Hyderabad: మోర్త్ ఆర్వోగా కృష్ణప్రసాద్
ABN, Publish Date - Sep 24 , 2024 | 02:51 AM
జాతీయ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ(మోర్త్) తెలంగాణ రీజినల్(ఆర్వో) అధికారిగా ఏ. కృష్ణప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు.
హైదరాబాద్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): జాతీయ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ(మోర్త్) తెలంగాణ రీజినల్(ఆర్వో) అధికారిగా ఏ. కృష్ణప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సోమవారం సచివాలయంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న జాతీయ రహదారుల ప్రాజెక్టులు, పెండింగ్‌లో ఉన్న రోడ్ల విషయాలపై ఇరువురు కొద్దిసేపు చర్చించుకున్నారు. కాగా, కృష్ణప్రసాద్ 2017 నుంచి 2023 ఏప్రిల్ వరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) తెలంగాణ రీజినల్ అధికారిగా సేవలందించారు.
ఆ సమయంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టుల మంజూరులో చొరవ చూపించారు. ముఖ్యంగా రీజినల్ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) ప్రాజెక్టుకు ఆయన హయాంలోనే ఆమోదం లభించింది. ఖమ్మం- విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ హైవే, మంచిర్యాల - విజయవాడ హైవే పర్యావరణ అనుమతుల వ్యవహారాల్లో కృష్ణప్రసాద్ కీలకంగా వ్యవహరించారు. సూర్యాపేట - ఖమ్మం (365బిబి) నాలుగులేన్ల రోడ్డుతో పాటు మరో రెండు రోడ్లు కలుపుకుని రూ.10,764.69 కోట్ల విలువైన 335.45 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణాలు ఆయన నేతృత్వంలో పూర్తిచేశారు. ఆయన తన హయాంలో మొత్తంగా రాష్ట్రంలో దాదాపు 1,016 కిలోమీటర్ల మేర జాతీయ రోడ్ల నిర్మాణాలకు చొరవ చూపారు.
Updated Date - Sep 24 , 2024 | 02:51 AM