Allu Arjun: నా నిర్లక్ష్యం లేదు..!
ABN, Publish Date - Dec 12 , 2024 | 03:39 AM
పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందడం దురదృష్టకరం అని.. అయితే ఆ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని సినీనటుడు అల్లు అర్జున్ పేర్కొన్నారు.
ప్రీమియర్ షోకు వస్తున్నట్లు పోలీసులకు, థియేటర్ యాజమాన్యానికి ముందే చెప్పా
తొక్కిసలాట, మహిళ మృతి ఘటనతో నాకు సంబంధం లేదు: అల్లు అర్జున్
తనపై కేసు కొట్టేయాలంటూ హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందడం దురదృష్టకరం అని.. అయితే ఆ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని సినీనటుడు అల్లు అర్జున్ పేర్కొన్నారు. తాను ప్రీమియర్ షో కోసం థియేటర్‌కు వచ్చినంత మాత్రన రేవతి మృతికి కారణమైనట్లు కాదని చెప్పారు. తన సినిమా విడుదలైన రోజు థియేటర్‌కు హాజరవ్వడం అనేది తాను మొదటి నుంచీ పాటిస్తున్న సంప్రదాయం అని, పైగా పుష్క-2 ప్రీమియర్ షో కోసం తాను సంధ్య థియేటర్‌కు వస్తున్నట్లు పోలీసులు, థియేటర్ యాజమాన్యానికి రెండు రోజుల ముందే సమాచారం అందించానని, అలాంటప్పుడు తనకు నేరాన్ని ఎలా ఆపాదిస్తారు? అని ప్రశ్నించారు. ఈ మేరకు రేవతి మృతి కేసులో తనను నిందితుడిగా చేరుస్తూ చిక్కడపల్లి పోలీసులు పెట్టిన కేసు కొట్టేయాలని పేర్కొంటూ అల్లు అర్జున్ హైకోర్టులో బుధవారం క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ‘పిటిషనర్ (అల్లు అర్జున్)ను నిందితుడిగా చేర్చడానికి కావాల్సిన ఆధారాలు లేవు.
అక్రమంగా కేసు పెట్టడం వల్ల క్రిమినల్ ట్రయల్‌ను ఎదుర్కోవాల్సి వస్తే పిటిషనర్‌కు ఉన్న పేరు ప్రతిష్ఠలు దెబ్బతింటాయి. పిటిషనర్‌పై ఎలాంటి ఆరోపణ లేకుండా యాంత్రికంగా కేసు నమోదు చేశారు. ఘటన జరగడానికి ముందే ఏసీపీ, డీసీపీ వంటి సీనియర్ పోలీసు అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సినిమా ప్రదర్శనకు పిటిషనర్ హాజరయ్యారు కాబట్టి క్రిమినల్ ఉద్దేశాలను ఆపాదించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం కరెక్ట్ కాదు. హత్య చేయాలనే ఉద్దేశంతో దాడి వంటి తీవ్రమైన సెక్షన్లకు.. ఘటనా స్థలం వద్ద వాస్తవంగా జరిగిన ఘటనలకు ఎలాంటి సంబంధం లేదు. మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదులో సైతం ఘటనతో పిటిషనర్‌కు సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆరోపణ చేయలేదు. ఎలాంటి వాస్తవిక, న్యాయపరమైన ఆధారం లేని ఈ కేసు కొనసాగితే పిటిషనర్‌కు మానసిక వ్యఽథే మిగులుతుంది. పేరుప్రతిష్ఠలు దెబ్బతిని, అవి పునరుద్ధరించలేని విధంగా నష్టం జరుగుతుంది’ అని అల్లు అర్జున్ తరఫున ఆయన న్యాయవాది పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇది త్వరలో హైకోర్టు సింగిల్ జడ్జి ఎదుట విచారణకు రానుంది. కాగా రేవతి మృతితో తమకు ఎలాంటి సంబంధం లేదని..సంధ్య సినీ ఎంటర్‌ప్రైజెస్, సంధ్య యజమానులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌లో వివరణ ఇవ్వాలని జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ధర్మాసనం బుధవారం పోలీసులకు నోటీసులు జారీచేసింది.
Updated Date - Dec 12 , 2024 | 09:14 AM