Vikarabad : నా కుమారుడిని రక్షించండి ప్లీజ్!
ABN, Publish Date - Jun 26 , 2024 | 04:18 AM
మనస్పర్థల కారణంగా భర్త నుంచి భార్య విడిపోయినా కుమారుడి పట్ల ఆమెకున్న వాత్సల్యం ఆవిరవుతుందా? కన్నతల్లిననే సంగతి మరిచిపోయి చిన్నారికి చిత్రహింసలు పెడుతుందా?
బంగ్లాదేశ్‌లో కన్నతల్లే చిత్రహింసలు పెడుతోంది
వికారాబాద్ వాసి మొర.. బండి సంజయ్‌కు విజ్ఞాపన పత్రం
కరీంనగర్ క్రైం, జూన్ 25: మనస్పర్థల కారణంగా భర్త నుంచి భార్య విడిపోయినా కుమారుడి పట్ల ఆమెకున్న వాత్సల్యం ఆవిరవుతుందా? కన్నతల్లిననే సంగతి మరిచిపోయి చిన్నారికి చిత్రహింసలు పెడుతుందా? బంగ్లాదేశ్‌లో ఓ యువతి ఇదే ఉన్మాదం ప్రవర్తిస్తుంటే ఆ బాలుడి తండ్రి అయిన వికారాబాద్ జిల్లా వాసి మనసు తల్లడిల్లిపోతోంది. బాలుడికి చిత్రహింసలు పెడుతూ.. ఆ వీడియోలు భర్తకు పంపుతున్న ఆమె, డబ్బులు పంపితేనే చిన్నారిని భారత్‌కు పంపుతానంటూ బ్లాక్‌మెయిల్ చేస్తోంది. తన కుమారుడిని కన్నతల్లి చెర నుంచి విడిపించి..
బంగ్లాదేశ్ నుంచి సురక్షితంగా తన చెంతకు చేర్చాలని ఆ తండ్రి, కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను కలిసి విజ్ఞప్తి చేశాడు. మరోసారి కేంద్రమంత్రిని కలిసేందుకు కరీంనగర్‌కు వచ్చిన సందర్భంగా బాధితుడు ‘ఆంధ్రజ్యోతి’తో తన గోడును వెల్లబోసుకున్నాడు. బాధితుడి వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన తిరుపతి 2016లో ఉపాధి కోసం ముంబైకి వెళ్లాడు. అక్కడ మీరా రోడ్‌లో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసేవాడు.
అతడికి అక్కడే రియా అనే బంగ్లాదేశ్ అమ్మాయి పరిచయమైంది. కొంతకాలానికి వారు పెళ్లి చేసుకున్నారు. తిరుపతి-రియా దంపతులకు కుమారుడు విశాల్ (5) పుట్టాడు. కొన్నాళ్లకు మనస్పర్థలు ఏర్పడటంతో దంపతులు విడిపోయారు. విశాల్‌ను వెంటబెట్టుకొని తిరుపతి, ముంబై నుంచి సొంతూరుకు తిరొగొచ్చేశాడు. కొంతకాలానికి తిరుపతికి రియా నుంచి ఫోనొచ్చింది. తాను తిరిగి బంగ్లాదేశ్‌కు వెళ్తున్నానని, తనకు విశాల్‌ను చూడాలనిపిస్తోందని, ముంబైకి తీసుకొస్తే చూసి వెళ్లిపోతానని తిరుపతికి చెప్పింది. ఆమె మాటలు నమ్మి కుమారుడిని వెంటబెట్టుకొని తిరుపతి ముంబైకి వెళ్లాడు.
అక్కడ తిరుపతిపై దాడి చేసిన రియా, కుమారుడిని తీసుకొని బంగ్లాదేశ్ వెళ్లిపోయింది. ఈ ఘటనపై ముంబైలోని పోలీసులకు తిరుపతి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. కొన్నాళ్లకు.. రియా బంధువులు డబ్బులివ్వాలంటూ తిరుపతికి డిమాండ్ చేశారు. విశాల్‌కు చిత్రహింసలు పెడుతున్న వీడియోలు, ఫొటోలను వాట్సాప్ ద్వారా అతడికి పంపారు. డబ్బులిస్తేనే బాబును భారత్‌కు పంపుతామని, అప్పటిదాకా చిన్నారికి బాధలు తప్పవని అతడికి తేల్చి చెప్పారు. దిక్కుతోచని స్థితిలో పడిపోయిన తిరుపతి ఇటీవల కరీంనగర్‌కు వచ్చాడు. అక్కడ బండి సంజయ్‌ని కలిసి సమస్యను వివరించి.. విజ్ఞాపన పత్రం అందించాడు. బంగ్లాదేశ్‌లో ఉన్న కుమారుడిని క్షేమంగా తన చెంతకు చేర్చాలని బండి సంజయ్‌ను వేడుకున్నాడు
Updated Date - Jun 26 , 2024 | 04:18 AM