IND vs ENG 5th Test: చివరి టెస్టులో యశస్వీ జైస్వాల్‌ను ఊరిస్తున్న 6 రికార్డులివే!
ABN, Publish Date - Mar 07 , 2024 | 12:50 PM
సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ దుమ్ములేపుతున్నాడు. రెండు డబుల్ సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలతో 90కి పైగా సగటుతో పరుగులు సాధించాడు.
సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ దుమ్ములేపుతున్నాడు. రెండు డబుల్ సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలతో 90కి పైగా సగటుతో పరుగులు సాధించాడు. టీమిండియా సిరీస్ గెలవడంలో జైస్వాల్ కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో జైస్వాల్ పలు రికార్డులను సైతం ఖాతాలో వేసుకున్నాడు. అయితే భారత్, ఇంగ్లండ్ మధ్య గురువారం నుంచి మొదలైన ఐదో టెస్టులో జైస్వాల్‌ను ఏకంగా 6 రికార్డులు ఊరిస్తున్నాయి. గత మ్యాచ్‌ల ఫామ్‌ను ఐదో టెస్టులోనూ కొనసాగిస్తే జైస్వాల్ ఈ రికార్డులను అందుకోవడం పెదగా కష్టమేమి కాకపోవచ్చు.
1. ఈ సిరీస్‌లో జైస్వాల్ ఇప్పటివరకు 655 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌తో ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లీతో కలిసి జైస్వాల్ సమంగా ఉన్నాడు. దీంతో ఐదో టెస్టులో జైస్వాల్ ఒక పరుగు సాధిస్తే విరాట్ కోహ్లీ రికార్డును బద్దలుకొడతాడు. ఇంగ్లండ్‌తో ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలుస్తాడు.
2. ఐదో టెస్టులో జైస్వాల్ 98 పరుగులు సాధిస్తే భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన ఓ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. ఈ క్రమంలో 1990లో 752 పరుగులు చేసిన ఇంగ్లండ్ బ్యాటర్ గ్రాహం గూచ్ రికార్డును జైస్వాల్ బద్దలుకొడతాడు.
3. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో జైస్వాల్ ఇప్పటివరకు 971 పరుగులు చేశాడు. మరొక 29 పరుగులు చేస్తే 1,000 పరుగులను పూర్తి చేసుకుంటాడు. ఐదో టెస్టు మ్యాచ్‌లో జైస్వాల్ ఈ మార్కును అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఐదో టెస్టులోనే జైస్వాల్ ఈ మార్కును అందుకుంటే టెస్టుల్లో వేగంగా 1,000 పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్‌గా నిలుస్తాడు. 14 ఇన్నింగ్స్‌ల్లో 1,000 పరుగులు చేసిన మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. కాగా జైస్వాల్ ఇప్పటికే 15 ఇన్నింగ్స్‌లు ఆడాడు.
4. చివరి టెస్టులో మరొక 120 పరుగులు చేస్తే ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆల్‌టైమ్ రికార్డును జైస్వాల్ బద్దలుకొడతాడు. కాగా 1970/71లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 774 పరుగులు చేసిన గవాస్కర్ ఒక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ సిరీస్‌లో జైస్వాల్ ఇప్పటివరకు 655 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
5. ఈ క్యాలెండర్ ఇయర్‌లో జైస్వాల్ ఇప్పటికే 23 సిక్సులు కొట్టాడు. మరొక 11 సిక్సులు కొడితే ఒక క్యాలెండర్ ఇయర్‌లో టెస్టుల్లో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఈ క్రమంలో 2014లో 33 సిక్సులు కొట్టిన న్యూజిలాండ్ మాజీ ఆటగాడు బ్రెండన్ మెకెల్లమ్ రికార్డును బద్దలుకొడతాడు.
6. ఈ సిరీస్‌లో జైస్వాల్ ఇప్పటికే రెండు సెంచరీలు కొట్టాడు. చివరి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు సాధిస్తే మాజీ ఆటగాళ్లు డాన్ బ్రాడ్‌మాన్, జార్జ్ హెడ్లీ రికార్డులను సమం చేస్తాడు. వీరిద్దరు గతంలో ఇంగ్లండ్‌పై 4 సెంచరీల చొప్పున కొట్టారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Mar 07 , 2024 | 01:20 PM