Treatment: ప్రోస్టేట్ సమస్యకు నీటి ఆవిరి చికిత్స
ABN, Publish Date - Nov 29 , 2024 | 04:40 AM
కొంతమందిలో అంగస్తంభన, వీర్యస్ఖలన సమస్యలు వస్తున్నాయని.. ఆ ఇబ్బందులు లేకుండా, ప్రోస్టేట్ సమస్యను ‘రెజ్యూమ్ వాటర్ వేపర్ థెరపీ’తో నివారించవచ్చని ఏఐఎన్‌యూ ఆస్పత్రి ఎండీ, చీఫ్ యూరాలజిస్ట్ డాక్టర్ సి.మల్లికార్జున..
అంగస్తంభన, వీర్యస్ఖలన ఇబ్బందులకు చెక్
ఏఐఎన్‌యూ ఎండీ డాక్టర్ సి.మల్లికార్జున
హైదరాబాద్ సిటీ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రోస్టేట్ గ్రంధి ఉబ్బే (ప్రోస్టేట్ ఎన్‌లార్జ్‌మెంట్) సమస్యతో బాధపడేవారికి ‘రెజ్యూమ్ వాటర్ వేపర్ థెరపీ’ అనే చికిత్స ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU)లో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ సమస్యకు కొంతకాలం మందులు వాడి, ఆ తర్వాత శస్త్రచికిత్స చేస్తున్నారు. కానీ, దానివల్ల కొంతమందిలో అంగస్తంభన, వీర్యస్ఖలన సమస్యలు వస్తున్నాయని.. ఆ ఇబ్బందులు లేకుండా, ప్రోస్టేట్ సమస్యను ‘రెజ్యూమ్ వాటర్ వేపర్ థెరపీ’తో నివారించవచ్చని ఏఐఎన్‌యూ ఆస్పత్రి ఎండీ, చీఫ్ యూరాలజిస్ట్ డాక్టర్ సి.మల్లికార్జున గురువారం ఇక్కడ నిర్వహించిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. ఈ చికిత్స చేసిన 15 రోజుల నుంచి నెల రోజుల్లోపు పూర్తి ఫలితాలు కనిపిస్తాయని ఆయన వివరించారు. అయితే.. యుక్తవయసులో ఉండి, ప్రోస్టేట్ సమస్య మధ్యస్థాయిలో ఉన్న రోగులకు ఈ చికిత్స బాగా ఉపయోగపడుతుందని.. వృద్ధుల్లో ఇది అంతగా ప్రభావం చూపించకపోవచ్చునని, అలాగే ప్రోస్టేట్ సమస్య తీవ్రంగా ఉన్నవారికి, లేదా సంక్లిష్ట సమస్యలు ఉన్నవారికి ఇది పనికిరాదని ఆయన స్పష్టం చేశారు.
నీటి ఆవిరిని ఇంజెక్షన్ రూపంలో..
రెజ్యూమ్ వాటర్ వేపర్ థెరపీ చేయడానికి పూర్తిస్థాయిలో మత్తు ఇవ్వాల్సిన పనిలేదని.. లోకల్ ఎనస్థీషియాతోనే ఈ చికిత్స చెయ్యొచ్చని డాక్టర్ మల్లికార్జున తెలిపారు. చికిత్సలో భాగంగా నీటి ఆవిరిని ఇంజెక్షన్ రూపంలో ప్రోస్టేట్ గ్రంధిలోకి పంపుతామని.. ఇలా పంపిన ఆవిరి.. మూత్రనాళాన్ని నొక్కుతూ ఉన్న అదనపు ప్రోస్టేట్ కణజాలాన్ని క్రమంగా ముడుచుకుపోయేలా చేస్తుందని ఆయన వివరించారు. ఇది చాలా సులభమైన చికిత్స అని, 1-2 సిటింగుల్లో అయిపోతుందని వెల్లడించారు. ఈ చికిత్స వల్ల అంగస్తంభన సమస్య, వీర్య స్ఖలనం సరిగా లేకపోవడం వంటి దుష్ప్రభావాలేవీ ఉండవని పేర్కొన్నారు. అయితే.. ఈ చికిత్స తీసుకున్న తర్వాత కొన్ని రోజుల పాటు కాఫీ, చాక్లెట్లు, మద్యం తీసుకోకూడదని తెలిపారు. కాగా.. ఈ ప్రెస్‌మీట్‌లో ఏఐఎన్‌యూకు చెందిన సీనియర్ యూరాలజిస్ట్ డాక్టర్ సయ్యద్ మహ్మద్ గౌస్, యూరాలజిస్ట్ డాక్టర్ విజయ్ కుమార్ శర్మ, యూరాలజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సందీప్ గూడూరు తదితరులు పాల్గొన్నారు.
ప్రోస్టేట్ గ్రంధి ఉబ్బితే..
వయసు మీదపడే కొద్దీ పురుషుల్లో ప్రోస్టేట్ గ్రంధి ఉబ్బడం సహజం. అయితే, చాలా మందిలో దీని లక్షణాలేవీ కనపడవు. 40 శాతం మందిలో మాత్రం.. మూత్రవిసర్జన ఆపుకోలేకపోవడం, తెలియకుండానే మూత్రం కారిపోవడం, రాత్రిళ్లు తరచు మూత్రానికి లేవాల్సి రావడం, మూత్రం నెమ్మదిగా పడడం, మూత్రం పోయాలంటే పొట్ట బాగా ఒత్తాల్సి రావడం, మూత్రం పోసినా బ్లాడర్ ఖాళీ అయినట్లు అనిపించకపోవడం లాంటివి ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Egg Rate: సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న కోడిగుడ్డు ధర.. ఒక్కో గుడ్డు ఎంతకు చేరిందంటే.
Telangana: తెలంగాణ మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ..
Updated Date - Dec 01 , 2024 | 01:23 PM