Rohit Sharma: అలాంటి వారినే జట్టులోకి తీసుకుంటాం..రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు
ABN, Publish Date - Feb 27 , 2024 | 03:55 PM
ఇంగ్లండ్‌తో జరుగుతున్న 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా కైవసం చేసుకుంది. రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో యువ ఆటగాళ్ల ప్రదర్శనతో భారత జట్టు విజయాన్ని అందుకుంది.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా కైవసం చేసుకుంది. రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో యువ ఆటగాళ్ల ప్రదర్శనతో భారత జట్టు విజయాన్ని అందుకుంది. దీంతో ఐదో టెస్ట్ మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. విజయం అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా టీమిండియాలోకి ఎంపిక చేసే ఆటగాళ్ల విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో ఆడాలనే తపన ఉన్న వాళ్లకే మొదటి ప్రాధాన్యత ఇస్తామంటూ చెప్పుకొచ్చాడు. టెస్ట్ క్రికెట్ ఆడాలనే కసి లేని ఆటగాళ్లను పక్కనపెట్టేస్తామని అన్నాడు. కాగా టీమిండియా టెస్ట్ జట్టులోకి తిరిగి ఎంపిక కావాలంటే రంజీలు ఆడాలని ఇటీవల బీసీసీఐ కార్యదర్శి జైషా ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయినప్పటికీ జైషా ఆదేశాలను బేఖాతరు చేస్తూ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ రంజీల్లో ఆడడం లేదు. రక రకాల కారణాలు చెబుతూ తప్పించుకున్నారు. శ్రేయాస్ అయ్యరైతే తాను వెన్నునొప్పితో బాధపడుతున్నట్టు చెప్పాడు. కానీ అతను పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నట్టు ఏన్సీఏ క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో కిషన్, శ్రేయాస్ తీరుపై అంతటా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘టెస్ట్ క్రికెట్‌లో ఆడాలనే కసి ఎవరిలో అయితే ఉంటుందో వారికే అవకాశాలు ఇస్తాం. ఆ తపన లేని వాళ్లను పక్కనపెడతాం. ప్రస్తుతం జట్టులోని ఆటగాళ్లంతా టెస్ట్ క్రికెట్ ఆడాలనే కసితో ఉన్నారు. అందరూ ఆడాలనే ఆకలితో ఉన్నారు. టెస్టు క్రికెట్‌లో ఆడాలనే ఆకలి లేని వారెవరూ మా జట్టులో నాకు కనిపించడం లేదు. జట్టులో ఉన్నవారికి, లేని వారికి అందరికీ ఆడాలనే ఉంటుంది. కానీ టెస్ట్ క్రికెట్‌లో అవకాశాలు చాలా తక్కువగా వస్తాయి. వచ్చిన అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకున్న వారు మాత్రమే జట్టులో కొనసాగుతారు. అవకాశాలను ఉపయోగించుకోలేని వారు మాత్రమే చోటు కోల్పోతారు.’’ అని అన్నాడు.
కాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భారత యువ ఆటగాళ్లు అదరగొడుతున్నారు. యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురేల్ వచ్చిన అవకాశాలను చక్కగా ఉపయోగించుకున్నారు. ముఖ్యంగా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అద్భుతంగా ఆడి టీమిండియాను గెలిపించారు. టీమిండియా సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించారు. దీంతో రాంచీ టెస్ట్ మ్యాచ్ అనంతరం యువ ఆటగాళ్లపై కెప్టెన్ రోహిత్ ప్రశంసలు కురిపించాడు. ఇది చాలా కష్టతరమైన సిరీస్ అని పేర్కొన్న హిట్‌మ్యాన్ తమకు చాలా సవాళ్లు ఎదురైనట్టు చెప్పాడు. కానీ తాము సరిగ్గా ప్రతిస్పందించామని, కుర్రాళ్లు బాగా ఆడారని కొనియాడాడు. దేశీయ క్రికెట్‌లో రాణించిన కుర్రాళ్లే ఇక్కడ సత్తా చాటుతున్నారని పేర్కొన్నాడు. కొత్త ఆటగాళ్లకు తాము తరచుగా సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, వారు రాణించడానికి మంచి వాతావరణం ఉంటే చాలని రోహిత్ శర్మ చెప్పాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Feb 27 , 2024 | 03:55 PM