RCB vs RR: సెంచరీతో విరాట్ కోహ్లీ విధ్వంసం.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే..
ABN, Publish Date - Apr 06 , 2024 | 09:21 PM
కింగ్ విరాట్ కోహ్లీ అజేయ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ పరుగుల వరద పారించాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 184 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
జైపూర్: కింగ్ విరాట్ కోహ్లీ అజేయ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ పరుగుల వరద పారించాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 184 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. విరాట్ కోహ్లీ(113)కి తోడు ఫాప్ డుప్లిసెస్(44) కూడా రాణించాడు. దీంతో ఓపెనర్లిద్దరూ కలిసి ఆర్సీబీకి అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. అయితే మిడిలార్డర్ విఫలం కావడంతో రావాల్సిన దాని కన్నా తక్కువే పరుగులే వచ్చాయి. కీలక వికెట్లతో రాజస్థాన్ స్పిన్నర్ చాహల్(2/34) సత్తా చాటాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫాప్ డుప్లిసెస్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 125 పరుగుల సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆరంభంలో జాగ్రత్తగా ఆడిన వీరిద్దరు క్రీజులో కుదురుకున్నాక ధాటిగా బ్యాటింగ్ చేశారు. పవర్ ప్లే ముగిసే సమయానికి ఆర్సీబీ 53/0 పరుగులు చేసింది. బౌల్ట్ వేసిన 9వ ఓవర్‌లో డుప్లిసెస్ 2 సిక్సులు బాదడానికి తోడు మూడు సింగిల్స్ రావడంతో 15 పరుగులొచ్చాయి. 10 ఓవర్లు ముగిసే సమయానికి ఆర్సీబీ స్కోర్ 88/0గా ఉంది.
రియాన్ పరాగ్ వేసిన 11వ ఓవర్‌లో సిక్సు కొట్టి కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ 39 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ సీజన్‌లో కోహ్లీకి ఇది మూడో 50+ స్కోర్. ఈ క్రమంలో జట్టు స్కోర్ కూడా 100 పరుగులు దాటింది. ఈ భాగస్వామ్యాన్ని 13వ ఓవర్‌లో లెగ్ స్పిన్నర్ యజుర్వేంద్ర చాహల్ విడదీశాడు. 2 ఫోర్లు, 2 సిక్సులతో 33 బంతుల్లో 44 పరుగులు చేసిన డుప్లిసెస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో 125 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. బర్గర్ వేసిన ఆ తర్వాతి ఓవర్లోనే ఒకే ఒక్క పరుగు చేసి ఔటైన గ్లెన్ మ్యాక్స్‌వెల్ మరోసారి నిరాశపరిచాడు. దీంతో 128 పరుగులకు ఆర్సీబీ 2 వికెట్లు కోల్పోయింది. అనంతరం అరంగేట్ర బ్యాటర్ సౌరవ్ చౌహాన్‌తో కలిసి కోహ్లీ ఆర్సీబీ స్కోర్‌ను 150 పరుగులు దాటించాడు. మరోసారి చెలరేగిన చాహల్ 18వ ఓవర్‌లో సౌరవ్ చౌహాన్(9)ను సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేర్చాడు. అనంతరం బర్గర్ వేసిన 19వ ఓవర్ నాలుగో బంతికి సింగిల్ తీసిన విరాట్ కోహ్లీ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 9 ఫోర్లు, 4 సిక్సులతో 67 బంతుల్లో సెంచరీ చేశాడు.
RCB vs RR: చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ.. డేవిడ్ వార్నర్ రికార్డు బద్దలు
ఈ ఏడాది ఐపీఎల్‌లో ఇదే తొలి సెంచరీ. ఐపీఎల్ కెరీర్‌లో కోహ్లీకి ఇది 8వ సెంచరీ. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు ఇప్పటికే కోహ్లీ పేరు మీద ఉన్న సంగతి తెలిసిందే. మొత్తంగా టీ20 కెరీర్‌లో కోహ్లీకి ఇది 9వ సెంచరీ. ఆవేష్ ఖాన్ వేసిన చివరి ఓవర్లో విరాట్ కోహ్లీ 3 ఫోర్లు బాదడానికి తోడు రెండు సింగిల్స్ కూడా రావడంతో 14 పరుగులువచ్చాయి. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. చివరి 5 ఓవర్లలో 54 పరుగులొచ్చాయి. 12 ఫోర్లు, 4 సిక్సులతో 72 బంతుల్లో 113 పరుగులు చేసిన కోహ్లీ, 5 పరుగులు చేసిన గ్రీన్ నాటౌట్‌గా నిలిచారు. జైపూర్ బౌలర్లలో చాహల్ 2, బర్గర్ ఒక వికెట్ తీశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
SRH vs CSK: ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. సీఎస్కే ఓడిపోయిందని ఏకంగా..
SRH vs CSK: ధోని క్రీజులోకి రాకుండా కమిన్స్ వ్యూహం పన్నాడా..? అందుకే రివ్యూకు వెళ్లలేదా..?
Updated Date - Apr 06 , 2024 | 09:28 PM