా..

గుకేష్‌ తన గెలుపు సంబరాలను వినూత్నంగా చేసుకొన్నాడు. గేమ్‌ ముగిసిన తర్వాత చెస్‌ బోర్డుపై పావులను ఆయా స్థానాల్లో ఉంచి తన గౌరవాన్ని చాటాడు. బోర్డుపై పావులను సర్దుతున్న వీడియో ఇప్పుడు నెట్‌లో వైరల్‌గా మారింది. బలగాలను వాటివాటి స్థానాల్లో పెట్టిన తర్వాతనే అతడు పైకిలేచి విజయదరహాసం చేశాడు.


కల నెరవేరింది: గుకేష్‌

‘గత పదేళ్లుగా ఈ రోజుకోసమే కలలు కంటున్నా. నా స్వప్నం నిజమైనందుకు ఎంతో సంతోషంగా ఉంది. విజేతగా నిలుస్తానని ఊహించలేదు. అందుకే భావోద్వేగానికి గురయ్యా. అవకాశం చిక్కడంతో.. ప్రత్యర్థిపై విరుచుకుపడ్డా. తొలి గేమ్‌లో ఓడినప్పుడు విషీ సర్‌ ధైర్యం చెప్పాడు. పిన్నవయసు చాంపియన్‌గా నిలవాలని 2017లో అనుకొన్నా.’

నా అంచనాలను మించాడు

తొలి ప్రపంచ చాంపియన్‌షి్‌ప మ్యాచ్‌లోనే గుకేష్‌ ఆటతీరు అద్భుతంగా ఉందని ఐదుసార్లు చాంపియన్‌ ఆనంద్‌ కొనియాడాడు. ‘గుకేష్‌ నా అంచనాలను మించి రాణించాడు. గుకేష్‌ విశ్వ విజయం భారత్‌ చెస్‌పై ఎంతో ప్రభావం చూపుతుంది. ఎందరో యువకులు చెస్‌ క్రీడలోకి అడుగుపెట్టేందుకు గుకేష్‌ టైటిల్‌ గెలుపు దోహదం చేస్తుంది’ అని ఆనంద్‌ స్పష్టంజేశాడు.


చెస్‌కు అంతం: క్రామ్నిక్‌

వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలో డిఫెండింగ్‌ చాంప్‌ లిరెన్‌ చిన్నపిల్లాడిలా ఆడి తప్పిదం చేయడంపై మాజీ విజేత వ్లాదిమిర్‌ క్రామ్నిక్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. చెస్‌కు ఇది అంతమన్నాడు. ‘ఎటువంటి వ్యాఖ్యలు చేయదల్చుకోలేదు. బాధగా ఉంది. మాకు తెలిసిన చెస్‌ అంతమైంది’ అని ఎక్స్‌లో పోస్టు చేశాడు. పిల్లలు కూడా చేయని తప్పిదం.. వరల్డ్‌ చెస్‌ టైటిల్‌ ఫలితాన్ని నిర్ధారించిందని మరో పోస్టులో అసహనం వ్యక్తం చేశాడు.

పిన్నవయసు వరల్డ్‌ చాంపియన్లు

గుకేష్‌ 18 ఏళ్ల 8 నెలల 14 రోజులు

గ్యారీ కాస్పరోవ్‌ 22 ఏళ్ల 6 నెలల 27 రోజులు

మాగ్నస్‌ కార్ల్‌సన్‌ 22 ఏళ్ల 11 నెలల 24 రోజులు

మిఖైల్‌ తాల్‌ 23 ఏళ్ల 5 నెలల 28 రోజులు

అనతొలి కార్పోవ్‌ 23 ఏళ్ల 10 నెలల 11 రోజులు

వ్లాదిమిర్‌ క్రామ్నిక్‌ 25 ఏళ్ల 4 నెలల 10 రోజులు

ఎమ్మాన్యుయెల్‌ లాస్కర్‌ 25 ఏళ్ల 5 నెలల 2 రోజులు


యువతకు ప్రేరణ

‘చారిత్రకం.. ఆదర్శవంతం..! అద్భుత విజయం సాధించిన గుకే్‌షకు అభినందనలు. ఇది ప్రతిభ, కఠిన శ్రమ, పట్టుదలకు దక్కిన ప్రతిఫలం. అతడి విజయం చెస్‌లో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించడమే కాదు.. ఎంతోమంది యువతకు ప్రేరణ. భవిష్యత్‌లో అతడు మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకొంటున్నా’

ప్రధాని నరేంద్ర మోదీ

‘ఎంతో గర్విస్తున్నాం. గొప్ప విజయం సాధించిన నీకు అభినందనలు. చెస్‌కు భారత్‌ పవర్‌హౌస్‌ అని నిరూపించావు. భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిష్టించాలి’

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Updated Date - Dec 13 , 2024 | 08:10 AM