Anirudh Reddy: చంద్రబాబు ఒక కన్నును పొడుచుకున్నారా?
ABN, Publish Date - Oct 22 , 2024 | 03:26 AM
‘‘విభజన సందర్భంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రెండు కళ్లలాంటివి అని వ్యాఖ్యానించిన చంద్రబాబు.. నేడు ఒక కన్నును పొడుచుకున్నారా?’’ అని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి ప్రశ్నించారు.
తెలంగాణపై చిన్న చూపెందుకు?
శ్రీవారి దర్శనం, వసతి గదుల కోసం
మా లేఖలను తీసుకోకపోవడం బాధాకరం
ఏపీ నేతలకు తెలంగాణలో వ్యాపారాల్లేవా?
తీరు మార్చుకోకపోతే అసెంబ్లీలో తీర్మానం
తిరుమలలో ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి
ఈవో తీరు బాధాకరం: ఎమ్మెల్సీ వెంకట్
తిరుమల/జడ్చర్ల, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : ‘‘విభజన సందర్భంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రెండు కళ్లలాంటివి అని వ్యాఖ్యానించిన చంద్రబాబు.. నేడు ఒక కన్నును పొడుచుకున్నారా?’’ అని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌తో కలిసి సోమవారం తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలను ఆమోదించబోమని డయల్ యువర్ ఈవో కార్యక్రమంలోనే వెల్లడించారని, ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తిరుమలలో ఒక గది ఇప్పించాలని తన నియోజకవర్గానికి చెందిన కుటుంబ సభ్యులు కోరితే, ఇప్పించలేని పరిస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు యాదాద్రి, భద్రాచలం తదితర పుణ్యక్షేత్రాలలో దర్శనాల విషయంలో ఈవోలకు ఫోన్ చేస్తే దర్శనాలు కల్పిస్తున్నారని, మరి తెలంగాణపై ఎందుకింత చిన్నచూపు అని ప్రశ్నించారు.
‘వైసీపీ అధికారంలో ఉంటే టీడీపీ నేతలు, టీడీపీ అధికారంలో ఉంటే వైసీపీ నేతలు తెలంగాణలో వ్యాపారాలు చేసుకునేందుకు వస్తారు. మేము ఏనాడూ ఒక్క మాట మాట్లాడలేదు. మా ఎమ్మెల్యేలందరం కలిసి తీర్మానం చేసుకుని మీరు అక్కడికి రావద్దంటే మీకెలా అనిపిస్తుంది. దయచేసి ఇప్పటికైనా పార్టీలకతీతంగా తెలంగాణ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలు తీసుకోండి. లేదంటే డిసెంబరులో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలందరం కలిసి నిర్ణయం తీసుకుంటే మీరు బాధపడతారు. అన్నదమ్ములమన్నారు... అన్నదమ్ములుగానే ఉండండి. కేవలం వ్యాపారం కోసమే తెలంగాణకు రాకండి’ అని హెచ్చరించారు. ఎంతో బాధతో తాను ఈ అంశాలను ప్రస్తావిస్తున్నానని చెప్పారు. ఇప్పటికైనా తిరుమల దర్శనాలు, వసతి గదులకు తెలంగాణ ఎమ్మెల్యేల సిఫారసుల లేఖలను ఆమోదించాలని కోరారు. ఎమ్మెల్సీ వెంకట్ మాట్లాడుతూ టీటీడీ ఈవో, ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాఽధాకరమన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తగిన గౌరవం ఇవ్వాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
Updated Date - Oct 22 , 2024 | 03:26 AM