Hanuma Vihari: నిజమెంటో అందరికీ తెలియాలనే ఇలా చేశాను.. కీలక విషయాలు వెల్లడించిన విహారి
ABN, Publish Date - Feb 29 , 2024 | 06:22 PM
ఆంధ్రా క్రికెట్ జట్టు కెప్టెన్సీ నుంచి తనను తప్పించడంపై హనుమ విహారీ చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఓ రాజకీయ నాయకుడి కోరిక మేరకే రంజీ ట్రోఫీలో తనను కెప్టెన్సీ తప్పించారంటూ విహారీ సంచలన విషయాలు బయటపెట్టిన సంగతి తెలిసిందే.
ఆంధ్రా క్రికెట్ జట్టు కెప్టెన్సీ నుంచి తనను తప్పించడంపై హనుమ విహారీ చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఓ రాజకీయ నాయకుడి కోరిక మేరకే రంజీ ట్రోఫీలో తనను కెప్టెన్సీ తప్పించారంటూ విహారీ సంచలన విషయాలు బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌పై విహారీ విమర్శలు కూడా చేశాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో విహారీ చేసిన పోస్ట్ క్రీడా వర్గాల్లో పెను సంచలనం రేపింది. విహారి వ్యాఖ్యలపై ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కూడా ఎదురుదాడి చేసింది. దీంతో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ వంటి పలువురు రాజకీయ నాయకులు విహారీకి మద్దతుగా నిలిచారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌లో అధికార వైసీపీ నేతల పెత్తనం ఎక్కువైపోయిందంటూ బహిరంగంగా విమర్శలు చేశారు. ఈ వివాదంపై తాజాగా హనుమ విహారీ మరోసారి స్పందించాడు. ఈ క్రమంలో ఓ జాతీయ క్రీడా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విహారీ కీలక విషయాలు వెల్లడించాడు. అసలు ఏం జరిగిందో ప్రజలకు నిజం తెలియాల్సిన అవసరం ఉందని, అందుకే తాను పోస్ట్ పెట్టానని చెప్పాడు.
విహారీ మాట్లాడుతూ.. ‘‘డ్రెస్సింగ్ రూంలో ఉండకూడని 17వ నంబర్ ఆటగాడినై నేను అరిచాను. అయితే నేను అసభ్య పదజాలంతో తిట్టలేదు. నిబంధనల ప్రకారం అతను అక్కడ ఉండకూడదు. కానీ అతను దానిని తప్పుగా అర్థం చేసుకుని తన తండ్రికి ఫిర్యాదు చేశాడు. అక్కడి నుంచి అంతా తప్పుగా జరిగింది. నాపై ఫిర్యాదు చేశారు. అంతేకాదు నా వైపు నుంచి ఎలాంటి తప్పు లేకపోయినప్పటికీ నన్ను కెప్టెన్సీ నుంచి తొలగించారు. అయినప్పటికీ నేను జట్టు కోసం ఆడాను. ఎందుకంటే నేను ఆటను ప్రేమిస్తాను. ఆటను గౌరవిస్తాను. టోర్నీ ముగిసిన తర్వాత నేను ఒక పోస్ట్‌ను సోషల్ మీడియాలో పెట్టాను. ఎందుకంటే అసలు ఏం జరిగిందో ప్రజలందరికీ తెలియాలని నేను భావించాను. నన్ను కెప్టెన్సీ నుంచి తప్పించిన తొలగించిన ఘటన జరిగి రెండు నెలలైంది.ఇన్ని రోజులు నేను దానిని నా లోపలే దాచుకున్నాను. నేను చాలా కాలంగా ఆడుతున్న ఆటగాడిని కాబట్టి అది నాకు చాలా కష్టంగా అనిపించింది. నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. నేను అప్పుడు టోర్నీ, జట్టు గురించి మాత్రమే ఆలోచించాను. టోర్నీ ముగిసిన తర్వాత నేను నా కోసం నిలబడాలని అనుకున్నాను. లేకుంటే నన్ను నేను క్షమించుకోలేను.’’ అని చెప్పాడు. కాగా టీమిండియా తరఫున 16 టెస్టులాడిన హనుమ విహారీ 33 సగటుతో 839 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 5 హాఫ్ సెంచరీలున్నాయి. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 124 మ్యాచ్‌లాడి 51 సగటుతో 9,325 పరుగులు చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Feb 29 , 2024 | 06:30 PM