Krishna Basin: కృష్ణా జలాల వినియోగాన్ని సమీక్షించొద్దు
ABN, Publish Date - Sep 14 , 2024 | 03:33 AM
కృష్ణా బేసిన్‌లో పాత ప్రాజెక్టుల కింద నీటి వినియోగానికి రక్షణ ఉందని, ఆ అంశాన్ని సమీక్షించడం సరికాదని బ్రిజేశ్ ట్రైబ్యునల్ ఎదుట ఆంధ్రప్రదేశ్ పేర్కొంది.
బ్రిజేశ్ ట్రైబ్యునల్‌లో ఏపీ రీజాయిండర్ దాఖలు
సమీక్షించాలన్న తెలంగాణ... నెలాఖరులో విచారణ
హైదరాబాద్, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): కృష్ణా బేసిన్‌లో పాత ప్రాజెక్టుల కింద నీటి వినియోగానికి రక్షణ ఉందని, ఆ అంశాన్ని సమీక్షించడం సరికాదని బ్రిజేశ్ ట్రైబ్యునల్ ఎదుట ఆంధ్రప్రదేశ్ పేర్కొంది. కాలానుగణంగా వినియోగాన్ని సమీక్షించాల్సిందేనని తెలంగాణ విజ్ఞప్తి చేసింది. కృష్ణా జలాల పంపిణీపై జస్టిస్ బ్రిజే్‌షకుమార్ ట్రైబ్యునల్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే స్టేట్‌మెంట్ ఆఫ్ కేసు(ఎ్‌సవోసీ)లు దాఖలు చేశాయి. వాటిపై రెండు రాష్ట్రాలు కౌంటర్లు, రీజాయిండర్లు సమర్పించాయి. బచావత్ ట్రైబ్యునల్ ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల కృష్ణా జలాలను గంపగుత్తగా కేటాయించిందని, ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీరణతో రెండు రాష్ట్రాలు ఏర్పడినందున బేసిన్ పారామీటర్‌ను పరిగణనలోకి తీసుకొని నీటి కేటాయింపులు చేయాలని తెలంగాణ కోరింది.
కాలానుగుణంగా సమీక్ష చేయాల్సిందేనని విజ్ఞప్తి చేసింది. ఏపీ మాత్రం దీన్ని వ్యతిరేకించింది. ఇప్పటికే ఉన్న వినియోగాన్ని సమీక్షించరాదని నివేదించింది. దీనికి తెలంగాణ బదులిస్తూ కృష్ణా జలాలను బేసిన్ లోపలి ప్రాంతాలకే కేటాయించాలని, తెలంగాణ అవసరాలను కాదని.. ఇతర బేసిన్లకు నీటిని తరలించడం సరికాదని పేర్కొంది. పోలవరం ద్వారా కృష్ణా డెల్టాకు తరలించే 80టీఎంసీలకు బదులుగా... సాగర్ ఎగువన ఉన్న ప్రాంతాలు 80 టీఎంసీలను వాడుకోవచ్చని, ఆ వాటాలోని 45టీఎంసీలనే పాలమూరు-రంగారెడ్డికి తెలంగాణ కేటాయించుకుందని ఏపీ గుర్తు చేసింది. ఆ నీటిపై ఉమ్మడి ఏపీకి అధికారం ఉందని నివేదించింది. ఆ జలాలపై తమకే పూర్తి అధికారం ఉందని తెలంగాణ బదులిచ్చింది. చర్చించే అంశాలపై ఇప్పటికే స్పష్టత రావడంతో ఈ నెలాఖరులో ట్రైబ్యునల్ విచారణ ప్రారంభం కానుంది.
Updated Date - Sep 14 , 2024 | 03:33 AM