Cricket: 21 ఏళ్ల యువకుడికి బీసీసీఐ పిలుపు.. అదృష్టం వరించనుందా..
ABN, Publish Date - Sep 08 , 2024 | 08:12 PM
చెన్నైలో క్యాంపునకు రావాలని ఆఫ్ స్పిన్నర్ హిమాన్షు సింగ్‌ను బీసీసీఐ ఆహ్వానించిందనే వార్తలు వస్తున్నాయి. ఈ 21 ఏళ్ల యువ స్పిన్నర్ బౌలింగ్ యాక్షన్ రవిచంద్రమఅశ్విన్ తరహాలో ఉంటుంది.
రెండు టెస్ట్, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. టెస్ట్ సిరీస్ సెప్టెంబర్ 19వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ మ్యాచ్ చెన్నైలో జరగనుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 13 నుంచి 18వ తేదీ వరకు క్రికెటర్లకు చెన్నైలో క్యాంపు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఎంపికైన భారత ఆటగాళ్లు ఈ క్యాంప్‌నకు హాజరు కావాలి. ఒకట్రెండు రోజుల్లో జట్టును బీసీసీఐ ఎంపిక చేయనుంది. ఈలోపు చెన్నైలో క్యాంపునకు రావాలని ఆఫ్ స్పిన్నర్ హిమాన్షు సింగ్‌ను బీసీసీఐ ఆహ్వానించిందనే వార్తలు వస్తున్నాయి. ఈ 21 ఏళ్ల యువ స్పిన్నర్ బౌలింగ్ యాక్షన్ రవిచంద్రమఅశ్విన్ తరహాలో ఉంటుంది. ముంబైకి చెందిన ఈ బౌలర్ ఇటీవల దేశవాలీ క్రికెట్‌లో రాణించడంతో బీసీసీఐ చెన్నై క్యాంపునకు పిలిచినట్లు తెలుస్తోంది.
ఎవరీ హిమాన్షు సింగ్?
దేశవాళీ క్రికెట్‌లో ముంబై తరఫున ఆడుతున్న హిమాన్షు సింగ్ కొంతకాలంగా బీసీసీఐ 'ఎమర్జింగ్ ప్లేయర్స్' క్యాంప్‌లో భాగమయ్యాడు. హిమాన్షు బౌలింగ్ చూసిన టీమ్ ఇండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఇంప్రెస్ అయ్యారు. హిమాన్షు ఎత్తు, యాక్షన్ అశ్విన్‌లా ఉన్నాయంటూ ఎందరో క్రికెటర్లు యువ స్పిన్నర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. బంతిపై నియంత్రణ కలిగి ఉండటం ఈ యువ క్రికెటర్ బాగా రాణించడానికి దోహదపడుతోంది. 6.4 అడుగుల పొడవు గల హిమాన్షు ఇటీవల జరిగిన కెటి రమేష్ మెమోరియల్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌పై 74 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. 2023-24 సీజన్‌లో అండర్-23 CK నాయుడు ట్రోఫీలో 8 మ్యాచ్‌ల్లో 38 వికెట్లు తీశాడు. అంతేకాదు ఒక ఇన్నింగ్స్‌లో 4 సార్లు 5 వికెట్లు తీసిన ఘనతను హిమాన్షు సాధించాడు. బీసీసీఐ పర్యవేక్షణలో శిక్షణ కోసం హిమాన్షు తరచూ అనంతపురం, బెంగళూరుకు వస్తున్నాడు. టీమ్ ఇండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అతని బృందం నిరంతరం హిమాన్షు సింగ్ బౌలింగ్ తీరును గమనిస్తూనే ఉంది. హిమాన్షు ఆటతీరు పట్ల బీసీసీఐ సంతృప్తిగా ఉండటంతో ఈ యువ స్పిన్నర్‌కు పిలుపు వచ్చింది. దీంతో ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో టెస్ట్ సీరిస్ కోసం ఎంపిక చేయనున్న జట్టులో స్థానం దక్కుతుందనే టాక్ వినిపిస్తోంది.
రెండు టెస్ట్, మూడు టీ20 మ్యాచ్‌లు..
భారత పర్యటనలో బంగ్లాదేశ్ జట్టు సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 12 వరకు రెండు టెస్ట్, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ సెప్టెంబరు 19 నుంచి 23 వరకు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. రెండో మ్యాచ్ సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1వరకు కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ మైదానంలో జరుగుతుంది. ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇరు జట్లు తలపడతాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Sports News and Latest Telugu News Click Here
Updated Date - Sep 08 , 2024 | 08:13 PM