ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: లేబర్‌ సెస్‌ పంపకానికి ఓకే

ABN, Publish Date - Dec 03 , 2024 | 04:03 AM

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ నడుమ రూ.861 కోట్ల లేబర్‌ సెస్‌ నిధుల పంపకంపై ఏకాభిప్రాయం కుదిరింది. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌ నిధుల పంపకాలకు సంబంధించిన వివాదాలపై చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి.

  • తెలుగు రాష్ట్రాల మధ్య కుదిరిన ఏకాభిప్రాయం

  • క్లాస్‌, 3, 4 ఉద్యోగుల చేరికకు మరో 45 రోజులు!

  • వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌ నిధుల వివాదాలు కొలిక్కి

  • విద్యుత్‌ బకాయిలు, షెడ్యూల్‌ 9పై రాని పరిష్కారం

  • విభజన సమస్యలపై.. సీఎస్‌ల నేతృత్వంలో భేటీ

  • 15 అంశాలపై సుదీర్ఘ చర్చ.. డ్రగ్స్‌పై సంయుక్త కమిటీ

అమరావతి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ నడుమ రూ.861 కోట్ల లేబర్‌ సెస్‌ నిధుల పంపకంపై ఏకాభిప్రాయం కుదిరింది. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌ నిధుల పంపకాలకు సంబంధించిన వివాదాలపై చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. అలాగే, రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల బదిలీకి మరో 45 రోజుల సమయం ఇవ్వాలని సోమవారం మంగళగిరి (ఏపీ)లోని ఏపీఐఐసీ భవనంలో జరిగిన ఉన్నతస్థాయి అధికారుల కమిటీ భేటీలో నిర్ణయించారు. ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారం నిమిత్తం జరిగిన ఈ సమావేశానికి.. ఏపీ సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌, తెలంగాణ సీఎస్‌ శాంతికుమారి అధ్యక్షత వహించారు. మొత్తం రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కావాల్సిన సమస్యలు 15 ఉండగా.. లేబర్‌ సెస్‌ పంపకాలు, ఉద్యోగుల బదిలీ గడువు, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌ నిధుల పంపకాల వ్యవహారాలు ఈ భేటీలో ఒక కొలిక్కి వచ్చాయి. ఇరు రాష్ట్రాలనూ తీవ్రంగా వేధిస్తున్న డ్రగ్స్‌, గంజాయి నివారణపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని.. డ్రగ్‌ ట్రాఫికింగ్‌ నిరోధం కోసం రెండు రాష్ట్రాల పోలీస్‌, ఎక్సైజ్‌ శాఖల అధికారులతో జాయింట్‌ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే.. అత్యంత కీలకమైన షెడ్యూల్‌ 9లోని సంస్థల విభజన, విద్యుత్‌ బకాయిలపై మాత్రం సయోధ్య కుదరలేదు.


  • ఆ వివాదాలు కొలిక్కి..

వాణిజ్య పన్నుల శాఖ పరిధిలో ఉండే ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ 2014 మే నాటికి రూ.208.24 కోట్లు ఉందని రెండు రాష్ట్రాల అధికారుల సమక్షంలో 2017 జూన్‌ 6న ఏజీ నిర్ణయించింది. ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను డీలర్లవారీగా సర్దుబాటు చేయడానికి ఏపీ సర్కా రు మార్గదర్శకాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా డీలర్లవారీ సర్దుబాటు పూర్తిచేయాలని కోరింది. తెలంగాణ నివేదిక వచ్చాకే ఈ అంశంపై ముందుకెళ్లాలని భేటీలో నిర్ణయించారు. 2014 మే నెలకు సంబంధించిన ఎక్సైజ్‌ ఆదాయాన్ని జూన్‌లో ఏపీకి రూ.295 కోట్లు, తెలంగాణకు రూ.350 కోట్లు చెల్లించినట్టు తెలంగాణ ప్రభుత్వం 2015 ఫిబ్రవరి 6న లేఖ రాసింది. అయితే, ఏపీకి చెల్లించిన రూ.295 కోట్లలో జూన్‌ నెల ఆదాయం కూడా ఉందని, దీనివల్ల తెలంగాణ తనకు రావాల్సిన ఆదాయంలో రూ.81.1 కోట్లు నష్టపోయిందని, ఆ మేరకు ఏపీకి అదనంగా సొమ్ము వెళ్లిందని తెలంగాణ చెప్తోంది. అయితే, జూన్‌లో ఏపీ ట్రెజరీకి 2014 మే నెల ఆదాయం రాలేదని, తెలంగాణ చెప్తున్నట్టుగా రూ.295 కోట్లు జమ అయినట్టు తమ వద్ద రికార్డులు లేవని ఏపీ చెప్తోంది. ఈ వివాదంపై స్పష్టత రావడం కోసం ఏజీ వద్ద ఉన్న వివరాలు పరిశీలించి దాని ప్రకారం ఈ వివాదం పరిష్కరించుకోవాలని సూత్రప్రాయ అంగీకారానికి వచ్చారు. అలాగే 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏపీ ఖాతాలో జమ చేసిన కేంద్ర ప్రభుత్వప్రాయోజిత పథకాల గ్రాంట్లను రెండు ప్రభుత్వాలూ లెక్క చూసుకుని పంచుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ విభాగంలో మొత్తం 4పథకాలకింద పంచుకోవాల్సిన గ్రాంట్లు రూ.5991.22కోట్లు ఉన్నాయి. ఇక.. రాష్ట్రం విడిపోయేనాటికి అమల్లో ఉన్న 15 ఈఏపీ ప్రాజెక్టులకు సంబంధించి మరోసారి రెండు రాష్ట్రాలూ లెక్కలు చూసుకుని చెల్లింపులు చేసుకోవాలని అధికారులు నిర్ణయించారు. షెడ్యూల్‌ 9, 10లోని సంస్థల బ్యాంకు ఖాతాల్లో పంపకం కాకుండా మిగిలిపోయిన రూ.8 వేల కోట్లపైనా ఈ భేటీలో చర్చించారు. షెడ్యూల్‌ 9లోని సంస్థల విభజనపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు.


  • కోర్టులో తేల్చుకుందాం..

ఉన్నతాధికారుల సమావేశంలో విద్యుత్‌ బకాయిలు చర్చకు వచ్చిన సమయంలో ‘‘ఆపర్చ్యునిటీ’’ విధానం లో ఏపీ తమకు రూ. 21,000 కోట్లను ఇవ్వాలని తెలంగాణ డిమాండ్‌ చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ అకస్మాత్తుగా విద్యుత్‌ సరఫరాను నిలిపివేయడం వల్ల.. తాము బహిరంగ మార్కెట్లో అధిక ధరలు చెల్లించి విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి వచ్చిందని రాష్ట్ర అధికారులు తెలిపారు. తాము ఖర్చు చేసిన ఆ మొత్తాన్ని చెల్లించాల్సిందేనని పట్టుబట్టారు. దీనికి ఏపీ అధికారులు.. తమకు తెలంగాణ నుంచి విద్యుత్‌ బకాయిల కింద రూ. 14,000 కోట్ల దాకా రావాల్సి ఉందని.. తాము సరఫరా చేసిన విద్యుత్‌కు తెలంగాణ ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించి ఉంటే తామెందుకు కరెంటు సరఫరాను నిలిపివేసేవారమని ప్రశ్నించారు. ఆస్తులు, అప్పుల పంపకంలో భాగంగా రెవెన్యూ రిజర్వ్‌ నుంచి విద్యుత్‌ బకాయిలను మినహాయించుకోవాలని ఏపీకి తెలంగాణ సూచించగా.. ఆ పంపకాలు తేలాక ఇక రెవెన్యూ రిజర్వు ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. విద్యుత్‌ బకాయిల వివాదం ఎటూ తేలకపోవడంతో.. దీన్ని రెండు రాష్ట్రాల విద్యుత్‌ సంస్థలే తేల్చుకోవాలని ఏపీ సీఎస్‌ సూచించారు.


అలా రెండు కంపెనీల మధ్య తేలిపోయే వివాదమైతే ఇన్నాళ్లు ఎందుకు పరిష్కారం కాకుండా ఉంటుందన్న తెలంగాణ సీఎస్‌ శాంతి కుమారి.. ఈ వివాదం న్యాయస్థానంలో తేలాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ అంశంపై వాదప్రతివాదాలు జరిగాయి. చివరకు.. న్యాయస్థానమే దీనికి పరిష్కారం చూపుతుందని రెండు రాష్ట్రాల అధికారులూ అభిప్రాయపడ్డారు. కాగా.. రెండు రాష్ట్రాల సీఎ్‌సల అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో తెలంగాణ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు, హోం ప్రత్యే క ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీ్‌పకుమార్‌ సుల్తానియా, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్‌రావు, ఎక్సై జ్‌ ముఖ్య కార్యదర్శి రిజ్వీ, కార్మిక ముఖ్య కార్యదర్శి సంజయ్‌కుమార్‌, పౌరసరఫరాల కమిషనర్‌ డీఎస్‌ చౌహన్‌ పాల్గొన్నారు. ఏపీ నుంచి.. ఆర్థిక శాఖ కార్యదర్శి జానకి, హోం ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌, ఎక్సైజ్‌ ముఖ్య కార్యదర్శి ముఖేశ్‌ కుమార్‌ మీనా, ఏపీ జెన్కో సీఎండి చక్రధర్‌బాబు, వాణిజ్యపన్నుల శాఖ చీఫ్‌ కమిషనర్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.


  • ఫ్రీజింగ్‌ ఎత్తివేత..

లేబర్‌ సెస్‌కు సంబంధించి రూ.861.35 కోట్లలో.. రూ.732.18 కోట్ల ఎఫ్‌డీలను తెలంగాణ ప్రభుత్వం ఫ్రీజ్‌ చేసింది. రూ.129.19 కోట్లు సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతాలో ఉన్నాయి. ఎఫ్‌డీల మీద ఫ్రీజింగ్‌ ఎత్తేయాలని ఏపీ అధికారులు ఈ సమావేశంలో కోరగా తెలంగాణ అధికారులు సానుకూలంగా స్పందించారు. దీనికి సంబంధించి పన్నులు చెల్లించి, తెలంగాణ వాటా నుంచి వాడిన మొత్తాన్ని తగ్గించాక.. మిగిలిన డబ్బును పంచుకోవాలని రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు నిర్ణయించారు. అలాగే.. ఏపీ నుంచి తెలంగాణకు, తెలంగాణ నుంచి ఏపీకి శాశ్వతంగా వెళ్లాలనుకుంటున్న క్లాస్‌ 3, క్లాస్‌ 4 ఉద్యోగులకు అందుకు మరో 45 రోజుల సమయం ఇవ్వాలని నిర్ణయించారు.

Updated Date - Dec 03 , 2024 | 04:03 AM