Hyderabad: హేమ రక్తనమూనాలో డ్రగ్స్ జాడ
ABN, Publish Date - May 24 , 2024 | 02:55 AM
‘అబ్బే నేనసలు బెంగళూరు రేవ్ పార్టీకి ఎప్పుడెళ్లాను? హైదరాబాద్‌లోనే ఉన్నాను’ అంటూ బుకాయించిన నటి హేమ అడ్డంగా దొరికిపోయింది. ఆమె, ఆమెతోపాటు మరో నటి ఆషీ రాయ్ సహా.. బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడినవారిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయ్యిందని పోలీసులు తెలిపారు.
మరో నటి ఆషి రాయ్ బ్లడ్ శాంపిల్‌లోనూ!
బెంగళూరు రేవ్ పార్టీకి హాజరైన 86 మంది రక్త నమూనాల్లో సైతం!
పరీక్షల్లో నిర్ధారణ అయిందన్న పోలీసులు
త్వరలో నోటీసులు!
బెంగళూరు, హైదరాబాద్ సిటీ, మే 23(ఆంధ్రజ్యోతి): ‘అబ్బే నేనసలు బెంగళూరు రేవ్ పార్టీకి ఎప్పుడెళ్లాను? హైదరాబాద్‌లోనే ఉన్నాను’ అంటూ బుకాయించిన నటి హేమ అడ్డంగా దొరికిపోయింది. ఆమె, ఆమెతోపాటు మరో నటి ఆషీ రాయ్ సహా.. బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడినవారిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయ్యిందని పోలీసులు తెలిపారు. వారందరి రక్తనమూనాలూ సేకరించి వైద్యపరీక్షలు చే యగా వాటిలో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్టు వెల్లడైందని పోలీసులు వెల్లడించారు. బెంగళూరు ఎలకా్ట్రనిక్ సిటీలోని జీఆర్ ఫాంహౌ్‌సలో ఆదివారం రేవ్ పార్టీలో పాల్గొన్న 103 మందిని సీసీబీ పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. పార్టీ జరిగిన ప్రాంతంలో ఎండీఎంఏ, కొకైన్, హైడ్రో గాంజాను కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న 103 మందిలో 73 మంది పురుషులు, 30 మంది మహిళలు ఉన్నారు. వారందరి రక్తనమూనాలను సేకరించి, ల్యాబ్‌కు పంపగా, వైద్య పరీక్షల ఫలితాలు గురువారం వచ్చాయి. పురుషుల్లో 59 మంది, మహిళల్లో 27 మంది డ్రగ్స్ తీసుకున్నారని పరీక్షల్లో తేలింది. ఆదివారం సాయంత్రం ప్రారంభమైన ఈ పార్టీలో 200 మందికిపైగా పాల్గొన్నట్లు సమాచారం.
వారిలో చాలామంది రాత్రి పదిగంటల తర్వాత వెళ్లిపోగా.. మిగిలినవారు అర్ధరాత్రి తర్వాత కూడా అక్కడే ఉన్నారు. రాత్రి 12 గంటలైనా డీజే మోతలతో ఆ ప్రాంతం దద్దరిల్లడంతో స్థానికులు హెబ్బగుడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు రేవ్‌పార్టీ జరుగుతున్నట్టు గుర్తించారు. టేబుళ్లపై డ్రగ్స్ ఉన్నట్లు అనుమానించి, సీసీబీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాత్రి 2 గంటల సమయంలో సీసీబీ బృందాలు అక్కడికి చేరుకుని డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నాయి. పట్టుబడిన 103 మందిని అక్కడే ఉంచి సోమవారం మధ్యాహ్నం వారందరి రక్తనమూనాలను సేకరించారు. డ్రగ్స్ వాడినట్లు నిర్ధారణ అయిన అందరికీ నోటీసులు ఇచ్చేందుకు సీసీబీ పోలీసులు సిద్ధమయ్యారు. బెంగళూరులో త్వరలో జరిగే విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఆదేశించనున్నట్లు సమాచారం. డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చిన వారిని ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద బాఽధితులుగా భావించి విచారించనట్లు సమాచారం. కాగా.. 2017 జూలైలో హైదరాబాద్‌లో జరిగిన డ్రగ్స్ కేసు విచారణ సందర్భంగా పలువురు సెలబ్రిటీలను విచారణకు పిలిచిన సంగతి తెలిసిందే. అప్పట్లో హేమ.. డ్రగ్స్ వాడకం అన్ని వర్గాల్లో ఉన్నా, కావాలనే మీడియా టాలీవుడ్‌ను టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. 2022 ఏప్రిల్‌లో రాడిసన్ బ్లూ హోటల్‌లో జరిగిన నైట్ పార్టీలోనూ డ్రగ్స్ వాడినట్టు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో కూడా హేమ పేరు ప్రస్తావనకు వచ్చింది. అయితే.. ఆ కేసుతో తనకు సంబంధం లేకున్నా తన పేరును ప్రచారం చేస్తున్నారంటూ ఆమె మీడియాపై మండిపడ్డారు. కొన్ని టీవీ చానళ్లపై బంజారాహిల్స్ ఠాణాలో ఫిర్యాదు చేశారు.
హేమ.. బయటపడ్డ డ్రామా..
బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ పేరు బయటకు రావడంతో ఆమె జాగ్రత్తపడింది. ఫామ్‌హౌ్‌సలో ఉన్న ఖాళీ స్థలంలోకి వెళ్లి నేను బెంగళూరు పార్టీలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ నేను హైదరాబాద్‌లోని ఫామ్‌హౌ్‌సలో చిల్ అవుతున్నానంటూ వీడియో విడుదల చేసింది. కానీ బెంగళూరు పోలీసులు ఆమె ఫొటోను విడుదల చేయడమే కాకుండా, ఆమె కృష్ణవేణి(అసలు పేరు)పేరుతో పార్టీకి వచ్చిందని ధృవీకరించారు. దర్యాప్తులో భాగంగా బెంగళూరు పోలీసులు నటి హేమ ప్రయాణించిన విమాన టికెట్లు సైతం సేకరించారు.
చెట్ల మధ్యలో డ్రగ్స్ తీసుకుని..
బెంగళూరులో నిర్వహించిన రేవ్ పార్టీకి సంబంధించి, బెంగళూరు సెంట్రల్ క్రైం పోలీసులు ఆధారాలు సేకరించారు. రేవ్ పార్టీని విజయవాడకు చెందిన లంకపల్లి వాసు ఆర్గనైజ్ చేశాడు. ఇందుకోసం పరిచయమున్న జె గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్‌ను వినియోగించుకున్నాడు. ఈ పార్టీకి బెంగళూరుతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పార్టీ ప్రియులను ఆహ్వానించాడు. హైదరాబాద్‌కు చెందిన పలువురు ఆ పార్టీకి వెళ్లారు. నిర్వాహకుడు వాసు పలువురు మోడల్స్‌ను కూడా బెంగళూరుకు తీసుకెళ్లాడు. పార్టీకి హాజరైన వారిలో కొందరు ఫామ్‌హౌ్‌సలోని చెట్ల మధ్యలో కూర్చుని ఎమ్‌డీఎమ్‌ఏ, కొకైన్ వంటి డ్రగ్స్ తీసుకున్నారు. వాటికి సంబంధించిన ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పార్టీ నిర్వాహకుడు వాసుతో పాటు మరో నలుగురు ఆర్గనైజర్లు, పార్టీకి డ్రగ్స్ సరఫరా చేసిన ముగ్గురు పెడ్లర్లను అరెస్ట్ చేశారు.
దుష్ప్రచారం చేస్తే.. లీగల్ యాక్షన్
‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’తో నటుడు శ్రీకాంత్
హైదరాబాద్ సిటీ, మే 23 (ఆంధ్రజ్యోతి): ఇటీవల బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్నవారిని వదిలిపెట్టవద్దని సినీనటులు శ్రీకాంత్ అన్నారు. గురువారం ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’తో మాట్లాడిన ఆయన.. ‘‘నిజంగా పార్టీలో నేనుంటే.. నాపై ఎలాంటి చర్యలు తీసుకున్నా సిద్ధమే’’ అని ఆయన స్పష్టం చేశారు. తనకు, ఆ రేవ్ పార్టీకీ ఎలాంటి సంబంధమూ లేదని తేల్చిచెప్పారు. తనపై దుష్ప్రచారం చేస్తే ఊరుకోనని.. అది మీడియా అయినా, బెంగళూరు పోలీసులైనా న్యాయపరంగా ముందుకు వెళ్తానని శ్రీకాంత్ హెచ్చరించారు.
Updated Date - May 24 , 2024 | 02:55 AM