HYD : 24 ఇళ్లు నేలమట్టం
ABN, Publish Date - Sep 23 , 2024 | 03:00 AM
గణేశ్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో రెండు వారాలపాటు కూల్చివేతలకు తాత్కాలిక విరామం ప్రకటించిన హైడ్రా.. తిరిగి తన పనిని మొదలుపెట్టింది. చెరువులు, ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాలపై మరోసారి కొరడా ఝుళిపించింది.
2 వారాల అనంతరం తిరిగి రంగంలోకి హైడ్రా
అమీన్‌పూర్‌లోని పటేల్‌గూడలో కూల్చివేత
కిష్టారెడ్డిపేటలో 3 బహుళ అంతస్తుల భవనాలు
ప్రభుత్వ భూమిలోని నిర్మాణాలపై చర్యలు
కూకట్‌పల్లి నల్లచెరువులో 16 షెడ్ల తొలగింపు
అధికారులతో బాధితుల వాగ్వాదం.. తీవ్ర ఆవేదన
నోటీసులు ఇచ్చాకే కూల్చివేస్తున్నాం: రంగనాథ్
హైదరాబాద్ సిటీ/హైదర్‌నగర్/పటాన్‌చెరు, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి):
గణేశ్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో రెండు వారాలపాటు కూల్చివేతలకు తాత్కాలిక విరామం ప్రకటించిన హైడ్రా.. తిరిగి తన పనిని మొదలుపెట్టింది. చెరువులు, ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాలపై మరోసారి కొరడా ఝుళిపించింది. ఏకకాలంలో కూకట్‌పల్లిలో, అమీన్‌పూర్ మునిసిపాలిటీలోని కిష్టారెడ్డిపేట, పటేల్‌గూడలో ప్రభుత్వ భూముల్లోని నిర్మాణాలను నేలమట్టం చేసింది. కూకట్‌పల్లి శాంతినగర్‌లోని నల్లచెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో, కిష్టారెడ్డిపేటలోని ఎకరంపైగా, పటేల్‌గూడలోని మూడు ఎకరాలకుపైగా విస్తీర్ణంలోని నిర్మాణాలను కూల్చివేసింది.
రెవెన్యూ, నీటి పారుదల, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో కలిసి హైడ్రా బృందం కూల్చివేతలు చేపట్టింది. మూడు ప్రాంతాల్లోని 8ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆక్రమణలు, భవనాలు తొలగించినట్టు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. అయితే తమ సామాన్లను కూడా తీసుకునే సమయం ఇవ్వకుండా నిర్మాణాలు నేలమట్టం చేశారని బాధితులు లబోదిబోమన్నారు. అప్పులు చేసి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే తాము హైడ్రా చర్యతో రూ.లక్షల్లో నష్టపోయి రోడ్డున పడ్డాయని ఆవేదన చెందారు.
కూకట్‌పల్లిలో 16 షెడ్లు నేలమట్టం..
ఎప్పటిలానే ఉదయం 5గంటలకే యంత్రాలతో సహా వివిధ విభాగాల అధికారులు, హైడ్రా బృందాలు ఆయా ప్రాంతాలకు చేరుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు ప్రారంభించారు. కూకట్‌పల్లి శాంతినగర్‌లోని నల్లచెరువు 27 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లోని దాదాపు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో కొందరు వ్యక్తులు షెడ్లు నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. కేటరింగ్ కోసం కిచెన్‌లు ఏర్పాటు చేశారు. ఇతరత్రా వ్యాపారాలూ సాగుతున్నాయి. వాటిలో పనిచేసే కార్మికులు ఉండేందుకు తాత్కాలిక నివాసాలు నిర్మించారు. ఫిర్యాదుల నేపథ్యంలో పలుమార్లు చెరువును పరిశీలించిన హైడ్రా అధికారులు.. నిర్మాణాలు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉన్నట్టు నిర్ధారణకు వచ్చారు.
సర్వే నంబర్లు 66, 67, 68, 69లోని 16 వాణిజ్య షెడ్లు, ప్రహరీ గోడలను నేలమట్టం చేశారు. ఇందులో ఐదు కేటరింగ్ షెడ్లు, మూడు ఫ్లెక్సీ ప్రింటింగ్ నిర్మాణాలు, రెండు టెంట్ హౌస్‌లు, ఆరు గోడౌన్లు ఉన్నాయి. ఒక టెంట్‌హౌ్‌సకు చెందిన గోడౌన్‌లో సామాను బయటకు తీయకుండానే నేలమట్టం చేశారు. కూల్చివేతలను ప్రారంభించగానే వ్యాపారులు, అక్కడ నివసించేవారు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
తమకు అన్యాయం చేయొద్దంటూ అధికారులకు మొర పెట్టుకున్నారు. అయితే అధికారులు వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తూనే కూల్చివేతలను కొనసాగించారు. కాగా, భారీ ఎత్తున కేటరింగ్ నిర్వహించే ఓ వ్యక్తి అక్కడే స్థిర నివాసం ఏర్పాటుచేసుకొని ఉంటున్నారు. కూల్చివేతల నేపథ్యంలో ఆయనతోపాటు కుటుంబ సభ్యులు రోదిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. హైడ్రా అధికారులు మాత్రం.. నివాసేతర నిర్మాణాలను మాత్రమే కూల్చామని చెప్పారు. చెరువు స్థలాన్ని చెరబట్టిన కొందరు వ్యక్తులు.. అక్కడ షెడ్లు వేసుకొని వ్యాపారం చేస్తున్న పలువురి నుంచి అద్దె వసూలు చేస్తున్నారని తెలిపారు.
కిష్టారెడ్డిపేటలో భవనాలు..
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మునిసిపాలిటీ పరిధిలోని కిష్టారెడ్డిపేట, పటేల్‌గూడ గ్రామాల్లో ప్రభుత్వ భూములను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా ఆదివారం కూల్చివేసింది. కిష్టారెడ్డిపేట గ్రామ పరిధిలో సర్వే నంబర్ 164లోని ప్రభుత్వ భూమిలో మూడు బహుళ అంతస్తుల భవనాలను హైడ్రా నేలమట్టం చేసింది. వీటిలో ఒకటి ఐదంతస్తుల భవనం కాగా, మరో రెండు భవనాలు నాలుగు అంతస్తులుగా నిర్మించారు. ఇవన్నీ నివాసేతర నిర్మాణాలు కాగా.. వీటిలో ఓ భవనాన్ని ఆస్పత్రి కోసం నిర్మించారు.
అమీన్‌పూర్ మునిసిపాలిటీలో ఇటీవలే విలీనమైన కిష్టారెడ్డిపేటలో గ్రామ పంచాయతీ అనుమతులతో ఈ భవనాల నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణాలపై గతంలోనే అనేకసార్లు ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ సర్వే నంబర్‌లో నిర్మిస్తున్న భవనాలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు అందినా అధికారులు పట్టించుకోలేదు. రెవెన్యూ సిబ్బంది ఇక్కడ పలుమార్లు సర్వేలు నిర్వహించి మూడు భారీ భవనాలు ప్రభుత్వ భూమిలో ఉన్నాయని తేల్చడంతో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. భవన యజమానులు తమవద్ద ఉన్న పత్రాలను, పంచాయతీ ఇచ్చిన అనుమతులను చూపించి కూల్చొద్దంటూ అధికారులను వేడుకున్నారు. పోలీసులు వారికి నచ్చచెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు.
వీటి కూల్చివేత ద్వారా దాదాపు ఎకరం స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్టు హైడ్రా అధికారులు తెలిపారు. మరోవైపు ఇటీవలే మునిసిపాలిటీలో విలీనమైన పటేల్‌గూడ పంచాయతీ పరిధిలోని బీఎ్‌సఆర్ కాలనీ పక్కన ప్రభుత్వ భూమిలో నిర్మించిన 24 వరుస ఇళ్లను కూల్చివేశారు. ప్రభుత్వ సర్వే నంబర్ విస్తరించి ఉన్న 12 సర్వే నంబర్ భూమి పక్కనే ఉన్న సర్వే నంబర్ 6లోని పట్టా భూమిలో బిల్డర్లు ఇళ్లను నిర్మించారు. సర్వేలో ప్రభుత్వ భూమి కబ్జా వ్యవహారం తేలడంతో హైడ్రా కూల్చివేతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో కొన్ని కుటుంబాలు నివాసం ఉంటుండగా వారికి హైడ్రా అధికారులు, పోలీసులు నచ్చజెప్పి ఖాళీ చేయించారు. కూల్చివేతల సమయంలో కొందరు భవనాల యజమానులు, బిల్డర్లు అధికారులతో వాగ్వాదానికి దిగారు.
కుటుంబమంతా రోడ్డున పడ్డాం
మహబూబ్‌నగర్ నుంచి ఏడాది క్రితం ఇక్కడకు వచ్చాం. స్థలాన్ని అద్దెకు తీసుకొని రూ.45 లక్షల పెట్టుబడితో షెడ్డు నిర్మించి కేటరింగ్ ప్రారంభించాం. స్వయం ఉపాధి పొందుతూ 50 మందికి ఉపాధి కల్పిస్తున్నాం. ఇప్పుడు నా కుటుంబంతో సహా అందరం రోడ్డున పడ్డాం. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? కనీసం నోటీసులిచ్చినా ఎక్కువ మొత్తంలో నష్టపోకుండా బయటపడేవాళ్లం. ఇప్పుడు భారీగా నష్టం చవిచూడాల్సి వచ్చింది.
- గాండ్ల రమేశ్
ఆత్మహత్యే శరణ్యం
సొంతంగా వ్యాపారం చేసి నిలదొక్కుకోవాలని వడ్డీకి తెచ్చిన రూ.కోటితో యంత్రం తీసుకువచ్చి ఫ్లెక్సీ ప్రింటింగ్ ప్రారంభించాం. చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉన్న విషయం మాకు తెలియదు. హైడ్రా అకస్మాత్తుగా వచ్చి నిర్మాణాన్ని నేలమట్టం చేసింది. ప్రింటింగ్ యంత్రం, కంప్యూటర్లను బయటకు తెచ్చుకునే సమయం కూడా ఇవ్వలేదు. ఈ స్థాయిలో నష్టం చేస్తారా? మాకు ఆత్మహత్యే శరణ్యం.
- రవికుమార్
ముందే సమాచారమిచ్చాం
నల్లచెరువు పక్కనున్న షెడ్ల యజమానులకు శనివారమే సమాచారమిచ్చాం. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మాణాలు ఉన్నాయని, యంత్రాలు, ఇతర సామగ్రి తొలగిస్తే కూల్చివేతలు చేపడతామని చెప్పాం. అయినా కొందరు పట్టించుకోలేదు. కూల్చివేతల సమయంలోనూ ఖాళీ చేయడం కంటే.. అడ్డుకోవడంపైనే వారు దృష్టి సారించారు. అందుకే కూల్చివేయాల్సి వచ్చింది. అవన్నీ నివాసేతర వినియోగాలు. భారీ స్థాయిలో కిచెన్‌లు ఏర్పాటుచేసి కేటరింగ్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఎక్కడైనా కూల్చివేతలు చేపట్టేముందు ఖాళీ చేయాలని ముందే సమాచారం ఇస్తున్నాం. ఇక్కడ కూడా అదే చేశాం.
- ఎ.వి.రంగనాథ్, హైడ్రా కమిషనర్
Updated Date - Sep 23 , 2024 | 03:00 AM