Bandi Sanjay: రేవంత్‌ను దించేందుకు మంత్రుల కుట్ర
ABN, Publish Date - Oct 19 , 2024 | 03:36 AM
రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి దించేయాలని కాంగ్రెస్ మంత్రులు, నాయకులు కుట్రలు చేస్తున్నారని, తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.
ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత
ఇంకా పెరగాలని వారు చూస్తున్నారు
ఆ తర్వాత కుర్చీ నుంచి దించేస్తారు
గ్రూప్-1, హైడ్రా, మూసీలపై జాగ్రత్త
పడకపోతే రేవంత్‌కు చిక్కులు తప్పవు
గ్రూప్-1 మెయిన్స్‌ను రీషెడ్యూల్ చేయాలి: బండి సంజయ్
కరీంనగర్/హైదరాబాద్, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి దించేయాలని కాంగ్రెస్ మంత్రులు, నాయకులు కుట్రలు చేస్తున్నారని, తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. గ్రూప్ 1, మూసీ, హైడ్రా విషయాల్లో జాగ్రత్తపడకపోతే రేవంత్‌కు చిక్కులు తప్పవని హెచ్చరించారు. హైడ్రా, మూసీ, గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనలతో రేవంత్‌పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, ఆ వ్యతిరేకత ఇంకా పెరగాలని మంత్రులు భావిస్తున్నట్లు సంజయ్ చెప్పారు. ఆ తర్వాత రేవంత్‌ను సీఎం పదవి నుంచి తొలగిస్తారన్నారు.
గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనతో కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందన్నారు. శుక్రవారం కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను రీ షెడ్యూల్ చేయాలని, మొండిగా వ్యవహరించవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రూప్-1 అభ్యర్థులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జీ చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ‘‘మహిళా అభ్యర్థులను అర్ధరాత్రి అరెస్టు చేయడానికి ఎంత ధైర్యం’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆదేశాల మేరకు శనివారం అశోక్‌నగర్ వెళ్లి గ్రూప్ 1 అభ్యర్థులకు సంఘీభావం తెలుపుతానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా జీవో-29ను తీసుకువచ్చిందని, చేసిన తప్పును సరిదిద్దుకోకుండా రాక్షసంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే తెలంగాణను ప్రేమ దుకాణం (మొహబ్బత్ కి దుకాన్) చేస్తానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఎన్నికలప్పుడు వాగ్దానం చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ.. రాష్ట్రం ఇప్పుడు విద్వేషాల బజార్(నఫ్రత్ కా బజార్) గా మారిందని సంజయ్ అన్నారు. నిరుద్యోగులకు బ్రాండ్ అంబాసిడర్‌లాగా కేటీఆర్ ఫోజులు కొడుతున్నారని, బీఆర్‌ఎ్‌సకు నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హతే లేదని ఆయన స్పష్టం చేశారు.
మూసీపై రేవంత్ రోజుకో మాట
మూసీ సుందరీకరణపై సీఎం రేవంత్ రోజుకో మాట మాట్లాడుతున్నారని సంజయ్ విమర్శించారు. మూసీ సుందరీకరణకు లక్షన్నర కోట్లు ఖర్చుచేస్తామని ప్రభుత్వం పలు సందర్భాల్లో చెప్పిందన్నారు. మూసీ ప్రక్షాళనకు ప్రపంచ బ్యాంకు అప్పుకోసం కాంగ్రెస్ ప్రభుత్వం సాగిల పడుతోందన్నారు. మూసీ పేరుతో లక్షన్నర కోట్ల దోపిడీకి బీజేపీ వ్యతిరేకమని చెప్పారు. ‘‘11వేల కొంపలను కూల్చివేయడమే పునరుజ్జీవమా’’ అని సంజయ్ ప్రశ్నించారు. కాగా, మూసీపై శుక్రవారం కేటీఆర్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఓ జోక్ అని సంజయ్ ఎద్దేవా చేశారు.
లాఠీచార్జి అమానుషం: లక్ష్మణ్
శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న గ్రూప్-1 అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడం అమానుషమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మండిపడ్డారు. హాస్టళ్లలోకి చొరబడి చదువుకుంటున్న విద్యార్థులను కూడా బయటకు గుంజుకొచ్చి రక్తం చిందేలా కొట్టడం దుర్మార్గమని, నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోందనడానికి ఇదే నిదర్శనం అని విమర్శించారు. నిరుద్యోగులు చేసిన తప్పేంది? అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.
Updated Date - Oct 19 , 2024 | 07:14 AM