Telangana: తెలంగాణలో ఐపీఎస్‌ల బదిలీ.. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్
ABN, Publish Date - Sep 07 , 2024 | 02:05 PM
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి.. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఐఏఎస్, ఐపీఎస్ (IPS Officers) అధికారుల బదిలీలు భారీగానే జరుగుతున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున రాష్ట్రంలో బదిలీలు జరగ్గా తాజాగా మరోసారి బదిలీలు జరిగాయి. ఐదుగురు ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్‌ను రేవంత్ సర్కార్ నియమించింది...
హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి.. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఐఏఎస్, ఐపీఎస్ (IPS Officers) అధికారుల బదిలీలు భారీగానే జరుగుతున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున రాష్ట్రంలో బదిలీలు జరగ్గా తాజాగా మరోసారి బదిలీలు జరిగాయి. ఐదుగురు ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్‌ను రేవంత్ సర్కార్ నియమించింది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, ఏసీబీ డీజీగా విజయ్‌కుమార్, పోలీస్ పర్సనల్ అడిషనల్ డీజీగా మహేష్ భగవత్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇక పోలీస్ స్పోర్ట్స్ ఐజీగా ఎం. రమేష్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆనంద్.. రిటర్న్స్!
1991 బ్యాచ్ ఐపీఎస్‌కు చెందిన సీవీ ఆనంద్ పేరు.. తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు. ఇదివరకే ఒకసారి హైదరాబాద్ సిటీ కమిషనర్‌గా పనిచేశారు కూడా. ఇప్పుడు మళ్లీ సీవీ ఆనంద్‌కు బాధ్యతలు అప్పగిస్తూ శనివారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 డిసెంబర్-25 నుంచి 2022 అక్టోబర్-11 వరకూ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు. అయితే.. 2023 ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో బదిలీల్లో భాగంగా ఏసీబీ డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్‌కు సందీప్ శాండిల్య, కొత్తకోట శ్రీనివాస్‌లు సీపీలుగా పనిచేశారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత మళ్లీ ఆనంద్‌కే సీపీ బాధ్యతలు ఉంటాయని చాలా రోజులుగా టాక్ అయితే గట్టిగానే నడుస్తోంది. అనుకున్నట్లే.. సీవీనే హైదరాబాద్ సీపీ అయ్యారు. ఆనంద్ మళ్లీ సీపీ కావడంతో ఆయన అభిమానులు, ఫాలోవర్స్ ఎంతో హ్యాపీగా ఫీలవుతున్నారు. వెల్‌కమ్ సీవీ.. సీవీ ఆనంద్ రిటర్న్స్ అంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.
సీవీ మార్క్‌లు ఎన్నో..!
కాగా.. 1991 బ్యాచ్ ఐపీఎస్‌కు చెందిన సీవీ ఆనంద్ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ కేడర్‌కు వచ్చారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాలైన వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో తొలి పదేళ్లపాటు ఏఎస్పీగా, ఎస్పీగా పనిచేశారు. తెలంగాణలో మావోయిస్టుల ఏరివేతలో ఆనంద్ కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. ఈయన హయాంలో ఎన్నో ఎన్‌కౌంటర్లు జరగ్గా.. మావో కీలక నేతలు మరణించారు. 2002లో రాష్ట్రపతి గ్యాలంట్రీ మెడల్ కూడా దక్కించుకున్నారు. హైదరాబాద్ సిటీ ఈస్ట్, సెంట్రల్ జోన్ల డీసీపీగా మూడేళ్లు, విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్‌గా రెండేళ్లు, ట్రాఫిక్ కమిషనర్ హైదరాబాద్ సిటీలో 3న్నర ఏళ్లు, కమిషనర్‌గా కొన్నేళ ఏళ్ల మెట్రోపాలిటన్ అర్బన్ పోలీసింగ్‌లో పనిచేసిన అనుభవం ఉంది. 2001లో బషీర్‌బాగ్‌లో జరిగిన కరెంట్ ఆందోళనను చెదరగొట్టింది ఈయన నేతృత్వంలోనే. హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనాల కోసం సరికొత్తగా నంబరింగ్, కోడింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. హుస్సేన్‌సాగర్ సరస్సు, చుట్టుపక్కల మెరుగైన పోలీసింగ్‌ను తీసుకురావడానికి 2002 మేలో ‘లేక్ పోలీస్’ స్థాపించింది సీవీ ఆనందే. ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే ఆనంద్ మార్క్‌లు చాలానే ఉన్నాయి. ఈయన సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రాజధాని తెలంగాణలో పోలీసింగ్ వ్యవస్థ మొత్తాన్ని కట్టబెట్టింది.
Updated Date - Sep 07 , 2024 | 02:56 PM