అధికారంలో అలా.. విపక్షంలో ఇలా!
ABN, Publish Date - Nov 13 , 2024 | 05:30 AM
బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు.. ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ నిర్ణయాలను సమర్థించిందని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నందున స్పీకర్‌ను తప్పుబడుతోందని అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి హైకోర్టు ధర్మాసనానికి తెలిపారు.
స్పీకర్ నిర్ణయాలపై బీఆర్‌ఎస్ ద్వంద్వవైఖరి.. ఎర్రబెల్లి కేసులో డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పే శిరోధార్యం
‘మేఘాచంద్రసింగ్’ తీర్పు ఇక్కడ వర్తించదు
ఎమ్మెల్యేల అనర్హత కేసులో ఏజీ వాదనలు
తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు ధర్మాసనం
హైదరాబాద్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు.. ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ నిర్ణయాలను సమర్థించిందని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నందున స్పీకర్‌ను తప్పుబడుతోందని అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి హైకోర్టు ధర్మాసనానికి తెలిపారు. ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగు వారాల్లో స్పీకర్ విచారణ ప్రారంభించాలని పేర్కొంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ అసెంబ్లీ కార్యదర్శి.. హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం మంగళవారం విచారణ కొనసాగించింది. అప్పీలుదారు అయిన అసెంబ్లీ కార్యదర్శి తరఫున అడ్వకేట్ జనరల్ రిప్లై వాదనలు కొనసాగించారు.
‘ఎర్రబెల్లి దయాకర్‌రావు’ కేసు విచారణ సందర్భంగా నాడు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్.. స్పీకర్ నిర్ణయాలను సమర్థించిందని, ఇప్పుడు మాత్రం వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు. అనర్హత అంశంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ‘ఎర్రబెల్లి దయాకర్‌రావు’ తీర్పే శిరోధార్యమని.. దానినే సింగిల్ జడ్జి అనుసరించాల్సి ఉంటుందని తెలిపారు. అనర్హత పిటిషన్లను స్పీకర్ గరిష్ఠంగా మూడు నెలల్లో తేల్చాలని చెప్తున్న ‘కైశం మేఘాచంద్రసింగ్’ తీర్పు.. సదరు కేసు తాలూకు ప్రత్యేక సందర్భంలో ఆర్టికల్ 142 కింద ఇచ్చిన తీర్పు అని వివరించారు. కాబట్టి, ప్రస్తుత సందర్భానికి అది వర్తించదన్నారు.
స్పీకర్ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమంటూ ఇదే హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ‘ఎర్రబెల్లి దయాకర్‌రావు’ తీర్పు, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసిన ‘ఎస్‌ఏ సంపత్ కుమార్’ తీర్పు ఇక్కడ వర్తిస్తాయని ఏజీ తెలిపారు. అలాగే ఇటీవల మహారాష్ట్ర వ్యవహారంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన ‘సుభాష్ దేశాయి’ తీర్పులో సైతం వీలైనంత వేగంగా పరిష్కరించాలని మాత్రమే చెప్పారు కానీ.. మూడునెలల్లో పరిష్కరించాలని చెప్పలేదని ఏజీ సుదర్శన్‌రెడ్డి గుర్తుచేశారు.
మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్ తరఫున సీనియర్ న్యాయవాది పీ శ్రీరఘురాం వాదనలు వినిపిస్తూ.. ఎమ్మెల్యేల అనర్హత అంశాన్ని సింగిల్ జడ్జి ‘అడ్మినిస్ట్రేటివ్ లా’ కోణంలో చూస్తూ నాలుగువారాల్లో విచారణ మొదలు పెట్టాలి అని ప్రభుత్వ అధికారులను ఆదేశించినట్లుగా తీర్పు ఇవ్వడం చెల్లదన్నారు. ఈ వ్యవహారాన్ని ‘కాన్‌స్ట్యూషనల్ లా’ కోణంలో చూడాలని చెప్పారు. ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (బీజేపీ) తరఫున సీనియర్ న్యాయవాది జే ప్రభాకర్ వాదిస్తూ.. స్పీకర్‌కు ఫిర్యాదు చేసి ఆరునెలలు అవుతోందని, కేవలం పది రోజుల్లో కోర్టుకు వచ్చారని ఏజీ చెప్పడం కరెక్ట్ కాదన్నారు. అన్నివైపుల వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది.
Updated Date - Nov 13 , 2024 | 05:31 AM