నేడు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం
ABN, Publish Date - Dec 22 , 2024 | 10:30 PM
సింగరేణి దేశ పారిశ్రామిక రంగానికి ఇంధన వనరు.. తెలంగాణ రాష్ట్రానికి సిరుల మాగాణి... సింగరేణి... వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా మరెన్నో కుటుంబాలకు ఉపాధి కల్పించే కల్పవల్లి. బొగ్గు ఉత్పత్తితోపాటు విద్యుత్ ఉత్పత్తి చేసి రాష్ట్ర రైతాంగానికి, పారిశ్రామిక రంగానికి దన్నుగా నిలుస్తోంది... సోమవారం సింగరేణి ఆవిర్భావ వేడుకలను జరుపుకునేందుకు కార్మికలోకం సిద్ధమైంది...
మంచిర్యాల, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): బొగ్గు ఉత్పత్తిలో రారాజు సింగరేణి. యేటేటా తన కార్యకలా పాలను విస్తరిస్తున్న సింగరేణి నూతన ఆవిష్కరణలతో ముందుకు సాగుతోంది. ‘ద హైద్రాబాద్ (దక్కన్) కంపెనీ లిమిటెడ్’గా పిలవబడే సంస్థ తొలిసారిగా 1889లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించగా 1920 డిసెంబరు 23న సింగరేణి కాలరీస్ లిమిటెడ్‌గా అవతరించింది. దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వరంగ సంస్థగా సింగరేణి పేరు, ప్రఖ్యాతులు గడించింది.
నూతన ఆవిష్కరణలతో...
135 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రగల సింగరేణి సంస్థ ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలతో ముందుకు సాగుతోంది. బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న సంస్థ కాలక్రమేణ తన కార్యకలాపాలను విస్తరించడం ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తి రంగంలో అడుగిడింది. పర్యావరణహిత, వ్యాపార విస్తరణ చర్యలో భాగంగా సింగరేణి వ్యాప్తంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తికి నాంది పలికింది. అంతేగాక థర్మల్, సోలార్, పంప్‌డ్ స్టోరేజీ, జియో థర్మల్ ప్రాజెక్టుల ఏర్పాటు, గ్రీన్‌హైడ్రోజన్, అమ్మోనియం నైట్రేట్ తయారీ, కార్బన్ డై యాక్సైడ్ నుంచి మిథనాల్ ఉత్పత్తికి చర్యలు చేపడుతోంది. కంపెనీ సుస్థిర అభివృద్ధికి నూతన ప్రాజెక్టుల సాధనకు యాజమాన్యం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా వివిధ ఏరియాలలో నూతన గనుల ఏర్పాటుకు అనుమతులు సైతం సాధించింది.
రూ. 37,50 కోట్ల టర్నోవర్.....
సింగరేణి చరిత్రలోనే అత్యధిక బొగ్గు ఉత్పత్తి, రవాణా, టర్నోవర్ సాధించి అగ్రగామిగా నిలిచింది. సంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరంలో నిర్ధేశిత 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించి 70.02 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించింది. గత ఐదేళ్లలో నిర్ధేశించిన లక్ష్యాలను సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. అలాగే బొగ్గు రవాణాలో అత్యధికంగా 69.86 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని సాధించి రికార్డు సృష్టిం చింది. సంస్థ చరిత్రలోనే అత్యధికంగా 37,500 కోట్ల టర్నోవర్‌ను సాధించడం ద్వారా రూ. 4701 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
కార్మికులకు తొలిసారిగా అత్యధిక లాభాల వాటా....
సింగరేణి చరిత్రలోనే ఈ ఏడాది కార్మికులకు అత్యధిక లాభాలా వాటా పంపిణి చేసింది. సంస్థ ఆర్జించిన లాభాల్లో రూ. 796 కోట్లను కార్మికులకు వాటాగా పంపిణీ చేసింది. అలాగే కంపెనీలో పని చేస్తున్న పొరుగు సేవల సిబ్బందిని గుర్తిస్తూ తొలిసారిగా వారికి కూడా లాభాల వాటా కింద రూ.5 వేల చొప్పున చెల్లించేందుకు నిర్ణయం తీసుకోవడం ద్వారా సింగరేణి వ్యాప్తంగా 30వేల మంది కుటుంబాల్లో ఆనందాన్ని నింపింది. దీపావళి బోనస్‌లోనూ గతేడాదితో పోల్చితే రూ.50 కోట్లు అదనంగా కార్మికులకు చెల్లించింది. దీపావళి బోనస్ కింద ఒక్కో కార్మికుని రూ. 93,750 చెల్లించింది. మొత్తంగా రూ. 358 కోట్లను దీపావళి బోనస్ కింద కార్మికుల ఖతాల్లో జమ చేసింది.
నైనీ బొగ్గు ఉత్పత్తికి శ్రీకారం....
తెలంగాణ మాదిరిగా ఇతర రాష్ట్రాల్లోనూ సింగరేణి బొగ్గు ఉత్పత్తికి శ్రీకారం చుడుతోంది. ఒడిశాలోని నైనీ ప్రాంతంలో ఈ ఏడాది బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యంతో యాజమాన్యం ముందడుగు వేస్తోంది. నైనీ బొగ్గు బ్లాక్‌లో ఉత్పత్తికి జూలై 12న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క....ఒడిశా ముఖ్యమంత్రితో సమావేశమై బొగ్గు ఉత్పత్తిపై చర్చించగా సానుకూల స్పందన లభించింది. నైనీ బ్లాక్‌కు ఇప్పటికే అవసరమైన అనుమతులు, భూ కేటాయింపు ప్రక్రియ పూర్తికాగా త్వరలో ఉత్పత్తి ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
40వేల మంది కార్మికులతో...
గతంలో లక్షా 16 వేల కార్మికులతో కళకళలాడిన సింగరేణి సంస్థ ప్రస్తుతం కార్మికులను తగ్గించే పనిలో నిమగ్నమైంది. సింగరేణి వ్యాప్తంగా ఉన్న సింగరేణి కార్మికుల సంఖ్య ప్రస్తుతం 40 వేలకు పడిపోయింది. బొగ్గు లక్ష్యాలు పెరుగుతున్నప్పటికీ ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ, ఔట్‌సోర్సింగ్ ఫలితంగా కార్మికుల సంఖ్యను క్రమంగా కుదిస్తూ వస్తోంది. పర్మినెంట్ కార్మికుల స్థానంలో బొగ్గు బావుల్లో సుమారు రెండున్నర లక్షలకు పైగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులతో పనులు చేయిస్తున్నారు. కొత్త గనులు ప్రారంభించడం ద్వారా ఉద్యోగవకాశాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తద్వారా కార్మికుల సంఖ్యను పెంచుతూ గత చరిత్ర పునరావృతం కోసం పాటుపడాలని కార్మిక కుటుంబాలు కోరుతున్నాయి.
Updated Date - Dec 22 , 2024 | 10:30 PM