Share News

దంచేసి.. కూల్చేసి

ABN , Publish Date - May 06 , 2024 | 05:36 AM

సునీల్‌ నరైన్‌ (39 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 81, 1/22) సూపర్‌ షోతో.. వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్లేఆ్‌ఫ్సకు మరింత చేరువైంది. ఆదివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో..

దంచేసి.. కూల్చేసి

నేటి మ్యాచ్‌

ముంబై X హైదరాబాద్‌, రాత్రి 7.30 గం. వేదిక: ముంబై

టాప్‌ లేపిన కోల్‌కతా

నరైన్‌ మెరుపులు

చెలరేగిన చక్రవర్తి, హర్షిత్‌

98 పరుగులతో లఖ్‌నవూ చిత్తు

లఖ్‌నవూ: సునీల్‌ నరైన్‌ (39 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 81, 1/22) సూపర్‌ షోతో.. వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్లేఆ్‌ఫ్సకు మరింత చేరువైంది. ఆదివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో కోల్‌కతా 98 పరుగుల తేడాతో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ను చిత్తు చేసింది. మొత్తం 16 పాయింట్లతో టాప్‌లోకి దూసుకెళ్లింది. తొలుత కోల్‌కతా 20 ఓవర్లలో 235/6 స్కోరు చేసింది. సాల్ట్‌ (32), రఘువంశీ (32) రాణించారు. నవీనుల్‌ 3 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో లఖ్‌నవూ 16.1 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలింది. స్టొయినిస్‌ (36), రాహల్‌ (25) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. వరుణ్‌ చక్రవర్తి, హర్షిత్‌ రాణా చెరో 3 వికెట్లతో ప్రత్యర్థి బ్యాటింగ్‌ వెన్ను విరవగా.. రస్సెల్‌ 2 కీలక వికెట్లు పడగొట్టాడు. నరైన్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.


బ్యాట్లెత్తేశారు: బ్యాటర్ల వైఫల్యంతో లఖ్‌నవూ ఘోర ఓటమిని మూటగట్టుకొంది. కోల్‌కతా బౌలర్ల దెబ్బకు క్రమం తప్పకుండా వికెట్లను చేజార్చుకొన్న సూపర్‌ జెయింట్స్‌.. ఏదశలోనూ మ్యాచ్‌లోకి రాలేక పోయింది. ఓపెనర్‌ అర్షిన్‌ కులకర్ణి (9) స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా.. స్టొయినిస్‌ ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఓపెనర్‌ రాహుల్‌తో కలసి 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సిక్స్‌తో ఖాతా తెరిచిన స్టొయినిస్‌.. 4వ ఓవర్‌లో స్టార్క్‌ బౌలింగ్‌లో మూడు బౌండ్రీలు బాదాడు. ఆ తర్వాతి ఓవర్‌లో నరైన్‌ నాలుగు పరుగులే ఇవ్వగా.. హర్షిత్‌ బౌలింగ్‌లో స్టొయినిస్‌ మరో సిక్స్‌ కొట్టాడు. దీంతో పవర్‌ప్లేలో లఖ్‌నవూ 55/1తో మెరుగ్గానే కనిపించింది. కానీ, 15 పరుగుల తేడాతో రాహుల్‌, దీపక్‌ హుడా (5), స్టొయిని్‌సను కోల్పోయిన సూపర్‌ జెయింట్స్‌ 85/4తో ఒక్కసారిగా కష్టాల్లో పడింది. రాహుల్‌ను హర్షిత్‌ అవుట్‌ చేయగా.. హుడాను చక్రవర్తి వికెట్ల ముందు దొరకబుచ్చుకొన్నాడు. స్టొయినిస్‌, పూరన్‌ (10)న రస్సెల్‌ వెనక్కిపంపడంతో లఖ్‌నవూ పరాజయం దాదాపుగా ఖరారైంది. బదోని (15)ను నరైన్‌ అవుట్‌ చేయగా.. రెండు సిక్స్‌లు బాదిన టర్నర్‌ (16)ను చక్రవర్తి రిటర్న్‌ క్యాచ్‌తో వెనక్కిపంపాడు. క్రునాల్‌ పాండ్యా (5), యుధ్‌వీర్‌ (7), బిష్ణోయ్‌ (2) ఇలా వచ్చి అలా వెళ్లారు.


ఆరంభం అదిరింది: మరోసారి నరైన్‌ మెరుపులు మెరిపించడంతో కోల్‌కతా భారీ స్కోరు చేసింది. సాల్ట్‌తో కలసి తొలి వికెట్‌కు 26 బంతుల్లో 61 పరుగులు జోడించిన నరైన్‌.. రఘువంశీతో రెండో వికెట్‌కు 79 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన నైట్‌రైడర్స్‌కు ఓపెనర్లు సాల్ట్‌, నరైన్‌ అదిరే ఆరంభాన్నిచ్చారు. 3వ ఓవర్‌లో నవీనుల్‌ బౌలింగ్‌లో వీరిద్దరూ చెరో రెండు బౌండ్రీలతో బ్యాట్‌లకు పనిచెప్పారు. ఆ తర్వాతి ఓవర్‌లో మొహిసిన్‌ బౌలింగ్‌లో చెలరేగిన నరైన్‌ 4,4,4,6తో ఏకంగా 20 రన్స్‌ రాబట్టాడు. అయితే, సాల్ట్‌ను నవీనుల్‌ క్యాచవుట్‌ చేయడంతో.. రఘువంశీతో కలసి నరైన్‌ స్కోరు బోర్డును నడిపించాడు. దీంతో పవర్‌ప్లేలో కోల్‌కతా 70/1తో నిలిచింది. కాగా, 9వ ఓవర్‌లో రనౌట్‌ ప్రమాదాన్ని తప్పించుకొన్న రఘువంశీ సిక్స్‌లతో జట్టు స్కోరును సెంచరీ మార్క్‌ దాటించాడు. మరోవైపు అర్ధ శతకం పూర్తి చేసుకొన్న నరైన్‌.. స్టొయినిస్‌ వేసిన 11వ ఓవర్‌లో మూడు సిక్స్‌లతో మోత మోగించాడు. ఈ దశలో పూర్తిగా అటాకింగ్‌ గేమ్‌ ఆడుతున్న నరైన్‌ను అవుట్‌ చేసిన బిష్ణోయ్‌.. జట్టుకు ఊరటనిచ్చాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుగా వచ్చిన వచ్చిన రస్సెల్‌ (12)ను నవీనుల్‌ వెనక్కిపంపగా.. రఘువంశీని యుధ్‌వీర్‌ పెవిలియన్‌ చేర్చాడు. డెత్‌ ఓవర్లలో ధాటిగా ఆడతారనుకున్న రింకూ (16), కెప్టెన్‌ శ్రేయాస్‌ (23) జోరు చూపలేకపోయారు. ఆఖరి ఓవర్‌లో శ్రేయాస్‌ అవుటైనా.. రమణ్‌దీప్‌ (25 నాటౌట్‌) జట్టు స్కోరును 230 దాటించాడు.


స్కోరుబోర్డు

కోల్‌కతా: సాల్ట్‌ (సి) రాహుల్‌ (బి) నవీనుల్‌ 32, నరైన్‌ (సి/సబ్‌) పడిక్కళ్‌ (బి) బిష్ణోయ్‌ 81, రఘువంశీ (సి) రాహుల్‌ (బి) యుధ్‌వీర్‌ 32, రస్సెల్‌ (సి/సబ్‌) గౌతమ్‌ (బి) నవీనుల్‌ 12, రింకూ (సి) స్టొయినిస్‌ (బి) నవీనుల్‌ 16, శ్రేయాస్‌ (సి) రాహుల్‌ (బి) యశ్‌ 23, రమణ్‌దీప్‌ (నాటౌట్‌) 25, వెంకటేశ్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 20 ఓవర్లలో 235/6; వికెట్ల పతనం: 1-61, 2-140, 3-167, 4-171, 5-200, 6-224; బౌలింగ్‌: స్టొయినిస్‌ 2-0-29-0, మొహిసిన్‌ 2-0-28-0, నవీనుల్‌ హక్‌ 4-0-49-3, యశ్‌ ఠాకూర్‌ 4-0-46-1, క్రునాల్‌ 2-0-26-0, రవి బిష్ణోయ్‌ 4-0-33-1, యుధ్‌వీర్‌ 2-0-24-1.

లఖ్‌నవూ: రాహుల్‌ (సి) రమణ్‌దీప్‌ (బి) హర్షిత్‌ 25, అర్షిన్‌ (సి) రమణ్‌దీప్‌ (బి) స్టార్క్‌ 9, స్టొయినిస్‌ (సి) హర్షిత్‌ (బి) రస్సెల్‌ 36, దీపక్‌ హుడా (ఎల్బీ) వరుణ్‌ 5, పూరన్‌ (సి) సాల్ట్‌ (బి) రస్సెల్‌ 10, బదోని (సి) స్టార్క్‌ (బి) నరైన్‌ 15, టర్నర్‌ (సి అండ్‌ బి) వరుణ్‌ 16, క్రునాల్‌ (సి) సాల్ట్‌ (బి) హర్షిత్‌ 5, యుధ్‌వీర్‌ (సి) రస్సెల్‌ (బి) వరుణ్‌ 7, రవి బిష్ణోయ్‌ (ఎల్బీ) హర్షిత్‌ 2, నవీనుల్‌ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 16.1 ఓవర్లలో 137 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-20, 2-70, 3-77, 4-85, 5-101, 6-109, 7-125, 8-129, 9-137, 10-137; బౌలింగ్‌: వైభవ్‌ 2-0-21-0, స్టార్క్‌ 2-0-22-1, నరైన్‌ 4-0-22-1, హర్షిత్‌ రాణా 3.1-0-24-3, వరుణ్‌ చక్రవర్తి 3-0-30-3, రస్సెల్‌ 2-0-17-2.

పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

కోల్‌కతా 11 8 3 0 16 1.453

రాజస్థాన్‌ 10 8 2 0 16 0.622

చెన్నై 11 6 5 0 12 0.700

హైదరాబాద్‌ 10 6 4 0 12 0.072

లఖ్‌నవూ 11 6 5 0 12 -0.371

ఢిల్లీ 11 5 6 0 10 -0.442

బెంగళూరు 11 4 7 0 8 -0.049

పంజాబ్‌ 11 4 7 0 8 -0.187

గుజరాత్‌ 11 4 7 0 8 -1.320

ముంబై 11 3 8 0 6 -0.356

గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;

ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్‌ రన్‌రేట్‌

Updated Date - May 06 , 2024 | 05:36 AM