ఆదివాసీల కోసం సివిల్స్‌కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయండి
ABN, Publish Date - Dec 22 , 2024 | 04:40 AM
ఆదివాసీ విద్యార్థుల కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సివిల్స్ కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలంటూ సీఎం రేవంత్‌రెడ్డిని ఆదివాసీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోరారు.
జిల్లాల్లో స్టడీ సర్కిళ్లు పెట్టండి
ఆదివాసీ భాషలో విద్యకు చర్యలు తీసుకోండి
సీఎంకు వినతి
హైదరాబాద్, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీ విద్యార్థుల కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సివిల్స్ కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలంటూ సీఎం రేవంత్‌రెడ్డిని ఆదివాసీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోరారు. గడిచిన 70 ఏళ్లుగా తెలంగాణ నుంచి ఆదివాసీ వర్గానికి చెందిన ఒక్క సివిల్ సర్వెంట్ కూడా ఎంపిక కాలేదని సీఎం దృష్టికి తెచ్చారు. కనీసం గ్రూప్ 1 అధికారిగా కూడా ఎంపిక కాలేదన్నారు. ప్రత్యేకంగా సివిల్స్ కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి ఆదివాసీ బిడ్డలను ఐఏఎస్, ఐపీఎ్‌సలుగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిని.. శనివారం ఆయన ఛాంబర్లో కలిసిన మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, వెడ్మ బొజ్జు, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు ఈమేరకు వినతిపత్రం సమర్పించారు.
ఈ ప్రత్యేక సివిల్స్ కోచింగ్ సెంటర్లో 500 మంది విద్యార్థులకు సరిపడా సౌకర్యాలు కల్పించాలని కోరారు. అలాగే ఆదివాసీ జిల్లాల్లో ఆదివాసీలకు ప్రత్యేకంగా స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆదివాసీ విద్యార్థుల కోసం జేఈఈ, నీట్ కోచింగ్ సెంటర్లనూ ఏర్పాటు చేయాలన్నారు. ఎంబీబీఎస్, ఇంజినీరింగ్ తదితర కోర్సులకు ఎంపికైన విద్యార్థులకు ఐటీడీఏల ద్వారా ఆర్థిక సాయం అందించాలన్నారు. పోడు పట్టాలు పొందిన ఆదివాసీలకు ఉచిత విద్యుత్తు సౌకర్యం అందించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆదివాసీ భాషలో విద్యను అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
Updated Date - Dec 22 , 2024 | 04:40 AM