Test Match : బంగ్లా ఢమాల్
ABN, Publish Date - Sep 21 , 2024 | 04:13 AM
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తొలి రోజు బ్యాట్ పవర్ చూపగా.. రెండో రోజు తమ బంతి పదునేంటో రుచి చూపించింది. దీంతో శుక్రవారమే మ్యాచ్‌పై పట్టు బిగించింది.
చెలరేగిన పేసర్లు
బుమ్రాకు నాలుగు వికెట్లు
భారత్ తొలి ఇన్నింగ్స్ 376
రెండో ఇన్నింగ్స్ 81/3
ప్రస్తుత ఆధిక్యం 308
చెన్నై: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తొలి రోజు బ్యాట్ పవర్ చూపగా.. రెండో రోజు తమ బంతి పదునేంటో రుచి చూపించింది. దీంతో శుక్రవారమే మ్యాచ్‌పై పట్టు బిగించింది. ప్రస్తుతం రోహిత్ సేన 308 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. స్టార్ పేసర్ బుమ్రా (4/50) పేస్ ధాటికి పర్యాటక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 47.1 ఓవర్లలో కేవలం 149 పరుగులకే కుప్పకూలింది. బుమ్రాకు జతగా ఆకాశ్‌దీ్‌ప (2/19), సిరాజ్ (2/30), జడేజా (2/19) ప్రత్యర్థిని కట్టడి చేశారు. షకీబ్ (32), మెహిదీ హసన్ (29), లిట్టన్ దాస్ (22), కెప్టెన్ షంటో (20) మాత్రమే ఓ మాదిరిగా ఆడారు. అయితే 227 పరుగులు వెనుకబడిన బంగ్లాదేశ్‌ను ఫాలోఆన్ ఆడించకుండా భారత్ రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగి 81/3 స్కోరుతో కొనసాగుతోంది. కెప్టెన్ రోహిత్ (5), విరాట్ (17) మరోసారి నిరాశపర్చగా.. క్రీజులో గిల్ (33 బ్యాటిం గ్), పంత్ (12 బ్యాటింగ్) ఉన్నారు.
ఈ ఒక్క రోజే 17 వికెట్లు నేలకూలడం విశేషం. అంతకుముందు 339/6 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆరంభించిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగుల వద్ద ఆలౌటైంది. తొలి సెషన్ ఆరంభంలోనే రెండో కొత్త బంతి తీసుకున్న బంగ్లా బౌలర్లు మిగిలిన 4 వికెట్లను వేగంగా పడగొట్టారు. ఇందులో మూడింటిని టస్కిన్ తీయగా.. హసన్ వరుసగా రెండోసారి ఐదు వికెట్ల ఫీట్‌ను పూర్తి చేశాడు. ముందుగా జడేజా 86 రన్స్ వద్దే టస్కిన్‌కు చిక్కడంతో ఏడో వికెట్‌కు అశ్విన్‌తో 199 పరుగులు కీలక భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత టెయిలెండర్లు ఇలా వచ్చి అలా వెళ్లగా అశ్విన్ (113) తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు.
ఒకటిన్నర సెషన్‌లోనే..: రెండో రోజు భారత్‌ను త్వరగానే ఆలౌట్ చేశామనే సంతోషంతో బంగ్లా తొలి ఇన్నింగ్స్ ఆరంభించింది. అయితే భారత పేసర్ల ధాటికి వారి బ్యాటింగ్ ఆర్డర్ కకావికలమైంది. బుమ్రాకు తోడు సిరాజ్-ఆకాశ్‌దీ్‌ప చెలరేగడంతో బంగ్లా ఆట ఒకటిన్నర సెషన్‌లోనే ముగిసింది. స్పిన్నర్ జడేజా కీలక వికెట్లతో ఆకట్టుకున్నాడు. ముందుగా కళ్లు చెదిరే ఇన్‌స్వింగర్‌తో ఓపెనర్ షాద్‌మన్ ఇస్లాం (2)ను బుమ్రా బౌల్డ్ చేశాడు. అనంతరం వరుస ఓవర్లలో జకీర్ (3), మోమినుల్ (0)లను ఆకాశ్ పెవిలియన్‌కు చేర్చాడు. కెప్టెన్ షంటో కాసేపు క్రీజులో నిలిచినా సిరాజ్ ఓవర్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు. 40/5 స్కోరుతో బంగ్లా పరిస్థితి దయనీయంగా మారిన వేళ షకీబ్-లిట్టన్ ఆదుకున్నారు. వీరు ప్రమాదకరంగా మారుతున్న వేళ జడ్డూ వరుస ఓవర్లలో ఈ ఇద్దరినీ పెవిలియన్‌కు చేర్చడంతో బంగ్లా మరిక కోలుకోలేకపోయింది. టెయిలెండర్లను బుమ్రా చకచకా అవుట్ చేశాడు.
ఫాలోఆన్ ఎందుకు ఆడించలేదంటే..
బంగ్లాదేశ్ ఆలౌట్ అయ్యే సమయానికి 227 పరుగులు వెనుకంజలో ఉండడంతో భారత్ కచ్చితంగా ఆ జట్టును ఫాలో ఆన్ ఆడిస్తుందని భావించారు. కానీ రోహిత్ సేన మాత్రం రెండో ఇన్నింగ్స్ ఆడేందుకే మొగ్గు చూపింది. ఎందుకంటే..ప్రస్తుతం చెన్నైలో అధిక వేడితో పాటు తేమ ఎక్కువగా ఉంది. దీంతో వరుసగా తమ బౌలర్లను మరోసారి బౌలింగ్‌కు దించకుండా విశ్రాంతినివ్వాలని భావించింది. దీంతో బంగ్లా బౌలర్లు మాత్రం ఒకే రోజు రెండుసార్లు బౌలింగ్‌కు దిగాల్సి వచ్చింది. అంతేకాకుండా వేగంగా పరుగులు సాధించి బంగ్లా ముందు మరింత భారీ లక్ష్యం ఉంచి ఒత్తిడిలోకి నెట్టాలన్న ఆలోచనతోనూ టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది.
వాట్.. విరాట్?
తొలి ఇన్నింగ్స్‌లో ఆరు పరుగులే చేసిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రెండో ఇన్నింగ్స్‌లో 37 బంతుల్లో 17 పరుగులతో కాస్త కుదురుకున్నట్టే కనిపించాడు. కానీ అంపైర్ తప్పిదంతో తను ఎల్బీగా వెనుదిరగాల్సి వచ్చింది. అయితే విరాట్ మాత్రం ఈ అవుట్‌పై డీఆర్‌ఎ్‌సకు వెళ్లకపోవడం ఆశ్చర్చపరిచింది. ఎందుకంటే రీప్లేలో బంతి ప్యాడ్‌కన్నా ముందే స్పష్టంగా బ్యాట్‌ను తాకుతున్నట్టు తేలింది. విరాట్ నాన్‌స్ట్రయిక్ ఎండ్‌లో ఉన్న గిల్ అభిప్రాయాన్ని తీసుకుని పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. రీప్లేలో దీన్ని తిలకించిన కెప్టెన్ రోహిత్ కూడా ‘అరె.. అతడికేమైంది’ అన్నట్టుగా పక్కనున్న వారితో అసంతృప్తి వ్యక్తం చేశాడు.
షకీబ్ నోట్లో హెల్మెట్ స్ట్రాప్
షకీబ్ అల్ హసన్.. బ్యాటింగ్ సమయంలో తన హెల్మెట్ స్ట్రాప్‌ను నోట్లో పెట్టుకోవడం కాస్త వింతగా కనిపించింది. అయితే దీని వెనుక కారణాన్ని మాజీ కీపర్ దినేశ్ కార్తీక్ వెల్లడించాడు. బంతిని ఎదుర్కొనేటప్పుడు అతడి తల లెగ్ సైడ్‌కు వాలిపోకుండా.. నిటారుగా ఉంచేందుకే అలా చేస్తాడని తెలిపాడు. ఓసారి తమీమ్ ఇక్బాల్ ఈ విషయాన్ని డీకేకు చెప్పాడట. అలాగే స్పిన్నర్లను ఎదుర్కొనేటప్పుడు తల వాలిపోకుండా మెడ చుట్టూ క్లాత్‌ను చుట్టుకోవాలని తమ కోచ్ సూచించినట్టు ఓపెనర్ షాద్‌మన్ ఇస్లాం కూడా గతంలో చెప్పాడు.
స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) షాద్‌మన్ (బి) నహీద్ 56; రోహిత్ (సి) షంటో (బి) హసన్ 6; గిల్ (సి) లిట్టన్ (బి) హసన్ 0; విరాట్ (సి) లిట్టన్ (బి) హసన్ 6; పంత్ (సి) లిట్టన్ (బి) హసన్ 39; రాహుల్ (సి) జకీర్ (బి) మెహిదీ హసన్ 16; జడేజా (సి) లిట్టన్ దాస్ (బి) టస్కిన్ 86; అశ్విన్ (సి) షంటో (బి) టస్కిన్ 113; ఆకాశ్‌దీ్‌ప (సి) షంటో (బి) టస్కిన్ 17; బుమ్రా (సి) జకీర్ హసన్ (బి) హసన్ 7; సిరాజ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు: 30; మొత్తం: 91.2 ఓవర్లలో 376 ఆలౌట్. వికెట్ల పతనం: 1-14, 2-28, 3-34, 4-96, 5-144, 6-144, 7-343, 8-367, 9-374, 10-376. బౌలింగ్: టస్కిన్ 21-4-55-3; హసన్ మహమూద్ 22.2-4-83-5; నహీద్ 18-2-82-1; మెహిదీ హసన్ 21-2-77-1; షకీబ్ 8-0-50-0; మోమినుల్ హక్ 1-0-4-0.
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: షాద్‌మన్ (బి) బుమ్రా 2; జకీర్ హసన్ (బి) ఆకాశ్ దీప్ 3; షంటో (సి) విరాట్ (బి) సిరాజ్ 20; మోమినుల్ (బి) ఆకాశ్‌దీ్‌ప 0; ముష్ఫికర్ (సి) రాహుల్ (బి) బుమ్రా 8; షకీబ్ (సి) పంత్ (బి) జడేజా 32; లిట్టన్ (సి సబ్) జురెల్ (బి) జడేజా 22; మెహిదీ హసన్ (నాటౌట్) 27; హసన్ (సి) విరాట్ (బి) బుమ్రా 9; టస్కిన్ (బి) బుమ్రా 11; నహీద్ రాణా (బి) సిరాజ్ 11; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 47.1 ఓవర్లలో 149 ఆలౌట్. వికెట్ల పతనం: 1-2, 2-22, 3-22, 4-36, 5-40, 6-91, 7-92, 8-112, 9-130, 10-149. బౌలింగ్: బుమ్రా 11-1-50-4; సిరాజ్ 10.1-1-30-2; ఆకాశ్‌దీ్‌ప 5-0-19-2; అశ్విన్ 13-4-29-0; జడేజా 8-2-19-2.
భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) లిట్టన్ (బి) నహీద్ 10; రోహిత్ (సి) జకీర్ (బి) టస్కిన్ 5; గిల్ (బ్యాటింగ్) 33; విరాట్ (ఎల్బీ) మెహిదీ హసన్ 17; పంత్ (బ్యాటింగ్) 12; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 23 ఓవర్లలో 81/3. వికెట్ల పతనం: 1-15, 2-28, 3-67. బౌలింగ్: టస్కిన్ 3-0-17-1; హసన్ 5-1-12-0; నహీద్ 3-0-12-1; షకీబ్ 6-0-20-0; మెహిదీ హసన్ 6-0-16-1.
Updated Date - Sep 21 , 2024 | 04:13 AM