IND vs ENG: విధ్వంసకర డబుల్ సెంచరీతో యశస్వీ జైస్వాల్ బద్దలుకొట్టిన రికార్డులు ఇవే!
ABN, Publish Date - Feb 18 , 2024 | 02:35 PM
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ విశ్వరూపం చూపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన జైస్వాల్ డబుల్ సెంచరీతో పెను విధ్వంసం సృష్టించాడు.
రాజ్‌కోట్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ విశ్వరూపం చూపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన జైస్వాల్ డబుల్ సెంచరీతో పెను విధ్వంసం సృష్టించాడు. ఈ సిరీస్‌లో వరుస టెస్టుల్లో డబుల్ సెంచరీలు సాధించి చరిత్ర సృష్టించాడు. మూడో రోజు ఆటలో సెంచరీ అనంతరం గాయంతో మైదానాన్ని వీడిన జైస్వాల్.. కోలుకుని మరి నాలుగో రోజు బ్యాటింగ్ వచ్చి డబుల్ సెంచరీ బాదాడు. మొత్తంగా 236 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్ 14 ఫోర్లు, 12 సిక్సులతో 214 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తన విధ్వంసంకర డబుల్ సెంచరీతో 22 ఏళ్ల ఈ కుర్ర బ్యాటర్ అనేక రికార్డులను బద్దలుకొట్టాడు.
12- ఈ ఇన్నింగ్స్‌లో జైస్వాల్ ఒక్కడే 12 సిక్సులు కొట్టాడు. దీంతో అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్‌గా జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో పాకిస్థాన్ మాజీ ఆటగాడు వసీం అక్రమ్‌తో కలిసి సమంగా మొదటి స్థానంలో ఉన్నాడు. 1996లో జింబాబ్వేపై వసీం అక్రమ్ కూడా 12 సిక్సులుకొట్టాడు. అలాగే భారత్ తరఫున ఒక ఇన్నింగ్స్‌లో 10కిపైగా సిక్సులు కొట్టిన మొదటి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.
2- టెస్టుల్లో ఇంగ్లండ్‌పై రెండు డబుల్ సెంచరీలు సాధించిన మొదటి భారత బ్యాటర్‌గా జైస్వాల్ చరిత్ర సృష్టించాడు.
7- టెస్టుల్లో టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ చేసిన ఏడో బ్యాటర్‌గా జైస్వాల్ నిలిచాడు. అలాగే సెకండ్ ఇన్నింగ్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన నాలుగో భారత బ్యాటర్‌గా నిలిచాడు.
3- టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్‌లో హ్యాట్రిక్ సిక్సులు కొట్టిన ఆరో భారత బ్యాటర్‌గా జైస్వాల్ నిలిచాడు.
22- ఈ సిరీస్‌లో జైస్వాల్ ఇప్పటికే 22 సిక్సులు కొట్టాడు. దీంతో 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక సిరీస్‌లో అత్యధిక 20కి పైగా సిక్సులు కొట్టిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 19 సిక్సులు కొట్టిన రోహిత్ శర్మ రికార్డును బద్దలుకొట్టాడు.
12- ఈ ఇన్నింగ్స్‌లో కొట్టిన 12 సిక్సుల ద్వారా భారత్ తరఫున ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన భారత బ్యాటర్‌గా జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో ఎనిమిదేసి సిక్సుల చొప్పున కొట్టిన నవజ్యోత్ సింగ్ సిద్దు, మయాంక్ అగర్వాల్ రికార్డును బద్దలకొట్టాడు.
3- టెస్టుల్లో కెరీర్ ఆరంభంలో తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే 3 సార్లు 150+ స్కోర్లు సాధించిన రెండో బ్యాటర్‌గా జైస్వాల్ నిలిచాడు. జైస్వాల్ 13 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మార్కు అందుకోగా.. 10 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మార్కు అందుకున్న ఆస్ట్రేలియా ఆటగాడు నీల్ హార్వే ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు.
1- టెస్టు క్రికెట్‌లో 23 ఏళ్ల లోపు వయసులోనే అత్యధిక సార్లు 150+ స్కోర్ సాధించిన భారత బ్యాటర్‌గా జైస్వాల్ చరిత్ర సృష్టించాడు.
3- టెస్టుల్లో వరుస మ్యాచ్‌ల్లో రెండు డబుల్ సెంచరీలు బాదిన మూడో భారత బ్యాటర్‌గా జైస్వాల్ నిలిచాడు.
2- 22 ఏళ్ల వయసులోనే ఒక టెస్టు సిరీస్‌లో 500+ పరుగులు చేసిన రెండో భారత యువ బ్యాటర్‌గా జైస్వాల్ రికార్డు నెలకొల్పాడు. గతంలో సునీల్ గవాస్కర్ కూడా ఈ ఘనత సాధించాడు.
2- టెస్టుల్లో వేగంగా డబుల్ సెంచరీని పూర్తి చేసిన రెండో భారత బ్యాటర్‌గా జైస్వాల్ నిలిచాడు.
50- తన అంతర్జాతీయ కెరీర్‌లో జైస్వాల్ 29 ఇన్నింగ్స్‌ల్లోనే 50 సిక్సులను పూర్తి చేసుకున్నాడు.
ఇలాంటి మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Feb 18 , 2024 | 02:53 PM