IND vs AUS: ఆస్ట్రేలియాతో సెకండ్ టెస్ట్.. రెండు కీలక మార్పులతో బరిలోకి భారత్
ABN, Publish Date - Dec 05 , 2024 | 01:11 PM
IND vs AUS: అడిలైడ్ ఫైట్‌కు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో పింక్ బాల్ టెస్ట్ మొదలవనుంది. తొలి టెస్ట్‌లో ఓడి కసి మీద ఉన్న ఆస్ట్రేలియా ఎలాగైనా బోణీ కొట్టాలని చూస్తోంది. సిరీస్ ఓపెనర్‌లో అద్భుత విజయం అందుకున్న టీమిండియా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది.
అడిలైడ్ ఫైట్‌కు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో పింక్ బాల్ టెస్ట్ మొదలవనుంది. తొలి టెస్ట్‌లో ఓడి కసి మీద ఉన్న ఆస్ట్రేలియా ఎలాగైనా బోణీ కొట్టాలని చూస్తోంది. సిరీస్ ఓపెనర్‌లో అద్భుత విజయం అందుకున్న టీమిండియా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. దీంతో ఈ మ్యాచ్ ఆద్యంతం ఆసక్తిగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. పెర్త్ టెస్ట్‌లో భారత్ చేతిలో ఘోర పరాభవంతో ఈ టెస్ట్‌ను సవాల్‌గా తీసుకుంటున్నారు కంగారూలు. అందుకు తగ్గట్లు టీమ్ సెలెక్షన్ నుంచి ప్రిపరేషన్స్ వరకు అంతా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. మెన్ ఇన్ బ్లూ కూడా తగ్గేదేలే అని ఘీంకరిస్తోంది. ఈ మ్యాచ్ కోసం మన జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో రెండు కీలక మార్పులు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అడిలైడ్‌లో భారత ప్లేయింగ్ ఎలా ఉండనుంది? అనేది ఇప్పుడు చూద్దాం..
ఆ ఇద్దరు ఔట్
పెర్త్ టెస్ట్‌లో ఆడిన వారినే టీమిండియా దాదాపుగా రిపీట్ చేయనుందని తెలుస్తోంది. అయితే టీమ్‌లో ఆ మ్యాచ్‌లో ఆడిన దేవ్‌దత్ పడిక్కల్, ధృవ్ జురెల్‌కు ఉద్వాసన పలకడం పక్కా అని సమాచారం. వారి స్థానాల్లో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ టీమ్‌లోకి రావడం ఖాయమనే చెప్పాలి. గత మ్యాచ్‌లో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ అడిలైడ్‌లోనూ ఓపెనింగ్ చేయడం కన్ఫర్మ్ అనే చెప్పాలి. హిట్‌మ్యాన్ ఎంట్రీ ఇస్తున్నా అతడు ఆ పొజిషన్‌లో ఆడటం కష్టమే. పెర్త్ టెస్ట్‌తో పాటు ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో మ్యాచ్‌లో రాహుల్ రాణించాడు. ఆ మ్యాచ్‌లో రోహిత్ విఫలమయ్యాడు. అతడు ఆసీస్ పిచ్‌లు, కండీషన్స్‌కు అలవాటు పడేందుకు కాస్త సమయం పట్టేలా ఉంది. కాబట్టి జైస్వాల్-రాహుల్ ఓపెనర్లుగా వస్తారు. వాళ్ల తర్వాత శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తారు.
మిడిలార్డర్‌లో రోహిత్..
మిడిలార్డర్ బాధ్యతల్ని రోహిత్ శర్మ చూసుకోనున్నాడు. ప్రెస్ మీట్‌లో హిట్‌మ్యాన్ దీనిపై హింట్ కూడా ఇచ్చాడు. మిడిలార్డర్‌లో ఏదో ఒక పొజిషన్‌లో తాను ఆడతానని తెలిపాడు. అతడికి తోడుగా వికెట్ కీపర్ రిషబ్ పంత్, పేస్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి మెరుపులు మెరిపించేందుకు రెడీగా ఉన్నారు. స్పిన్ ఆల్‌రౌండర్ కోటాలో వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగడం ఖాయం. పేస్ యూనిట్‌ను జస్‌ప్రీత్ బుమ్రా లీడ్ చేస్తాడు. బుమ్రాతో కలసి మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా కంగారూలను మరోసారి వణికించేందుకు సిద్ధమవుతున్నారు.
భారత జట్టు (అంచనా): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా.
Also Read:
13 ఏళ్లకే కోటీశ్వరుడైన వైభవ్ విధ్వంసం.. 76 పరుగులతో అజేయంగా..
నాలుగు గంటలు సాగినా.. ఫలితం తేలలేదు
గులాబీ టెస్ట్‌కు స్పోర్టింగ్ వికెట్
For More Sports And Telugu News
Updated Date - Dec 05 , 2024 | 01:16 PM