GT vs PBKS: గిల్ విధ్వంసం.. తెవాటియా మెరుపులు.. పంజాబ్ ముందు భారీ లక్ష్యం
ABN, Publish Date - Apr 04 , 2024 | 09:27 PM
కెప్టెన్ శుభ్‌మన్ గిల్ విధ్వంసానికి తోడు రాహుల్ తెవాటియా, సాయి సుదర్శన్ మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగడంతో పంజాబ్ కింగ్స్ ముందు గుజరాత్ టైటాన్స్ 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిన గిల్(89) అజేయ హాఫ్ సెంచరీతో గుజరాత్ భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.
అహ్మదాబాద్: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill ) విధ్వంసానికి తోడు రాహుల్ తెవాటియా(Rahul Tewatia), సాయి సుదర్శన్ మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగడంతో పంజాబ్ కింగ్స్ ముందు గుజరాత్ టైటాన్స్ 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిన గిల్(89) అజేయ హాఫ్ సెంచరీతో గుజరాత్ భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. చివర్లో క్రీజులోకి వచ్చిన రాహుల్ తెవాటియా తన మార్కు ఫినిషింగ్ ఇచ్చాడు. మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. పంజాబ్ బౌలర్లలో రబాడ 2 వికెట్లు పడగొట్టాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ 29 పరుగుల వద్ద వృద్ధిమాన్ సాహా(11) వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్‌లో ధావన్‌కు క్యాచ్ ఇచ్చి సాహా ఔటయ్యాడు. హర్‌ప్రీత్ బ్రార్ వేసిన మొదటి ఓవర్‌లోనే గిల్ ఓ సిక్సర్ బాదాడు. దీంతో ఈ ఐపీఎల్ సీజన్‌లో 300 సిక్సులు పూర్తయ్యాయి.
అనంతరం కేన్ విలియమ్సన్‌తో కలిసి కెప్టెన్ గిల్ మూడో వికెట్‌కు 40 పరుగులు జోడించాడు. 9వ ఓవర్‌లో విలియమ్సన్(26)ను ఔట్ చేసిన ఈ భాగస్వామ్యాన్ని హర్‌ప్రీత్ బ్రార్ విడదీశాడు. అనంతరం సాయి సుదర్శన్‌తో కలిసి గిల్ మూడో వికెట్‌కు 53 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో గుజరాత్ స్కోర్ 100 పరుగులు దాటింది. ధాటిగా ఆడిన సుదర్శన్ 6 ఫోర్లతో 19 బంతుల్లో 33 పరుగులు చేశాడు. 14వ ఓవర్‌లో సాయి సుదర్శన్(33)ను ఔట్ చేసి ఈ భాగస్వామ్యాన్ని పేసర్ హర్షల్ పటేల్ విడదీశాడు. దీంతో 122 పరుగులకు గుజరాత్ 3 వికెట్లు కోల్పోయింది. అనంతరం విజయశంకర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లిన గిల్ 31 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ లో గిల్ కు ఇది 19వ హాఫ్ సెంచరీ. 15 ఓవర్లు ముగిసే సమయానికి గుజరాత్ స్కోర్ 134/3గా ఉంది.
హాఫ్ సెంచరీ అనంతరం గిల్ మరింత చెలరేగాడు. ఈ క్రమంలో జట్టు స్కోర్ 150 పరుగులు దాటింది. మరోసారి చెలరేగిన రబాడ 18వ ఓవర్‌లో విజయ్ శంకర్(8)ను పెవిలియన్ చేర్చాడు. దీంతో 164 పరుగులకు గుజరాత్ 4 వికెట్లు కోల్పోయింది. హర్షల్ పటేల్ వేసిన 19వ ఓవర్‌లో 20 పరుగులొచ్చాయి. అర్ష్‌దీప్ సింగ్ వేసిన చివరి ఓవర్లో 13 పరుగులొచ్చాయి. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ జట్టు 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. 6 ఫోర్లు, 4 సిక్సులతో 48 బంతుల్లో 89 పరుగులు చేసిన గిల్.. 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 8 బంతుల్లోనే 23 పరుగులు చేసిన రాహుల్ తెవాటియా నాటౌట్‌గా నిలిచారు. వీరిద్దరు కలిసి నాలుగో వికెట్‌కు అజేయంగా 14 బంతుల్లోనే 35 పరుగులు జోడించారు. చివరి 5 ఓవర్లలో గుజరాత్ కు 65 పరుగులొచ్చాయి. పంజాబ్ బౌలర్లలో రబాడ 2, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్ తలో వికెట్ తీశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
IPL 2024: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా మళ్లీ రోహిత్ శర్మ?
IPL 2024: డేంజర్ జోన్‌లో రిషబ్ పంత్.. మరొక తప్పు చేస్తే..
Updated Date - Apr 04 , 2024 | 09:44 PM