ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సన్న ధాన్యం పక్కదారి

ABN, Publish Date - Dec 24 , 2024 | 11:05 PM

సన్నరకం ధాన్యం పక్కదారి పడుతోంది... ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరతోపాటు బోనస్‌ ప్రకటించినా రైతులు ప్రైవేట్‌కే మొగ్గు చూపుతున్నారు. తేమ శాతంతోపాటు వారు సూచించిన విధంగా బియ్యం గింజ పొడవు, మందం ఉంటేనే సన్నరకంగా పరిగణిస్తున్నారు. రైతులు గ్రామాలకు వచ్చిన వ్యాపారులకే విక్రయిస్తున్నారు. దీంతో రేషన్‌ షాపుల ద్వారా లబ్ధిదారులకు సన్న బియ్యం అందజేయాలనే ప్రభుత్వం నిర్ణయం ఆచరణ సాధ్యమయ్యేలా అగుపించడం లేదు.

మంచిర్యాల, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రేషన్‌ షాపుల ద్వారా లబ్ధిదారులకు సన్న బియ్యం అందజేయాలనే ప్రభుత్వ నిర్ణయం ఆచరణ సాధ్యమ య్యేలా కనిపించడం లేదు. కొనుగోలు కేంద్రాలకు ఆశించిన మేర సన్నరకం ధాన్యం రాకపోవడమే ఈ పరిస్థితికి కారణమవుతోంది. చౌక ధరల దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేసే ఉద్దేశ్యంతో ప్రభుత్వం సన్న వడ్లకు రూ.500 బోనస్‌ ప్రకటించింది. దీంతో ఈసారి రైతులు పెద్ద మొత్తంలో సన్న వడ్లు సాగు చేశారు. జిల్లాలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 1.60 లక్షల ఎకరాలకుగాను దాదాపు 80 శాతం అంటే 1.28 లక్షల ఎకరాల్లో సన్న రకాలు వేశారు. మిగతా 20 శాతం 32వేల ఎకరాల్లో మాత్రమే దొడ్డు వడ్లు పండించారు. తద్వారా 3.30 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. జిల్లాలో 3.26 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యం పెట్టుకున్నప్పటికీ సన్నాలు ఆశించిన స్థాయిలో సెంటర్లకు రావడం లేదని అధికారులు పేర్కొంటున్నారు.

సెంటర్లకు చేరింది 23 శాతమే...

జిల్లాలో ఇప్పటివరకు 317 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 41,307 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయగా, ఇందులో సన్నాలు 9,799 మెట్రిక్‌ టన్నులు మాత్రమే.

సన్నాలలో అత్యధికంగా జైశ్రీరాం సాగైనట్టు అధికా రులు చెప్తున్నారు. ప్రభుత్వం 33 రకాలను సన్నాలుగా గుర్తించి క్వింటాలుకు రూ.500 బోనస్‌ ప్రకటించింది. అయినప్పటికీ సన్న వడ్లు సెంటర్లకు రావడం లేదు. సాగు విస్తీర్ణాన్ని బట్టి చూస్తే దాదాపు 2.50 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్నాలు దిగుబడి రావాలి. జిల్లాలో 80 శాతం సన్నాలు సాగు చేస్తే, ఇప్పటి వరకు 23 శాతం ధాన్యం సెంటర్లకు రావడం గమనార్హం. మిగిలిన ధాన్యం రైస్‌మిల్లులు, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లింది.

ప్రైవేటులో అమ్మేందుకే మొగ్గు....

సన్నరకం ధాన్యం పండించిన రైతులు ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో కాకుండా రైస్‌మిల్లులు, వ్యాపారులకు అమ్ముకునేందుకే మొగ్గు చూపుతున్నారు. ప్రైవేట్‌లో మాయిశ్చర్‌, క్వాలిటీ వంటివి పట్టించుకోకుండా రైతుల దగ్గరికే వెళ్లి కాంటా వేస్తున్నారు. డబ్బులు కూడా వెంటనే చెల్లిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో అమ్మాలంటే ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. 17 శాతం తేమతోపాటు తప్ప, తాలు, మట్టి లేకుండా వడ్లను శుభ్రం చేయాలి. సెంటర్లలో ధాన్యం కుప్పలు పోసి కాంటా కోసం రోజుల తరబడి పడిగాపులు కాయాలి. ఆ తర్వాత మిల్లుకు తరలించే వరకు రైతులదే బాధ్యత. మిల్లుల్లో బస్తాకు ఒకటి రెండు కిలోలు కోతలు తప్పవు. ట్రాన్స్‌పోర్ట్‌, హమాలీ చార్జీలు రైతులే భరించాల్సి ఉంటుంది. ఇన్ని ఇబ్బందులు పడి సెంటర్లలో అమ్ముకోవడం కంటే.. పంట కోసిన వెంటనే వ్యాపారులకు విక్రయించడమే మేలనే భావనలో రైతులు ఉన్నారు. పైగా ప్రభుత్వ మద్దతు ధరతో పోల్చితే ప్రైవేట్‌లో అంతకంటే ఎక్కువే గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారు.

ప్రభుత్వ మద్దతు ధర ఏ- గ్రేడ్‌ రకానికి రూ.2,320, బోనస్‌ రూ.500తో కలిపి రూ. 2,820 వస్తుంది. మిల్లర్లు, వ్యాపారులు జైశ్రీరాం, తదితర రకాలకు క్వింటాలుకు రూ. 3వేల పైనే చెల్లిస్తున్నారు. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో సన్న రకాలను గ్రేన్‌ క్యాలిపర్‌ పరికరంతో బియ్యంగా మార్చి పరిశీలిస్తున్నారు. బియ్యం గింజ పొడవు 6 మిల్లీమీటర్లు, మందం 2.5 మిల్లీమీటర్లు ఉంటేనే సన్నాలుగా పరిగణిస్తున్నారు. జిల్లాలో పండించిన చాలా వెరైటీలు వారు సూచించిన విధంగా లేకపోవడంతో సన్నాలుగా గుర్తించడం లేదు. దీంతో రూ.500 బోనస్‌ కోల్పోవలసి వస్తోంది. ఈ కారణంగా కూడా రైతులు ప్రైవేటు వైపు మొగ్గు చూపుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు సన్నరకం రాకపోవడంతో రేషన్‌ షాపుల్లో లబ్ధిదారులకు సన్న బియ్యం ఎలా పంపిణీ చేయాలనే సమస్య ఉత్పన్నమవుతోంది.

Updated Date - Dec 24 , 2024 | 11:05 PM