ICC Women's T20 World Cup: ఫైనల్ చేరెదెవరు.. న్యూజిలాండ్ చరిత్ర సృష్టిస్తుందా..
ABN, Publish Date - Oct 18 , 2024 | 02:48 PM
న్యూజిలాండ్ మరోసారి ఫైనల్స్ చేరి కప్ సాధించాలనే పట్టుదలతో ఉండగా.. ఫైనల్స్ చేరి రెండోసారి కప్ సొంతం చేసుకోవాలని వెస్టిండీస్ ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అనూహ్యంగా ఆస్ట్రేలియాను ఓడించిన దక్షిణాఫ్రికా..
మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా రెండో సెమీఫైనల్ మ్యాచ్ వెస్టిండీస్, న్యూజిలాండ్ మధ్య శుక్రవారం షార్జా వేదికగా జరగనుంది. రెండు సార్లు ఫైనల్స్ చేరినప్పటికీ కప్ గెలవని న్యూజిలాండ్ మరోసారి ఫైనల్స్ చేరి కప్ సాధించాలనే పట్టుదలతో ఉండగా.. ఫైనల్స్ చేరి రెండోసారి కప్ సొంతం చేసుకోవాలని వెస్టిండీస్ ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అనూహ్యంగా ఆస్ట్రేలియాను ఓడించిన దక్షిణాఫ్రికా ఫైనల్స్‌కు చేరింది. ఈరోజు జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు 20వ తేదీ ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టుతో తలపడనుంది. నేటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిచి ఫైనల్స్ చేరితే.. సౌతాఫ్రికా, కీవిస్ మహిళల జట్లు ఫైనల్స్ ఆడనున్నాయి. ఈ ఇద్దరిలో ఎవరు గెలిచినా తొలిసారి టీ20 మహిళల ప్రపంచకప్ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకోనున్నారు. ఇప్పటివరకు ఆస్ట్రేలియా 6 సార్లు, వెస్టిండీస్, ఇంగ్లాండ్ ఒకోసారి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్నాయి. న్యూజిలాండ్ రెండుసార్లు, దక్షిణాఫ్రికా ఒకసారి రన్నరప్‌గా నిలిచాయి.
తీవ్ర ఉత్కంఠ..
టీ20 మహిళల ప్రపంచకప్ ఫైనల్ చేరేదెవరనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్లలో ఎవరు ఆధిక్యం చూపుతారనే సస్పెన్స్ కు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. గ్రూప్ స్టేజ్ ఫినాలేలో ఇంగ్లాండ్ గెలుపును అనూహ్యంగా అడ్డుకున్న వెస్టిండీస్ సెమీస్‌లో గెలిచి ఫైనల్స్ చేరాలని పట్టుదలతో ఉంది. మహిళల టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో వెస్టిండీస్ తో న్యూజిలాండ్ మూడోసారి పోటీకి దిగనుంది. మరోవైపు న్యూజిలాండ్ సైతం గెలుపును ముద్దాడేందుకు ఉవ్విళ్లూరుతోంది. షార్జా పిచ్ ఈ జట్టుకు కొత్తకాకపోవడం, జట్టులో బలమైన ప్లేయర్లు ఉండటం న్యూజిలాండ్‌కు కలిసొచ్చే అంశాలుగా మారాయి. వెస్టిండీస్ టాప్ ఆర్డర్‌ను నమ్ముకుంది. టాప్ ఆర్డర్ విఫలమైతే మాత్రం ఆ జట్టు ఎక్కువ స్కోర్ చేయడంలోనూ, చేధనలోనూ విఫలమవుతోంది. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ ఓపెనర్లు ఇద్దరు ఆఫ్ సెంచరీలు చేయడంతో 142 పరుగుల లక్ష్యాన్ని 18 ఓవర్లలో చేధించింది.
అనూహ్యంగా..
టీ20 మహిళల ప్రపంచకప్‌లో మొదటినుంచి దూకుడు ప్రదర్శించిన ఆస్ట్రేలియా ఫైనల్స్ అవకాశాలను చేజార్చుకుంది. లీగ్ మ్యాచ్‌లో ఆధిప్యతాన్ని ప్రదర్శించిన ఆసీస్ సెమీస్‌కు చేరినప్పటికీ.. దక్షిణాఫ్రికా జట్టు కంగార్లకు ఝలక్ ఇచ్చింది. దీంతో ఆస్ట్రేలియా విజయపరంపరకు బ్రేక్ పడింది. వరుసగా మూడు సార్లు (2018, 2020, 2023)లో టీ20 మహిళల ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. 2024 కప్‌ను ఎవరు కైవసం చేసుకుంటారనే ఉత్కంఠకు మరో రెండు రోజుల్లో తెరపడనుంది. వెస్టిండీస్, న్యూజిలాండ్ మధ్య ఇవాల్టి సెమీఫైనల్స్‌లో గెలిచిన జట్టు దక్షిణాఫ్రికాతో టైటిల్ కోసం తలపడనుంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here
Updated Date - Oct 18 , 2024 | 02:48 PM