Technology: భారత ఎక్స్ యూజర్లకు.. ఎలాన్ మస్క్ షాక్..
ABN, Publish Date - Dec 23 , 2024 | 05:53 PM
ఎక్స్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్ చెప్పారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. భారత్‌లో ఎక్స్ ప్రీమియం ప్లాన్ ధరలు పెంచినట్లు ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఇప్పటికే కొత్త ధరల ప్రకారం ఎంత చెల్లించాలంటే..
ఎక్స్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్ చెప్పారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. భారత్‌లో ఎక్స్ ప్రీమియం ప్లాన్ ధరలు పెంచినట్లు ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఇప్పటికే కొత్త ధరల అమలులోకి వచ్చాయి. పెరిగిన ప్రీమియం ప్లాన్ ధరల ప్రకారం ఎంత చెల్లించాలంటే..
ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ సేవలు ఇప్పుడు ఇండియాలో మరింత ప్రియం కానున్నాయి. ఎక్స్ ప్రీమియం ప్లస్ ధరలను పెంచుతున్నట్లు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా దేశాల్లో ఎక్స్ ప్రీమియం ధరలు పెరగ్గా.. తాజాగా భారత్‌లోనూ పెంచుతున్నట్లు వెల్లడించారు. ధరలు పెంచేందుకు అనేక కారణాలున్నాయని అన్నారు. ఈ కొత్త ప్లాన్ ప్రకారం యూజర్లకు యాడ్ ఫ్రీ కంటెంట్ చూసే అవకాశం లభిస్తుంది. అలాగే కంటెంట్ క్రియేటర్లు మరింత డబ్బు సంపాదించుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. ప్రకటనలు ఎన్నిసార్లు చూశారు అనేదే కాకుండా ఏ కంటెంట్ ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు అనే దాన్ని పరిగణనలోకి తీసుకోబోతున్నారు. ఇంకా ఎన్నో సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి.
ఎలాన్ మస్క్ చెప్పిన ప్రకారం, ఈ కొత్త ధరలు డిసెంబర్ 21, 2024 నుంచే అమలులోకి వచ్చాయి. ఇప్పటికే ప్రీమియం ప్లస్ ప్లాన్ తీసుకున్నవారు తప్ప మిగిలినవారంతా కొత్త ధరల ప్రకారమే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇకనుంచి ప్రీమియం ప్లస్ ప్లాన్ సబ్‌స్క్రెబర్లు ప్రస్తుతం ఉన్న ధర కంటే 35 శాతం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.
ఎక్స్ ప్రీమియం ప్లస్ ప్లాన్ సబ్‌స్క్రెబర్లు ఇంతకు ముందు నెలకు రూ. 1,300 రుసుము చెల్లించేవారు. పెరిగిన ధరల ప్రకారం ఇప్పుడు ప్రతి నెలా రూ. 1,750 చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా, వార్షిక ప్రీమియం+ ధర కూడా రూ.13,600 నుంచి రూ.18,300కి పెరిగింది.
ఎక్స్ ప్రీమియం+ చందాదారులు అనేక ప్రయోజనాలను పొందుతారని ఎక్స్ వెల్లడించింది. యాడ్ ఫ్రీ కంటెంట్ సదుపాయంతో పాటు గ్రోక్ ఏఐ మోడల్ యాక్సెస్, 'రాడార్' వంటి సరికొత్త ఫీచర్లను యూజర్లు ఆస్వాదించవచ్చని ఎక్స్ వేదికగా తెలిపారు ఎలాన్ మస్క్.
Updated Date - Dec 23 , 2024 | 07:41 PM