ప్రాణహిత-చేవెళ్లపై చిగురిస్తున్న ఆశలు
ABN, Publish Date - Dec 23 , 2024 | 11:03 PM
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కంటే తుమ్మిడిహెట్టి బ్యారేజీ ద్వారానే తక్కువ ఖర్చుతో గోదావరి జలాలను ఎత్తిపోయవచ్చని ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ పేర్కొంటుంది. అందుకు అనుగుణంగా ఆ ప్రాజెక్టును నిర్మించేందుకు అడుగులు వేస్తోంది. ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై బ్యారేజీ నిర్మించేందుకు సన్నాహాలను ప్రారంభించింది.
మంచిర్యాల, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కంటే తుమ్మిడిహెట్టి బ్యారేజీ ద్వారానే తక్కువ ఖర్చుతో గోదావరి జలాలను ఎత్తిపోయవచ్చని ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ పేర్కొంటుంది. అందుకు అనుగుణంగా ఆ ప్రాజెక్టును నిర్మించేందుకు అడుగులు వేస్తోంది. ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై బ్యారేజీ నిర్మించేందుకు సన్నాహాలను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు నిర్మించడం ద్వారా ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేయనున్నట్లు ఇటీవల పెద్దపల్లిలో జరిగిన బహిరంగ సభలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. దీంతో తుమ్మిడిహెట్టిపై ఆశలు చిగురిస్తున్నాయి. తుమ్మిడిహెట్టిపై కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ గతంలో చేసిన సర్వే ఫలితాలను పునః పరిశీలన చేయించే పనిలో రాష్ట్ర ప్రభుత్వం పడింది. ఆ ఫలితాల ఆధారంగా డీపీఆర్‌కు తుదిరూపు ఇచ్చి, అను మతుల కోసం కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ)లో దాఖలు చేయనుంది. గతంలో తుమ్మిడి హెట్టి నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించాలని ప్రతిపా దించగా తాజాగా గ్రావిటీతో సుందిళ్ల బ్యారేజీకి నీటిని తరలించాలనే కొత్త ప్రతిపాదనను ప్రభుత్వం తెరమీదకి తెచ్చింది.
తుమ్మిడిహెట్టి బ్యారేజీ ప్రతిపాదిత ప్రాంతం నుంచి 71.5 కిలోమీటర్ల వరకు కాలువల నిర్మాణం కూడా గతంలోనే పూర్తయింది. ఇక బ్యారేజీ నిర్మాణమే తరు వాయి అనే పరిస్థితిలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హఠాత్తుగా ప్రాజెక్టును రద్దు చేసింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్లు బ్యారేజీ నిర్మాణం జరిగితే తుమ్మిడిహెట్టి నుంచి నెన్నెల మండలం మైలారం గ్రామం వరకు 71.5 కిలోమీటర్ల దూరం మోటార్లు లేకుండా నీరు గ్రావిటీతో రానుంది. అక్కడ నుంచి తక్కువ సామర్థ్యం కలిగిన పంపుల ద్వారా ఎల్లంపల్లికి నీటిని తరలించవచ్చని గతంలో ప్రతిపాదించారు.
మహారాష్ట్ర అభ్యంతరాలతో....
ఉమ్మడి రాష్ట్రంలో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును 152 మీటర్ల ఎత్తుతో కట్టాలని ప్రతిపాదించగా ముంపు అధికంగా ఉంటుందనే మహారాష్ట్ర అభ్యంతరాలతో పక్కన పెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 148 టీఎంసీ సామర్థ్యంతో ప్రాజెక్టును కడతామని అప్పటి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌తో నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారు. దీనికి మహారాష్ట్ర అంగీకారం తెలుపుతూ సంతకాలు చేసింది. కాళేశ్వరంతో పాటే తుమ్మిడిహెట్టిని కడతామని కేసీఆర్ ప్రకటించారు. తర్వాత తుమ్మిడిహెట్టి కాలగర్భంలో కలిసిపోయింది. వన్యప్రాణుల అభయారణ్యం, సాంకేతిక అంశాలు, నీటి లభ్యత లేదనే కారణాలతో ప్రాజెక్టును పక్కనబెట్టారు. తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల నీటి లభ్యత ఉందని ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన సర్వేలో తేల్చారు. గోదావరి, కృష్ణ, తదితర అన్ని నదుల్లో సహజంగా జూన్ నుంచి నవంబరు వరకే వరద ఉంటుంది. ప్రాణహితలో మాత్రం ఫిబ్రవరిలో కూడా 10 వేల క్యూసెక్కుల దాకా ప్రవాహం ఉంటుంది. దీంతో తుమ్మిడిహెట్టి వైపే కాంగ్రెస్ ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఇదిలా ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ తుది నివేదిక ఆధారంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై నిర్ణయం తీసుకోవాలని యోచి స్తోంది. ఆయా బ్యారేజీల పునరుద్ధరణ, వాటిలో ఎంత నీటిని నిల్వ చేయాలి..? ప్రాజెక్టుల నిర్వహణ, తదితర అంశాల్లో ఎన్డీఎస్ఏ సూచనలను పాటించాలని భావిస్తోంది.
సుందిళ్లపైనే ఆశలు...
తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీతో సుందిళ్ల బ్యారేజీలోకి నీటిని పంపించవచ్చని అధికారులు తాజాగా అభిప్రాయా నికి వచ్చారు. నెన్నెల మండలంలోని మైలారం వద్ద పంప్‌హౌస్ కట్టి ఎల్లంపల్లిలో నీటిని ఎత్తిపోయాలా..? లేక సుందిళ్లకు గ్రావిటీతో తరలించి, దాని పైనే ఉన్న ఎల్లంపల్లికి ఎత్తిపోయాలా..? అనే దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. మైలారం గ్రామం వద్ద తవ్విన కాల్వలు, పైప్లైన్ల ద్వారా నీటిని సహజ సిద్ధంగా ప్రవహించే జైపూర్‌లోని రసూల్‌పల్లె వాగులో కలపడం ద్వారా అక్కడి నుంచి గోదావరిలోకి గ్రావిటీ ద్వారా తరలించే సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. గోదావరి నీటిని సుందిళ్ల బ్యారేజీకి తరలించి, అక్కడి నుంచి నేరుగా ఎగువన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి తక్కువ ఖర్చుతో పంపింగ్ చేసే యోచనలో ప్రభుత్వ యంత్రాం గం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విధానంలో కాళేశ్వరం ప్రాజెక్టుల సముదాయంలోని మిగతా బ్యారేజీలతో పని లేకుండానే ఎగువకు నీరు తరలించే ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.
Updated Date - Dec 23 , 2024 | 11:03 PM