MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా.. మళ్లీ టెన్షన్
ABN, Publish Date - Aug 05 , 2024 | 11:08 AM
ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై సోమవారం రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది..
న్యూఢిల్లీ/హైదరాబాద్: దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) ఇప్పట్లో తీహార్ జైలు నుంచి బయటికి వచ్చే మార్గాలు ఏ మాత్రం కనిపించట్లేదు. ఇప్పటికే బెయిల్ పిటిషన్‌ను పలుమార్లు పక్కనెట్టిన రౌస్ అవెన్యూ కోర్టు.. సోమవారం నాడు డీఫాల్ట్ బెయిల్ పిటిషన్ విచారణను యిదా వేసింది. ఆగస్టు-07 కు తదుపరి విచారణను వాయిదా వేస్తున్నట్లు జడ్జ్ కావేరి భవేజా స్పష్టం చేశారు. సీనియర్ అడ్వకేట్ అందుబాటులో లేకపోవడంతో కేసును మరో రోజుకు వాయిదా వేయాలని కోరిన కవిత తరపు లాయర్ కోర్టును కోరారు. ఈ క్రమంలో తదుపరి విచారణను జడ్జ్ కావేరి భవేజా వాయిదా వేశారు. అయితే రౌస్ అవెన్యూ కోర్టులో ఎల్లుండి ఏం జరుగుతుందో ఏమో అని బీఆర్ఎస్‌లో టెన్షన్ పెరిగిపోయింది.
ఇదివరకు ఇలా..!
కాగా.. కవితను మార్చి- 15న తొలుత ఈడీ, ఆ తర్వాత ఏప్రిల్- 11న సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈడీ, సీబీఐ పెట్టిన రెండు కేసుల్లోనూ సాధారణ బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్‌ను గతంలోనే ట్రయల్ కోర్టు కొట్టివేసింది. ఈ ఆదేశాలను ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేయగా అక్కడా నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలోనే ట్రయల్ కోర్టులోనే మళ్లీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని జూలై- 22న విచారించిన ట్రయల్ కోర్టు జడ్జి కావేరి బవేజా కేసును సోమవారానికి(ఆగస్టు-05) వాయిదా వేశారు. దీనిపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనేది ఆసక్తికరంగా మారిన ఈ పరిస్థితుల్లో మరోసారి విచారణ వాయిదా పడింది. ఇదిలా ఉంటే.. తిహాడ్ జైలులో ఉన్న కవితను ఆమె సోదరుడు, మాజీ మంత్రులు కల్వకుంట్ల కేటీఆర్, తన్నీరు హరీశ్‌రావు ఇవాళ కలిసే అవకాశం ఉన్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
Updated Date - Aug 05 , 2024 | 11:38 AM